ఓట్ల బదిలీ ఆశలు గల్లంతు

మొత్తానికి అనుకున్నంతా అవుతోంది. జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ అధినేతలు చాలా స్మూత్ గా, పద్దతిగా, నెమ్మదిగా, కార్నర్ లోకి తోసేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఎలా ఒప్పించారో అలా ఒప్పించగలిగారు. కానీ అదే పవన్…

మొత్తానికి అనుకున్నంతా అవుతోంది. జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ అధినేతలు చాలా స్మూత్ గా, పద్దతిగా, నెమ్మదిగా, కార్నర్ లోకి తోసేస్తున్నారు. పవన్ కళ్యాణ్‌ను ఎలా ఒప్పించారో అలా ఒప్పించగలిగారు. కానీ అదే పవన్ కళ్యాణ్ మాత్రం జనసైనికులను ఒప్పించలేకపోతున్నారు. జనసైనికుల మనో భావాలను సోషల్ మీడియాకు వదిలేసి పవన్ ఇంట్లోకి వెళ్లి గడియ వేసుకున్నారు. చెప్పడానికి సరైన సమాధానం ఆయన దగ్గర లేదు. అందుకే ఇలా మౌన వ్రతం అని అనుకోవాలి.

మొత్తం మీద భాజపా వస్తే 24 రాకుంటే మరో నాలుగు సీట్లు మినహా జనసేనకు తెలుగుదేశం విదిలించేది మూడు పదులకు మించి వుండవనే క్లారిటీ వచ్చేసింది. పైగా పవన్ మాటలు మరింత మండించాయి. ఓ లోక్ సభ నియోజకవర్గ పరిథిలో వుండే ఏడు ఎమ్మెల్యే సీట్లను కూడా లెక్క వేసుకోవాలని ఆయన ఇచ్చిన ఈక్వేషన్ మామూలుగా లేదు.

జన సైనికులు నవ్వాలో, ఏడవాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోయారు. తప్పనిసరిగా పవన్ ను సమర్దించాల్సి రావడం అన్నది కొన్ని సోషల్ మీడియా హ్యండిల్స్ కు తప్పడం లేదు. కానీ జరుతున్న పరిణామాల మీద వారికీ అసంతృప్తిగానే వుంది.

కాపులు కృష్ణ, గుంటూరు, ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్రలో బలంగానే వున్నారు. రాయలసీమ జిల్లాల్లో కూడా వారి ప్రభావం బలంగానే వుంది. కానీ చంద్రబాబు కావాలని జనసేనను ఈస్ట్, వెస్ట్, ఉత్తరాంధ్రలకు కట్టడి చేయాలని చూస్తున్నారు. దక్షిణ కోస్తాలోకి వారిని అడుగుపెట్టనివ్వాలని అనుకోవడం లేదు. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో కమ్మ-కాపు వైరుధ్యం అందరికీ తెలిసిందే. అలాంటి రెండు జిల్లాల్లో జనసేనకు మహా అయితే ఒకటి రెండు స్థానాలను మించి ఇవ్వడం లేదు. ఈ సంగతి కాపులకు అర్థం అవుతోంది. ఇప్పుడు వారు ఎందుకు కమ్మ వర్గ పార్టీకి ఓటు వేస్తారు?

టికెట్ ల నిర్ణయం పవన్ చేతిలో ఏమీ లేదని జనసైనికులకు అర్థం అవుతోంది. తన సోదరుడిని అనకాపల్లికి ఎందుకు తెచ్చారు. నరసాపురం నుంచి నాగబాబుకు టికెట్ ఇవ్వడం కష్టం అన్న క్లారిటీ పొత్తు పార్టీల మధ్య రాబట్టే. అంటే తనకు కావాల్సినవి ఎంచుకునే పరిస్థితి జనసేన అధిపతికి లేదు. తెలుగుదేశం ఇచ్చినవి తీసుకోవాలి. చెప్పినవారికి టికెట్ లు ఇవ్వాలి. పంపిన వారిని పార్టీకి తీసుకోవాలి. వాళ్లకు టికెట్ లు ఇవ్వాలి. ఈ పరిస్థితి గురించి పవన్ కు ముందు నుంచీ క్లారిటీ వుంది. కానీ ఇప్పుడు కొత్తగా క్లారిటీ వచ్చింది జనసైనికులకే.

మొన్నటి వరకు జనసేన ను చాలా ప్లాన్డ్ ప్రకారం ఉబ్బేస్తూ వచ్చారు చంద్రబాబు. ఆయన స్వయంగా జనసేన జెండా పట్టుకోవడం, జై జనసేన అనడం , పవన్ కు పచ్చ శాలువా కప్పడం, ఇలా మెహర్బానీ పనులు చేస్తూ వచ్చారు. కొందరు కార్యకర్తల చేత రెండు జెండాలు పట్టించి, పొత్తు అద్భుతం అన్న కలర్ ఇచ్చుకుంటూ వచ్చారు.

ఇప్పుడు అదంతా గాలికిపోయింది. కాపులకు ఫుల్ క్లారిటీ అయిదు సీట్ల ప్రకటనతోనే వచ్చేసింది. మిగిలినవి ప్రకటించడానికి బాబు-పవన్ కిందా మీదా అవుతున్నారు. ఎలా ప్రకటిస్తే ఏమవుతుందో అని. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. చంద్రబాబు తెగించి 35 సీట్ల వరకు పవన్ పార్టీకి ఇవ్వగలగాలి. అప్పుడు కాస్త డ్యామేజ్ కంట్రోలు అవుతుంది. కానీ అలా ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.

అందువల్ల పొత్తు అనేది వుంటుంది. పవన్ బలమైన స్పీచ్ లతో జగన్ ను దుయ్యబట్టడం వుంటుంది. కానీ కాపుల ఓట్లు తెలుగుదేశం పార్టీకి వెళ్తాయా? ఆ పార్టీ కార్యకర్తల ఓట్ల జనసేన అభ్యర్ధులకు వెళ్తాయా అన్నది మాత్రం అనుమానం.