పులివెందుల వైసీపీకి త్వరలో కొత్త ఇన్చార్జ్ వచ్చే అవకాశాలున్నాయి. పులివెందుల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీ కేడర్‌కు అందుబాటులో వుండే పరిస్థితి లేదు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఉన్నప్పటికీ, ఆయన కూడా అవసరమైన సమయంలో దొరకరనే ఆవేదన పులివెందుల ప్రజానీకంలో వుంది. తాము గెలిపించిన ఎమ్మెల్యే సీఎంగా పాలన సాగిస్తున్నప్పటికీ, సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదనే బాధ వారిలో వుంది.
ఈ నేపథ్యంలో పులివెందుల నియోజకవర్గ బాధ్యలను పర్యవేక్షించే నాయకుడు అవసరమయ్యారు. ఇందుకు వైఎస్ కుటుంబంతో సుదీర్ఘ కాలం పాటు రాజకీయ పోరాటం చేసిన ఎస్వీ సతీష్‌రెడ్డే సరైన నాయకుడని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భావిస్తున్నారు. అందుకే ఆయన్ను పార్టీలో చేర్చుకుని తగిన గౌరవం ఇవ్వాలని సీఎం నిర్ణయించినట్టు తెలిసింది.
అందుకే సతీష్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు వైసీపీ నాయకులు మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, కడప మేయర్ సురేష్‌బాబు తదితరులు వేంపల్లెలోని ఆయన ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. వైసీపీలో చేరితే తగిన హోదా కల్పిస్తామని సీఎం మాటగా సతీష్‌కు హామీ ఇచ్చినట్టు తెలిసింది. సతీష్‌రెడ్డిని పార్టీలో చేర్చుకుని పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతలు అప్పగించాలని జగన్ భావిస్తున్నారని ఆ పార్టీ ముఖ్య నాయకుల ద్వారా తెలిసింది.
అలాగే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వేంపల్లె ఒక అసెంబ్లీ నియోజకవర్గమవుతుంది. ఇక్కడి నుంచి సతీష్‌రెడ్డిని నిలబెట్టాలని జగన్ ఆలోచిస్తున్నారని సమాచారం. సతీష్‌రెడ్డి వైసీపీలో చేరేందుకు అనుచరులతో సమాలోచనలు తన వాళ్లతో సమాలోచనలు జరుపుతున్నారు. మూడు రోజుల్లో ఆయన వైసీపీలో చేరడమే తరువాయి.