ఉత్తరాంధ్రా జిల్లాలలో పొత్తు రాజకీయాల వల్ల టీడీపీ జనసేనలలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. పార్టీ మాది అని నిన్నటి దాకా జబ్బలు చరచిన వారు ఇపుడు ఏమీ కాకుండా రాజీనామాలు చేస్తున్నారు. తమకు తీరని ద్రోహం చేశారని పెద్ద మాటలే అంటున్నారు. మరికొందరికి పొమ్మనకుండా పొగ పెడుతున్నారు.
బిగ్ షాట్స్ కే ఈసారి టీడీపీ హ్యాండ్ ఇస్తోంది. జనసేనలోనూ అదే తీరు కనిపిస్తోంది. పార్టీని నమ్ముకున్న వారికి కాకుండా ఓవర్ నైట్ చేరిన వారికి జెండా కూడా కప్పుకోని వారికీ టికెట్లు ఇస్తున్నారు అన్న ఆవేదన అయితే ఆ పార్టీలో ఉంది.
ఈ పరిణామాలను వైసీపీ నిశితంగా గమనిస్తోంది. టీడీపీలో జనసేనలో అసమ్మతివాదుల వైఖరి మీద ఒక లుక్ పెట్టినట్లుగా ప్రచారం సాగుతోంది. అందుకే ఉత్తరాంధ్రా వైసీపీ రీజనర్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఒక సంచలన ప్రకటన చేశారు. తుది జాబితా వెలువడే వరకూ ఎవరూ అభ్యర్ధి కారు అని వైవీ బాంబు పేల్చారు.
దాంతో ఇంచార్జిల సీట్లు కూడా చిరిగిపోతాయని సంకేతాలు ఇచ్చినట్లు అయింది. వీక్ గా ఇంచార్జిలు ఉన్న చోట కొత్త వారికి చోటు దక్కుతుంది. అంతే కాకుండా బలమైన నేతలకు చాన్స్ ఇస్తారని అంటున్నారు. టీడీపీ జనసేనలలో కీలక నేతలు వస్తే వారిని తమ వైపు తిప్పుకునేందుకు కూడా వైసీపీ చూస్తోంది అని అంటున్నారు.
ఉత్తరాంధ్రాకు చెందిన ఒక బిగ్ షాట్ విషయంలో వైసీపీ ఇప్పటికే దృష్టి సారించింది అని అంటున్నారు. ఆయనకు కోరిన సీటే ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. అలాగే టీడీపీలో కీలకంగా ఉన్న ఒక అసెంబ్లీ సెగ్మెంట్ నేత విషయంలోనూ వైసీపీ కొత్త ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు.
విశాఖ సిటీలో టీడీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో చాలా మంది నేతలు మాత్రం ఇబ్బందిపడుతున్నారని దాన్ని క్యాష్ చేసుకోవడానికి అయితే వైసీపీ పావులు కదుపుతోంది అని ప్రచారం సాగుతోంది. అదే జరిగితే టీడీపీ కి షాకుల మీద షాకులు తగులుతాయని అంటున్నారు.