రాజమండ్రి రూరల్ జనసేన ఇన్చార్జ్ కందుల దుర్గేష్ పరిస్థితి దయనీయంగా మారింది. రాజమండ్రి రూరల్ టికెట్‌పై పవన్‌కల్యాణ్ స్పష్టమైన హామీ ఇవ్వడంతో జనంలోకి ఉత్సాహంగా వెళుతున్న ఆయనకు టీడీపీ అడ్డుకట్ట వేసింది. నిడదవోలుకు వెళ్లాలని పవన్‌కల్యాణ్ తనకు సూచించినట్టు కందుల దుర్గేష్ వెల్లడించారు. అయితే రాజమండ్రి రూరల్ నుంచి పక్కకు వెళ్లే ప్రసక్తే లేదని కందుల అనుచరులు తేల్చి చెప్పారు.
నిడదవోలుకు వెళ్లాలని దుర్గేష్‌కు చెప్పారనే ప్రచారం… అక్కడి టీడీపీలో వేడి రగిల్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ నిడదవోలుకు కందుల దుర్గేష్‌ను రానివ్వమని అక్కడి టీడీపీ ఇన్చార్జ్ బూరుగుపల్లి శేషారావు వార్నింగ్ ఇచ్చారు. నిడదవోలు సీటును జనసేనకు కేటాయించారనే ప్రచారం నేపథ్యంలో… టీడీపీ శ్రేణులు శేషారావు ఇంటికి పెద్ద ఎత్తున వెళ్లాయి. జనసేనకు కేటాయిస్తే ఊరుకునేది లేదని టీడీపీ కార్యకర్తలు, నాయకులు హెచ్చరించడం సరికొత్త రచ్చకు దారి తీసింది.
పశ్చిమగోదావరి జిల్లాలో పునర్విభజనలో భాగంగా కొత్తగా 2009లో నిడదవోలు నియోజకవర్గం ఏర్పడింది. నిడదవోలులో టీడీపీ తరపున శేషారావు 2009, 2014లో వరుసగా రెండుసార్లు గెలుపొందారు. 2019లో వైసీపీ గెలుపొందింది. 2024లో మరోసారి తలపడేందుకు శేషారావు ఏర్పాట్లు చేసుకున్నారు. అకస్మాత్తుగా కందుల దుర్గేష్ తెరపైకి రావడంతో టీడీపీలో ఆందోళన మొదలైంది.
రాజమండ్రి రూరల్‌లో బుచ్చయ్య చౌదరి కోసం తనను బలిపెడితే ఎలా? అని శేషారావు ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా అభ్యర్థుల ఎంపిక ఉభయగోదావరి జిల్లాల్లో టీడీపీ, జనసేన మధ్య తీవ్రస్థాయిలో రచ్చలకు దారి తీసింది.