భలే లాజిక్ వెలికితీసిన వర్మ

జనసేనకు పూర్తిగా సీట్లు తగ్గిపోయాయి. ఇచ్చిన సీట్లలో కూడా గెలుస్తామనే ధీమా ఉన్నవి చాలా తక్కువ. మరోవైపు అసంతృప్తుల సెగ ఉండనే ఉంది. ఆత్మహత్య చేసుకుంటామని కొందరు, పార్టీ మారతామని మరికొందరు, రెబల్ గా…

జనసేనకు పూర్తిగా సీట్లు తగ్గిపోయాయి. ఇచ్చిన సీట్లలో కూడా గెలుస్తామనే ధీమా ఉన్నవి చాలా తక్కువ. మరోవైపు అసంతృప్తుల సెగ ఉండనే ఉంది. ఆత్మహత్య చేసుకుంటామని కొందరు, పార్టీ మారతామని మరికొందరు, రెబల్ గా పోటీ చేస్తామని ఇంకొందరు బెదిరిస్తున్నారు. 

పార్టీ నేతలు, కార్యకర్తల్ని బుజ్జగించేందుకు రకరకాల కబుర్లు చెబుతున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఇందులో భాగం ఆయన చేసిన ఓ కామెంట్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మను బాగా ఎట్రాక్ట్ చేసింది.

గత ఎన్నికల్లో సీట్లు గెలవలేకపోయానని, కాబట్టి ఈసారి ఎన్నికల్లో ఎక్కువ సీట్లు అడగలేకపోతున్నాని పవన్ కల్యాణ్ అన్నారు. దీనిపై రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. పవన్ రాజకీయాలు, సినీకెరీర్ కు ముడిపెట్టి ట్వీట్ వదిలారు.

గత సినిమా ఫ్లాప్ అయితే, నెక్ట్ సినిమాను తక్కువ థియేటర్లలో ఎవ్వరూ రిలీజ్ చేయరు. అదే విధంగా గత ఎన్నికల్లో సీట్లు రాలేదని, ఈసారి తక్కువ సీట్లు ఎవ్వరూ కోరుకోరు. ఈ అంశంలో అజ్ఞాతవాసిని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు వర్మ. అజ్ఞాతవాసి డిజాస్టర్ అయిందని, పవన్ తన తదుపరి సినిమాల్ని తక్కువ థియేటర్లలో రిలీజ్ చేయలేదని గుర్తుచేస్తున్నాడు.

సో.. సినిమా పొజిషన్ తో పోలిస్తే, పొలిటికల్ పొజిషన్ పై పవన్ కల్యాణ్ నమ్మకంతో వ్యవహరించడం లేదని విమర్శిస్తున్నాడు వర్మ. జనసైనికులకు శుభదినం అంటూ ఆయన తన వ్యూహం సినిమా ట్రయిలర్ ను పోస్ట్ చేశాడు. 

అతి తక్కువ సీట్లు తీసుకున్న పవన్ కల్యాణ్ ను చూస్తే బాధేస్తోందన్న వర్మ.. జీవితంలో తను ఎప్పుడూ ఇంత బాధపడలేదన్నాడు. జనసైనికుల్ని చూసి పవన్ కల్యాణ్ కంటే తనే ఎక్కువ బాధపడుతున్నానని అన్నాడు.