జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ అధ్యక్షుడు అయినప్పటికీ అనధికారిక అధ్యక్షుడు నెంబర్ 2 స్థానంలో ఉన్న నాదెండ్ల మనోహర్ అంటారు జనసేన పార్టీలో కొందరు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయి కాబట్టి పవన్ కాస్త సీరియస్ గా దృష్టి పెట్టాడేమోగానీ మొన్నమొన్నటివరకు పార్టీని పూర్తిగా నాదెండ్ల మీద వదిలేశాడు.
ఆయన చెప్పింది నమ్మేవాడు. నాదెండ్ల గైడెన్స్ లోనే పవన్ నడిచాడు. ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాడు. ఇప్పుడు జనసేనలో టాక్ ఏమిటంటే … టీడీపీతో పొత్తు వ్యవహారంలోనూ, సీట్ల పంపకంలోనూ మొత్తం నాదెండ్ల మనోహరే గైడ్ చేశారని అంటున్నారు. పవన్, మనోహర్ వ్యవహార శైలిని గమనించిన చంద్రబాబు నాయుడు తెలివిగా బలహీనమైన స్థానాలను జనసేనకు కట్టబెట్టారని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.
గత ఎన్నికల్లో జనసేన కాస్తో కూస్తో ఓట్లు తెచ్చుకున్న స్థానాలను పొత్తుల పేరుతో కబళించి ఆ పార్టీ చేతులెత్తేసిన సీట్లను మాత్రం చంద్రబాబు బలవంతంగా అంట గట్టేసి చేతులు దులుపుకున్నారని అంటున్నారు. పొత్తుల పేరుతో నామమాత్రంగా 24 అసెంబ్లీ సీట్లు, 3 ఎంపీ స్థానాలను జనసేనకు కేటాయించిన చంద్రబాబు అందులోనూ తన కుటిల రాజకీయాన్ని ప్రదర్శించారని ఆగ్రహంగా ఉన్నారు.
పార్టీ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలను కేటాయించినా కూడా పవన్ కల్యాణ్ ఒప్పేసుకోవడం ఆశ్చర్యకరంగా ఉంది. ఏయే సీట్లు తీసుకోవాలనే విషయంపై ఆయన కసరత్తు చేయలేదని అర్థమవుతోంది. ఈ స్థితిలో తమ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ఇచ్చిన జాబితానే పవన్ కల్యాణ్ చదివేసినట్లు చెబుతున్నారు .
జనసేన బలంగా ఉన్న స్థానాలకు చంద్రబాబు తన పార్టీ అభ్యర్థులను ప్రకటించి, జనసేన బలహీనంగా ఉన్న స్థానాలను ఆ పార్టీకి కేటాయించినట్లు స్పష్టంగానే తెలిసిపోతోంది. అనకాపల్లి శాసనసభ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేనకు కేవలం 11,988 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ సీటును పవన్ కల్యాణ్ తమ పార్టీ నాయకుడు కొణతాల రామకృష్ణ కోసం తీసుకున్నారు.
కొణతాల రామకృష్ణ ఆశించిన అనకాపల్లి పార్లమెంటు సీటును తన సోదరుడు నాగబాబుకు కేటాయించడానికి రామకృష్ణను అసెంబ్లీ బరిలోకి దింపుతున్నారు. పి. గన్నవరంలో గత ఎన్నికల్లో జనసేనకు 36,759 ఓట్లు వచ్చాయి. అయితే, ఆ సీటును చంద్రబాబు తన పార్టీ అభ్యర్థికి ఇచ్చేశారు. అది కూడా జనసేనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేష్‌కు ఈ సీటును కేటాయించారు. దీంతో జనసేన కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు.
విజయవాడ తూర్పులో జనసేన అభ్యర్థికి 30,137 ఓట్లు వచ్చాయి. విజయవాడ సెంట్రల్‌లో జనసేనతో పొత్తు పెట్టుకున్న సిపిఎం అభ్యర్థికి 29,333 ఓట్లు వచ్చాయి. ఈ రెండు స్థానాలు కూడా టీడీపీ జాబితాలోకి వెళ్లాయి. గత ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌కు 42,685 ఓట్లు వచ్చాయి. ఈసారి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆయన ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు.
అయితే, సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి ఆ సీటును కేటాయించడానికి కందుల దుర్గేష్‌కు నిడదవోలు పంపించడానికి ఏర్పాట్లు చేశారు. నిడదవోలులో గత ఎన్నికల్లో జనసేనకు 23 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. తణుకు శాసనసభ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో జనసేన అభ్యర్థికి 31,961 ఓట్లు వచ్చాయి.
అయితే, ఈసారి ఆ సీటును టీడీపీ తీసుకుంది. జనసేనకు 35,833 ఓట్లు వచ్చిన కొత్తపేట, 35,173 ఓట్లు వచ్చిన మండపేట, 33,334 ఓట్లు వచ్చిన ముమ్మిడివరం, 32,984 ఓట్లు వచ్చిన పాలకొల్లు నియోజకవర్గాలకు కూడా చంద్రబాబు టీడీపీ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ఆయా నియోజకవర్గాలకు చెందిన జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
దీనివల్ల టీడీపీకి ఓట్ల బదిలీ జరుగుతుందా అనేది అనుమానంగానే ఉంది. దీనివల్ల జనసేనకు కేటాయించిన స్థానాలను ఆ పార్టీ, జనసేన బలంగా ఉన్న స్థానాల్లో పోటీ చేస్తున్న టీడీపీ చాలా స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉంది. ఎన్నికల ఫలితాల తరువాతగానీ జనసేన కొంప ఎంతవరకు మునిగిందో తెలుస్తుంది.