అనూహ్యంగా అనకాపల్లి అసెంబ్లీ సీటుని జనసేన దక్కించుకుంది. దాంతో అనకాపల్లి సీటునే నమ్ముకుని రాజకీయం చేస్తున్న మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఎలమంచిలి సీటు మీద కన్నేశారు అని అంటున్నారు. తనకు నచ్చచెప్పడం కాదు ఎలమంచిలి సీటు ఇవ్వాల్సిందే అని ఆయన పార్టీ పెద్దల ముందు ఒక ప్రతిపాదన పెట్టారని అంటున్నారు.
తాను ఈసారి పోటీ చేసి తీరుతాను అని పీలా అంటున్నారు. తనకు ఎక్కడో ఒక చోట అకామిడేట్ చేయాల్సిందే అని ఆయన అంటున్నారు. ఆయన విషయం హై కమాండ్ కి తలనొప్పిగా మారింది అని అంటున్నారు. ఆయన కోరిన ఎలమంచిలి సీటు చాలా కాలం క్రితమే జనసేనకు ఇచ్చేశారు అని టాక్.
అక్కడ జనసేన అధినాయకత్వానికి అత్యంత సన్నిహితుడు అయిన సుందరపు విజయ్ కుమార్ పోటీ చేస్తారు అని అంటున్నారు. ఆ సీటు తనకే ఇవ్వాలని పీలా పట్టుబట్టడంతో పొత్తు పార్టీలకు కొత్త ఇరకాటం వచ్చింది అని అంటున్నారు.
పీలా అంగబలం అర్ధబలం ఉన్న వారు. తనకు టికెట్ ఇవ్వకపోతే ఆయన ఏమి చేస్తారో అన్న కలవరం కూడా పార్టీలకు ఉంది. అనుచరులు ఏమో ఆయనను అనకాపల్లి నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేయమని డిమాండ్ చేస్తున్నారు.
మరో వైపు పీలా వైసీపీలోకి జంప్ చేస్తారు అని కూడా ప్రచారం సాగడంతో టీడీపీ హై కమాండ్ అలెర్ట్ అయింది. ఆయన కోరినట్లుగా ఎలమంచిలి టికెట్ ఇచ్చేస్తే మాత్రం అక్కడ పవన్ కే సన్నిహితుడుగా ఉన్న విజయ్ కుమార్ కే షాక్ తగులుతుంది.
ఇవన్నీ చూస్తూంటే కొణతాలను కోరి చేర్చుకుని ఆయనకు టికెట్ ఇచ్చినందువల్ల వచ్చిన మొత్తం చిక్కులు అని రెండు పార్టీలలో అనుకుంటున్న పరిస్థితి. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికే టికెట్లు అన్న విధానం అమలు చేసి ఉంటే ఈ చికాకులు వచ్చేవి కావు అని అంటున్నారు.