కావలెను: వారికి అభ్యర్థులు.. వీరికి టికెట్లు!

పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ మూడో వంతు సీట్లు తీసుకోవాలని జన సైనికులు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అంటే ఏమిటన్నమాట? ఇంచుమించుగా 60 సీట్లు తీసుకోవాలనేది పార్టీ…

పొత్తుల్లో భాగంగా జనసేన పార్టీ మూడో వంతు సీట్లు తీసుకోవాలని జన సైనికులు పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెచ్చారు. అంటే ఏమిటన్నమాట? ఇంచుమించుగా 60 సీట్లు తీసుకోవాలనేది పార్టీ వారి కోరిక! అన్ని సీట్లు తాను అడగడం కూడా కామెడీగా ఉంటుందని ముందుగానే గ్రహించారు. అందుకే ఆయన పార్టీ కార్యకర్తలు, నాయకులతో మీటింగు పెట్టుకున్న ప్రతిసారీ.. గత ఎన్నికల్లో మీరు జనసేనకు కనీసం పదిసీట్లు అయినా గెలిపించి ఉంటే.. ఇప్పుడు నేను 50-60 సీట్లు అడగడానికి బాగుండేది… అని ఇండైరక్టుగా చెబుతూ వచ్చారు.

ఇచ్చింది పుచ్చుకోవాల్సిందే తప్ప డిమాండ్ నడవదని పవన్ ముందే గ్రహించారు. మొత్తానికి 24 సీట్లు దక్కాయి. అయితే.. ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న ఏంటంటే.. అసలు ఆ 24 స్థానాలకు జనసేనకు అభ్యర్థులు సిద్ధంగానే ఉన్నారా? లేదా, ఇప్పుడు సీట్లు తేలిన తర్వాత మనుషులను వెతుక్కునే ప్రయత్నంలో ఉన్నదా? అనేది!

జనసేన పార్టీ యొక్క బలహీనత తెలంగాణ ఎన్నికల్లోనే బయటపడిపోయింది. అక్కడ 119 స్థానాలకు గాను కేవలం 8 సీట్లను పొత్తుల్లో భాగంగా బిజెపి నుంచి పుచ్చుకున్నారు పవన్. అన్నిచోట్లా డిపాజిట్ కోల్పోయారు. తమాషా ఏంటంటే.. ఆ ఎనిమిదిలో కనీసం నాలుగు స్థానాలకు పైగా ఆయనకు అభ్యర్థులు లేరు. సీట్ల పంపకాలు జరిగిన తర్వాత.. అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చి చేరిన ఇతరులకు టికెట్లు కట్టబెట్టారు.

అభ్యర్థులు, నాయకత్వం పరంగా బలహీనమైన పార్టీ అని ఆయన నిరూపించుకున్నారు. తెలంగాణలో అయిన పరాభవం ఏదో అయింది.. కానీ ఏపీలో పరిస్థితి ఇలా ఉండకపోవచ్చునని ప్రజలంతా అనుకున్నారు. అక్కడ పవన్ కులం ఫాలోయింగ్ ఎక్కువ కాబట్టి అభ్యర్థులకు కొరత ఉండదనుకున్నారు. కానీ పరిస్థితి మాత్రం ఏపీలో కూడా అంచనాలకు భిన్నంగా ఉంది. 24 సీట్లు దక్కాయి గానీ.. అన్ని సీట్లకూ అభ్యర్థులు లేరు. మనుషుల్ని ఇప్పుడు వెతుక్కునే పరిస్థితి ఉంది. ఇతర పార్టీల నుంచి ఇప్పటికిప్పుడు వలసలను ఆహ్వానించే దుస్థితి ఉంది.

ఇతర పార్టీల్లో ఠికానా లేని వారికి టికెట్లు కావాలి.. పవన్ కల్యాణ్ కు అభ్యర్థులు కావాలి. అందుకే వారిని ఆహ్వానిస్తున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు వైసీపీ నుంచి జనసేనలోకి వచ్చారు. సుబ్బరాయుడుకు టికెట్ ఇస్తారా ఇవ్వరా? సుబ్బరాయుడు వస్తే తప్ప పోటీచేయడానికి తగిన వారు జనసేనలో లేరనే కదా దాని అర్థం.

24 సీట్లు పుచ్చుకున్న పవన్ కల్యాణ్ ఇప్పటికి కేవలం అయిదుగురి పేర్లే ప్రకటించారు. మిగిలిన 19 స్థానాల్లో పార్టీకి పదేళ్లుగా సేవ చేస్తున్న వారు ఎందరికి దక్కుతుందో.. కొత్తగా వచ్చేవారు ఎందరికి దక్కుతుందో వేచిచూడాలి.