ఈ నిర్మాత గట్టెక్కినట్టేనా..?

ఊరు పేరు భైరవకోన.. ఈ సినిమా సక్సెస్ ఎవరికి ఎంత అవసరమనే విషయం పక్కనపెడితే నిర్మాత అనీల్ సుంకరకు మాత్రం అత్యవసరం. ఇదే విషయాన్ని ఆయన మీడియా ముఖంగా కూడా ప్రకటించుకున్నారు. మరి ఈ…

ఊరు పేరు భైరవకోన.. ఈ సినిమా సక్సెస్ ఎవరికి ఎంత అవసరమనే విషయం పక్కనపెడితే నిర్మాత అనీల్ సుంకరకు మాత్రం అత్యవసరం. ఇదే విషయాన్ని ఆయన మీడియా ముఖంగా కూడా ప్రకటించుకున్నారు. మరి ఈ సినిమాతో అనీల్ సుంకర గట్టెక్కారా?

ఊరు పేరు భైరవకోన విడుదలై వారం గడిచింది. మొదటి వారాంతం ఈ సినిమా బాగా నడిచింది. పోటీ పెద్దగా లేకపోవడంతో ఈ వీకెండ్ కూడా ఈ సినిమాకు మంచి వసూళ్లు వచ్చే అవకాశాలున్నాయి. అయితే ఇవి సరిపోతాయా? అనీల్ సుంకర కష్టాలు తీర్చేస్తాయా..?

కచ్చితంగా కాదనే చెప్పాలి. ఊరు పేరు భైరవకోన సక్సెస్ అనీల్ కు చిన్న ఆనందాన్ని మాత్రమే ఇచ్చింది. అంతేతప్ప, అతడి ఆర్థిక కష్టాల్ని తీర్చేంత పెద్ద హిట్ మాత్రం కాదిది. ఏజెంట్ సినిమాతో అనీల్ భారీ నష్టాలు చూశారు. ఇక భోళాశంకర్ తో ఆయన ఆర్థిక కష్టాలు రెట్టింపు అయ్యాయి.

ఇలాంటి 2 డిజాస్టర్ల తర్వాత కోలుకోవాలంటే భారీ బ్లాక్ బస్టర్ పడాలి. ఊరు పేరు భైరవకోన సినిమా ఆ రేంజ్ సినిమా కాదు. ఎటొచ్చి సానుకూల అంశం ఒక్కటే. ఈ సినిమాతో అనీల్ సుంకర మళ్లీ ట్రాక్ లో పడ్డారు. ఆయనపై ఆయనకు నమ్మకం కలిగేలా చేసింది ఈ సినిమా.

అనీల్ సుంకర మాత్రమే కాదు.. అటు హీరో సందీప్ కిషన్, దర్శకుడు వీఐ ఆనంద్ కూడా ఈ సినిమాతో ఊపిరి పీల్చుకున్నారు. ఇండస్ట్రీలో పెద్ద పెద్ద విజయాలే కాదు, ఇలాంటి చిన్న సక్సెస్ లు కూడా ఆనందాన్నిస్తాయి, అంతకుమించి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.