ఈ రెండింటిని ద‌క్కించుకోక‌పోతే.. జ‌న‌సేన‌కు టు లెట్ బోర్డ్‌!

పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు 24 అసెంబ్లీ, 3 లోక్‌స‌భ స్థానాల‌ను టీడీపీ కేటాయించింది. ఈ సీట్ల‌పై జ‌న‌సేన శ్రేణులు ర‌గిలిపోతున్నాయి. చంద్ర‌బాబునాయుడికి కాపుల ఆత్మాభిమానాన్ని తాక‌ట్టు పెట్టార‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మొద‌టి విడ‌త‌లో…

పొత్తులో భాగంగా జ‌న‌సేన‌కు 24 అసెంబ్లీ, 3 లోక్‌స‌భ స్థానాల‌ను టీడీపీ కేటాయించింది. ఈ సీట్ల‌పై జ‌న‌సేన శ్రేణులు ర‌గిలిపోతున్నాయి. చంద్ర‌బాబునాయుడికి కాపుల ఆత్మాభిమానాన్ని తాక‌ట్టు పెట్టార‌ని ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మొద‌టి విడ‌త‌లో చంద్ర‌బాబునాయుడు 94 స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ప‌వ‌న్ మాత్రం ఐదుగురు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించి, మిగిలిన‌వి పెండింగ్‌లో పెట్టారు.

ప్ర‌క‌టించాల్సిన ఆ 19 స్థానాలు ఏంట‌నేవి తెలియ‌క టీడీపీ, జ‌న‌సేన నాయ‌కుల్లో ఆందోళ‌న నెల‌కుంది. ప్ర‌ధానంగా ఉభ‌య‌గోదావ‌రి జిల్లాలు, ఉత్త‌రాంధ్ర‌లో జ‌న‌సేన‌కు ఎక్కువ సీట్లు ఇస్తార‌నడంలో రెండో మాట‌ల‌కు తావు లేదు. రాయ‌ల‌సీమ‌లో జ‌న‌సేన బ‌లం అంతంత మాత్ర‌మే కావ‌డంతో త‌క్కువ సీట్లు ఇస్తార‌నే చ‌ర్చ‌కు తెర లేచింది. అయితే ఆ సీట్లు ఏవ‌నే విష‌యం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ప్ర‌ధానంగా ఉమ్మ‌డి చిత్తూరు జిల్లాలోని తిరుప‌తి, శ్రీ‌కాళ‌హ‌స్తి సీట్ల‌పై చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ రెండు సీట్ల‌ను జ‌న‌సేన ద‌క్కించుకోక‌పోతే, ఇక ఆ పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యానికి టు లెట్ బోర్డు పెట్టొచ్చ‌ని అక్క‌డి శ్రేణులు బ‌హిరంగంగానే కామెంట్స్ చేయ‌డం గ‌మ‌నార్హం. తిరుప‌తిలో కాపులు బ‌లంగా ఉన్నారు. 2009లో పాల‌కొల్లులో మెగాస్టార్ చిరంజీవి ఓడినా, తిరుప‌తి మాత్రం ఆయ‌న ప‌రువు కాపాడింది. దీన్ని బ‌ట్టి తిరుప‌తి జ‌న‌సేన‌కు ఎంత బ‌ల‌మైన సీటో అర్థం చేసుకోవ‌చ్చు.

తిరుప‌తిలో మొద‌టి నుంచి జ‌న‌సేన జెండాను ప‌సుపులేటి హ‌రిప్ర‌సాద్‌, రాయ‌ల్ కాని రాయ‌ల్‌, రాజారెడ్డి, కాపు యువ‌కులు మోస్తున్నారు. ఇప్పుడు పొత్తులో భాగంగా తిరుప‌తి సీటును ఆకాంక్షిస్తున్నారు. టికెట్ ఇస్తే, మిగిలిన చోట్ల జ‌న‌సేన గెలుస్తుందో లేదో చెప్ప‌లేం కానీ, తిరుప‌తిలో మాత్రం ప‌క్కా అని ఆ పార్టీ నాయ‌కులు ధీమా వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక శ్రీ‌కాళ‌హ‌స్తి విష‌యానికి వస్తే… అక్కడ కూడా బ‌లిజ‌లు బ‌లంగా ఉన్నారు. శ్రీ‌కాళ‌హ‌స్తి జ‌న‌సేన ఇన్‌చార్జ్ కోట వినుత‌, ఆమె భ‌ర్త అధికార పార్టీ దౌర్జ‌న్యాల‌కు భ‌య‌ప‌డ‌కుండా జ‌న‌సేన జెండా మోస్తున్నారు. శ్రీ‌కాళ‌హ‌స్తి టీడీపీ ఇన్‌చార్జ్ బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి ఇప్పుడు ఎన్నిక‌ల స‌మ‌యంలో హ‌డావుడి చేస్తున్నారు. అంత‌కు ముందు ఆయ‌న ఎక్కడున్నారో కూడా ఎవ‌రికీ తెలియ‌దు. క‌రోనా క‌ష్ట‌కాలంలో శ్రీ‌కాళ‌హ‌స్తిలో ప్ర‌తిప‌క్ష పార్టీ ఏదైనా ప్ర‌జానీకానికి అండ‌గా వుందంటే.. అది జ‌న‌సేన మాత్ర‌మే అని చెప్ప‌క త‌ప్ప‌దు.

అందుకే శ్రీ‌కాళ‌హ‌స్తి టికెట్ విష‌యంలో జ‌న‌సేన నాయ‌కులు గ‌ట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా ద‌క్కించుకోక‌పోతే ఇక జ‌న‌సేన పార్టీని మూసేసుకోవ‌డం మంచిద‌ని ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఆవేద‌న‌తో అంటున్నారు. జ‌న‌సేన శ్రేణులు మొర‌ను ప‌వ‌న్ ఏ మేర‌కు ఆల‌కిస్తారో చూడాలి.