తూర్పుగోదావరి జిల్లా రాజకీయమంతా కందుల దుర్గేష్ చుట్టూ తిరుగుతోంది. ఆ జిల్లా జనసేన అధ్యక్షుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేశారు. అలాగే రాజమండ్రి రూరల్ జనసేన ఇన్చార్జ్గా అక్కడి నుంచి పోటీ చేసేందుకు చాలా ఏళ్లుగా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేసుకున్నారు. వారం క్రితం రాజమండ్రికి పవన్ వెళ్లినప్పుడు, రూరల్ నుంచి జనసేన తరపున కందుల దుర్గేష్ పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి.
తీరా అభ్యర్థుల ప్రకటన సమయానికి పవన్ యూటర్న్ తీసుకున్నారు. కందుల దుర్గేష్‌కు టికెట్‌పై తూచ్ …తూచ్ అని పవన్ అన్నారు. రాజమండ్రి రూరల్‌లో టీడీపీ సిటింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి ఉన్నారని, అక్కడ ఆ పార్టీనే మరోసారి పోటీ చేస్తుందని కందుల దుర్గేష్‌ను పిలిపించుకుని పవన్ చెప్పారు. దీంతో కందుల దుర్గేష్‌తో పాటు ఆయన అనుచరులు షాక్‌కు గురయ్యారు. కందుల దుర్గేష్‌ను నిడదవోలుకు వెళ్లాలని పవన్ సూచించారు. మరోవైపు అక్కడికి రానివ్వమని టీడీపీ నేతలు గట్టి వార్నింగ్ ఇచ్చారు. దీంతో కందుల దుర్గేష్ భవితవ్యం ప్రశ్నార్థకమైంది.
ఈ నేపథ్యంలో కందుల దుర్గేష్‌పై రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దుర్గేష్ మంచి మనిషన్నారు. అలాంటి నాయకుడు గత ఎన్నికల్లో తమ పార్టీలో వుండింటే ఈ పాటికి ఎమ్మెల్యే, మంత్రి కూడా అయ్యి వుండేవాడన్నారు. రైట్ పర్సన్ రాంగ్ పార్టీలో వున్నాడని భరత్ అన్నారు. కందుల దుర్గేష్‌ను తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు ఆయన చెప్పారు.
ఐదేళ్లుగా జనసేన జెండా మోస్తూ ఎన్నికల్లో నిలబడేందుకు దుర్గేష్ ఏర్పాట్లు చేసుకున్నారని భరత్ చెప్పారు. అలాంటి నాయకుడికి టికెట్ ఇవ్వమంటే, ఎవరికైనా బాధ వుంటుందని ఆయన అన్నారు. కందుల దుర్గేష్‌ను వైసీపీలో చేర్చుకునేందుకు క్షేత్రస్థాయిలో పావులు కదుపుతున్నట్టు అర్థమవుతోంది. కందుల వైసీపీలో చేరితే జనసేనకు చావు దెబ్బ తప్పదు. ఏమవుతుందో చూడాలి.