ఓ వైపు యానిమల్ సినిమా సూపర్ సక్సెస్ అయింది. హీరోతో పాటు యూనిట్ అంతా సంబరాలు చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 917 కోట్ల రూపాయలు ఆర్జించిన ఈ సినిమాపై మీడియా వరుసపెట్టి కథనాలు ఇచ్చింది. చాలా రోజుల పాటు యూనిట్ సభ్యులు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.
ఓవైపు ఇంత జరుగుతుంటే, ఆ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మిక మాత్రం యానిమల్ సక్సెస్ పై స్పందించలేదు. కనీసం ఆ విజయాన్ని తనకుతాను ఆపాదించుకోలేదు. దీనిపై చాలా విమర్శలు చెలరేగాయి. ఎట్టకేలకు యానిమల్ సక్సెస్ పై స్పందించింది రష్మిక.
“మేము భారీ చిత్రాన్ని అందించాం. ప్రేక్షకులు దాన్ని హిట్ చేశారు. అందరూ కోరుకునే విధంగా నేను కూడా ఆ సక్సెస్ ను ఆస్వాదించడానికి కొంత సమయాన్ని తీసుకోవాలనుకున్నాను. కానీ నా సినిమా విడుదలైన మరుసటి రోజు నేను మరో సినిమా సెట్‌కి వెళ్లాను. అందుకే నేను మళ్లీ ఇంటర్వ్యూలు, ఈవెంట్‌లు, పార్టీల్లో కనిపించలేదు.”
ఇలా అసలు విషయాన్ని బయటపెట్టింది రష్మిక. తన సినిమా షూటింగ్స్ కోసం రాత్రిళ్లు కూడా ప్రయాణాలు చేయాల్సి వచ్చిందని, అందుకే తన బాలీవుడ్ కెరీర్ లో అతిపెద్ద విజయాన్ని ఆస్వాదించలేకపోయానని తెలిపింది.
ప్రేక్షకుల ప్రేమ, వాళ్ల సందేశాలు తనకు నిజమైన సంతోషాన్ని కలిగిస్తాయని, తను విజయాన్ని అలా ఆస్వాదిస్తానని తెలిపింది. తనకు కష్టపడడం మాత్రమే వచ్చని, సినిమా సక్సెస్ అయినప్పుడు ఆడియన్స్ ఆనందిస్తే, అదే తనకు ఆనందమని తెలిపింది.