ఊరూపేరూ లేని ఒక చవకబారు సినిమా తయారైందని అనుకుందాం. చచ్చీ చెడీ దానిని థియేటర్ విడుదల కూడా చేశారనుకుందాం. మార్నింగ్ షో అలా పడుతుందో లేదో అప్పుడే టీవీ చానెళ్లలోనూ, సోషల్ మీడియాలోనూ పబ్లిసిటీ హోరెత్తిపోతుంది.
సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్ అంటూ నానా గోల ప్రారంభించేస్తారు. విజయయాత్రలు ప్రారంభిస్తారు. ఊరూరా తిరుగుతారు. హీరో మీద పూలవానలు కురిపిస్తారు. గజమాలలు వేయిస్తారు. ఇంతా కలిపి.. సినిమా మాత్రం చీదేస్తుంది. వట్టికుండకు మోతెక్కువ అన్న చందంగా.. సూపర్ హిట్ అనే మాయ మాటలతో ఫ్లాప్ సినిమా చేసే హడావుడే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబునాయుడు తీరు కూడా అచ్చంగా అలాంటి సినిమా కల్చర్ నే గుర్తు చేస్తున్నది.
‘తెలుగుదేశం సూపర్ హిట్’ అంటూ ఒకప్పట్లో ఈనాడు దినపత్రిక ఒక గొప్ప, ఎప్పటికీ గుర్తుండిపోయే భావస్పోరకమన హెడింగ్ పెట్టింది. ఎన్టీరామారావు గెలిచి ముఖ్యమంత్రి అయిన సందర్భంలోని హెడింగ్ అది. ఎన్టీఆర్ సినిమా హీరో.. ఆయన తొలిసారిగా పార్టీ పెట్టి గెలిచారు. ఆ సందర్భంలో సినిమా విజయాలను గుర్తు చేసేలాగా.. సూపర్ హిట్ అని హెడింగ్ పెట్టి ఈనాడు పాఠకుల మెప్పు పొందింది.
ఇప్పుడు చంద్రబాబునాయుడు కూడా.. అదే తరహాలో భావిస్తున్నట్టుగా ఉంది. పవన్ కల్యాణ్ సినిమా నటుడిగా తమ పార్టీతో జట్టు కట్టి బరిలోకి దిగుతున్నాడు కాబట్టి.. మేం విజయం సాధించబోతున్నాం అని చాటుకోవడానికి ఇప్పుడే ‘తెలుగుదేశం – జనసేన పొత్తు సూపర్ హిట్’ అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు.
ఆయన వైఖరి చూస్తే తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్లుగా ఉంది. ప్రస్తుతానికి పొత్తులు చంద్రబాబు కోరుకున్నట్టుగా కుదిరి ఉండవచ్చు. 30కి మించి స్థానాలు జనసేనకు ఇచ్చే ఉద్దేశం ఆయనకు లేదని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో 24 స్థానాలకే పవన్ దళాన్ని పరిమితం చేయడం ఆయన సక్సెస్ కావొచ్చు. కానీ.. ఆ పొత్తులు ముందుకు ఎలా సాగుతాయో ఇంకా వేచిచూడాల్సి ఉంది.
జనసేన దళాలన్నీ మనస్ఫూర్తిగా పనిచేస్తాయో లేదో చూడాల్సి ఉంది. ఈ ఇద్దరూ కలిసి సఖ్యంగా అడుగులు ముందుకు వేసి.. నిజంగానే విజయం సాధిస్తే.. అప్పుడు చంద్రబాబునాయుడు ఈ ‘సూపర్ హిట్’ పదాన్ని వాడడం అందగిస్తుంది. ఇప్పుడు ఆ పదం వల్ల జనాన్ని ఆయన మభ్యపెట్టడం ఏమీ అంత ఈజీ కాదు. మరి ఎందుకలా తొందరపడుతున్నారని, ఎన్నికల తర్వాత ఆ మాట చెప్పుకోవడానికి అవకాశం ఉండదని భయపడుతున్నారేమోనని ప్రజలు నవ్వుకుంటున్నారు.