తొలి సినిమా 'చూసి చూడంగానే'తో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న హీరో శివ కందుకూరి. ఇప్పుడు 'భూతద్ధం భాస్కర్ నారాయణ' అనే యూనిక్ క్రైమ్ థ్రిల్లర్ తో రాబోతున్నారు. ఇప్పటికే ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్ తో మంచి బజ్ ని క్రియేట్ చేసిందీ సినిమా. మార్చి1న సినిమా ప్రేక్షకుల మందుకు వస్తున్న నేపధ్యంలో సినిమా సంగతులతో పాటు మరిన్ని విశేషాలని పంచుకున్నారు శివ కందుకూరి.
'నాన్న (రాజ్ కందుకూరి) పరిశ్రమలో వున్నారని కాదు, నాకు స్వతహాగా చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. అయితే నాన్న పరిశ్రమలో వుండటం వలన, సినిమా వాతావరణం ఇంట్లో వుండటం వలన, ఆ ప్రభావం ఇంకా ఎక్కువగా పడిందని భావిస్తాను’
'యూఎస్ లో ఎనర్జీ ఇంజనీరింగ్ చేశాను. అప్పుడు హాబీ కింద రెండేళ్ళ పాటు థియేటర్ క్లబ్ లో జాయిన్ అయ్యాను. అక్కడ వారంతాల్లో చిన్న చిన్న నాటికలు ప్రదర్శించేవాళ్ళం. అప్పుడు వచ్చిన ప్రశంసలని చాలా ఆస్వాదించాను. తర్వాత ఇండియా వచ్చినపుడు 'చూసి చూడంగానే' కథని చేయాలనే ప్రయత్నాల్లో వున్నారు నాన్న. కానీ దాని కోసం అనుకున్న హీరో డేట్స్ లో ఎదో సమస్య వచ్చింది. దర్శకుడు నన్ను ఆ పాత్రలో పర్ఫెక్ట్ అన్నారు. దాని కోసం ఓ డెమో షూట్ చేశాం, అది నాన్నకు నచ్చిన తర్వాతే ప్రాజెక్ట్ లోకి వెళ్లాను'
'సినిమా పరిశ్రమలో ఎత్తుపల్లాలు ఉంటాయని మానసికంగా బలంగా నిశ్చయించుకునే వచ్చాను. సినిమా ఫలితం ఎలా వున్నా పాత్రని, సినిమాని చేసే క్రమాన్ని చాలా ఆస్వాదించాను. అమెరికాలో మంచి ఉద్యోగం వదిలేసాననే రిగ్రెట్ ఎప్పుడూ లేదు'
'తాత (సద్గురు శివానందమూర్తి) జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించమనే ఎప్పుడూ చెప్పేవారు. ఆయన వెళ్ళిపోయే ముందు సినిమాల్లోకి వెళ్ళాలనే నా కోరికను ఆయనతో పంచుకున్నాను. ఏది చేసిన పరిమితులు దాటకుండా, విలువలకు కట్టుబడి చేయాలని చెప్పారు. ఆయనకి చెప్పి సినిమాల్లోకి వచ్చాననే సంతృప్తి వుంది'
'భూతద్ధం భాస్కర్ నారాయణ' యునిక్ క్రైమ్ థ్రిల్లర్. తెలుగు సినిమాల్లో ఇప్పటివరకూ ఇలాంటి ట్రీట్మెంట్ తో సినిమా రాలేదు. డిఫరెంట్ ప్రజెంటేషన్ వుంది. కథలో ఓ మైథలాజికల్ ఎలిమెంట్ యాడ్ అయ్యింది. అది చాలా ఆసక్తికరంగా వుంటుంది. ఇందులో డిటెక్టివ్ రోల్ కూడా చాలా యూనిక్ గా డిజైన్ చేశాం. ఇందులో ఫన్ ఎలిమెంట్ కూడా వుంటుంది. సినిమా చుస్తున్నప్పుడు అది బాగా కనెక్ట్ అవుతుంది. సినిమా చాలా ఎంగేజింగ్ వుంటుంది. ఖచ్చితంగా సినిమా కెరీర్ కి హెల్ప్ అవుతుంది అని నమ్ముతున్నా’.
'భూతద్ధం భాస్కర్ నారాయణ'లో మంచి సిజీ వర్క్ కూడా వుంది. మొదట ఒక టీంతో చేశాం. అది మాకు పెద్ద తృప్తిని ఇవ్వలేదు. దాన్ని ట్రాష్ చేసి మళ్ళీ కొత్త టీంతో వెళ్లాం. చాలా మంచి అవుట్ పుట్ వచ్చింది. నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా సినిమాని చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం వుంది.’
ఇప్పుడు నాకు వస్తున్న కథలపై ఆనందంగా వున్నాను. 'భూతద్ధం భాస్కర్ నారాయణ' తర్వాత వచ్చే మూడు సినిమాలపై చాలా తృప్తిగా వున్నాను. మార్చిలో ఓ సినిమా షూటింగ్ మొదలుకాబోతుంది.