మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్. భీమవరం నుంచి జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పోటీ నుంచి తప్పుకున్నారని సమాచారం. ఈ స్థానంలో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత పులపర్తి అంజిబాబును చంద్రబాబు నిలపనున్నారు. జనసేనకు టీడీపీ ఎన్ని సీట్లు ఇచ్చారనేది ముఖ్యం కాదని, మళ్లీ ఆ స్థానాల్లో తన వాళ్లనే పంపి చంద్రబాబు టికెట్ ఇప్పించుకుంటారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి ప్రచారంపై జనసేన నేతలల్లో ఆందోళన కనిపిస్తోంది. అయితే జనసేన నేతల ఆందోళన నిజమవుతోంది.
జనసేనకు బలమైన పట్టున్న భీమవరంలో పవన్‌కల్యాణ్‌కు బదులు టీడీపీ నేతే నిలబడే అవకాశాలు మెరుగుపడ్డాయి. అయితే జనసేనలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే చేరి, ఆ పార్టీ నుంచి పోటీ చేస్తారు. చిన్న పిల్లలను అడిగినా ఇందులో మతలబు ఏంటో చెబుతారు. రెండు రోజుల్లో జనసేనలో చేరనున్నట్టు మాజీ ఎమ్మెల్యే అంజిబాబు మీడియాకు చెప్పారు. ఇటీవల భీమవరంలో అంజిబాబు ఇంటికి పవన్ వెళ్లారు.
రెండు రోజుల క్రితం పవన్‌ను మళ్లీ అంజిబాబు కలుసుకున్నారు. నిజాయతీపరులైన మీ లాంటి వ్యక్తులంటే ఇష్టమని, రాజకీయాల్లో ఉండాలని తనతో పవన్ అన్నారని అంజిబాబు వెల్లడించారు. భీమవరం నుంచి తన పోటీపై ఇంకా నిర్ణయించుకోలేదని పవన్ అన్నట్టు అంజిబాబు తెలిపారు. ఒకవేళ తాను భీమవరం నుంచి పోటీ చేయకపోతే, మీకేమైనా ఆసక్తి వుందా? అని తనను పవన్ అడిగారన్నారు. ఇందుకు తాను సానుకూలంగా స్పందించినట్టు అంజిబాబు తెలిపారు.
ఇదే సందర్భంలో పవన్నే పోటీ చేయాలని, తాను మద్దతు ఇస్తానని చెప్పనన్నారు. రెండు రోజుల్లో జనసేనలో చేరుతున్నట్టు అంజిబాబు వెల్లడించడంతో భీమవరం జనసైనికుల్లో ఆందోళన మొదలైంది. టీడీపీ, జనసేన పొత్తులో ఉన్నాయి. అలాంటప్పుడు ఒక పార్టీ నుంచి మరో పార్టీలో చేరడం ఏంటనే ప్రశ్న ఉత్పన్నమైంది. కేవలం జనసేన కార్యకర్తల్ని, ప్రజల్ని మభ్య పెట్టేందుకు పవన్‌తో బాబు కుదుర్చుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ మేరకే… ఆ పార్టీలోకి టీడీపీ అధినేత తన వాళ్లను పంపుతున్నారనే చర్చకు తెరలేచింది.
ఒక వేళ భీమవరం నుంచి పోటీ చేసే ఉద్దేశం పవన్‌కు లేనప్పుడు, తన కోసం పని చేసిన మరెవరినైనా పోటీ చేయించడానికి బదులు, టీడీపీ నాయకుడికి సీటు ఇవ్వడం ఏంటనే ప్రశ్న జనసైనికుల నుంచి వస్తోంది. సాంకేతికంగా భీమవరం సీటు జనసేనది అని చెప్పుకోడానికే తప్ప, నిజంగా పార్టీ కోసం సర్వం పోగొట్టుకున్న నాయకులకు పవన్ ఇస్తున్న విలువ ఇదేనా? అని అక్కడి నాయకులు, కార్యకర్తలు నిలదీస్తున్నారు.
బాబు మార్క్ రాజకీయం ఏకంగా గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన భీమవరంలోనే చేయడం జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.