జనసేనలో 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలు రగిల్చిన చిచ్చు… ఆ పార్టీని దహించి వేస్తోంది. ఈ పరిణామాలు చివరికి ఏ మలుపు తీసుకుంటాయో తెలియని పరిస్థితి నెలకుంది. ఈ నేపథ్యంలో జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇవాళ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఈ నెల 28న తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన ఉమ్మడి సభ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సభను దృష్టిలో పెట్టుకుని జనసేన చేస్తున్న ప్రచారం, ఆ పార్టీలో తీవ్ర అసంతృప్తి, నిస్సహాయతను ప్రతిబింబిస్తోంది. ఆ పోస్టు ఏంటంటే..
“ఈ నెల 28న తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన ఉమ్మడి సభ అనే విషయాన్ని మరిచిపోవద్దు. వారాహియాత్రో, జనసేనాని ఒక్కడే పాల్గొంటున్న సభగా భావించి సీఎం…సీఎం అని మన పార్టీ శ్రేణులు గట్టిగట్టిగా అరవొద్దు. అలా చేస్తే ఆ లోకేశ్ అడుగడుగునా పెట్టుకున్న టీడీపీ కార్యకర్తలు, నాయకులతో మన జనసేన జెండా పట్టుకున్నోళ్లనళ్లా చితక్కొట్టిస్తాడు. చావు దెబ్బలు తింటే మనల్ని పట్టించుకునే దిక్కుండదు. పైగా సీఎం…సీఎం అని ఎవరు అరవమన్నారని మనం ఎంతగానో అభిమానించే పవన్‌కల్యాణ్ తిడతారు. నాకే లేని కోరిక మీకెందుకని చీవాట్లు పెడతారు. అందుకే ఉమ్మడి సభకు వెళ్లే జనసేన నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకుంటామని అనుకుంటేనే వెళ్లండి. లేదంటే ఎవరి పనుల్లో వాళ్లు ఉంటే మంచిది. ఉమ్మడి సభకు వెళ్లి తన్నులు తినడం కంటే, వెళ్లకుండా మనశ్శాంతిగా గడపడమే మంచిది” అని జనసేన సోషల్ మీడియా యాక్టివిస్టులు పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది.
టీడీపీతో పొత్తుపై జనసేన మనసుల్లో ఏముందో అర్థం చేసుకోడానికి వారి ఆవేదనతో కూడిన కామెంట్స్, పోస్టులు చదివితే అర్థం చేసుకోవచ్చు. కేవలం టీడీపీ పల్లకీ మోయడానికి మనం ఎందుకు వెళ్లాలనే భావన వారిలో క్రమంగా పెరుగుతోంది. ఇటీవల లోకేశ్ శంఖారావం సభల్లో జనసేన నాయకులు, కార్యకర్తల్ని టీడీపీ నేతలు చావబాదిన సంగతి తెలిసిందే. ఆ చేదు అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని తాజా వ్యంగ్య హెచ్చరికలను చూడొచ్చు. అందులో వ్యంగ్యం ఉన్నప్పటికీ, వాస్తవమే చెబుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.