జనసేనాని పవన్‌కల్యాణ్ పాలిట కాపు కురువృద్ధుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య జోరీగలా మారారు. చేగొండి కాస్త జగమొండిగా తయారయ్యారు. చేగొండి బాధ కాపుల బాధ, పవన్ బాధ చంద్రబాబును సీఎం చేయడమే. ఈ వాస్తవాన్ని పసిగట్టలేక పదేపదే ఎక్కువ సీట్లు కావాలని, సీఎం పదవిలో భాగం కావాలని చేగొండి హరిరామ జోగయ్య డిమాండ్ చేస్తుంటారు. కాపుల బాధను పవన్‌కు తెలియజేసేందుకు సోషల్ మీడియా వేదికగా బహిరంగ లేఖలు రాస్తుంటారు.
తాజాగా జనసేనకు 24 అసెంబ్లీ, 3 లోక్‌సభ స్థానాలను టీడీపీ ఇచ్చిన నేపథ్యంలో హరిరామ జోగయ్య మరోసారి ఘాటుగా స్పందించారు. ఓట్ల సంక్షోభానికి తెరదించే మార్గమే లేదా? అని ప్రశ్నిస్తూ చేసిన విశ్లేషణలో పవన్‌కు చీవాట్లు పెట్టడం చర్చనీయాంశమైంది. చేగొండి హరిరామ జోగయ్య తాజా లేఖలో పవన్‌ను నిగ్గదీశారు. జనసేన సమర్థతపై ఘాటు కామెంట్స్ చేశారు. చేగొండి అభిప్రాయాల్లో కీలక అంశాల గురించి తెలుసుకుందాం.
“జనసేనకు కేటాయించిన 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు సీట్లు జన సైనికుల సంతృప్తి మీద జరిగాయా? జన సైనికుల గౌరవానికి తగ్గట్లు జరిగాయా? అయినా ఒకరు యివ్వటం, మరొకరు దేహీ అంటూ పుచ్చుకోవటం పొత్తు ధర్మం అనిపించుకుంటుందా? అని విశ్లేషిస్తే …జరగలేదనే సమాధానం వస్తుంది”
“తెలుగుదేశం యివ్వటం, చేయి జాచి జనసేన తీసుకోవటం ఏమిటి? జనసేన పార్టీకి 24 సీట్లకు మించి నెగ్గగల స్తోమత లేదా? జనసేన పరిస్థితి ప్రజలలో అంత హీనంగా ఉందా? ఈ పంపకం కూడా రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే అని పవన్ కల్యాణ్ చెప్పగలరా? నిజానికి ఆర్థికంగా బలమైనవారు ఉండి, జనసేనకు సామాజికపరంగా అనువైన అసెంబ్లీ సీట్లు 50 నుంచి 60గా గుర్తింపబడిన మాట వాస్తవం. ఆయా నియోజకవర్గాల వివిధ కులాలకు సంబంధించి బలమైన అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించటం జరిగింది”
“ఏది ఏమైనా ఈ 24 నియోజకవర్గాలు కేటాయింపు అధిక సంఖ్యాకులైన జన సైనికులను సంతృప్తిపరచని మాట వాస్తవం. వారు కోరుకుంటున్నది రాజ్యాధికారంలో తమకు గౌరవమైన వాటా. అదీ సీట్ల పంపకంలో జరిగినప్పుడే పరిపాలనాధికారం కూడా దక్కుతుందనేది వారి వాదన. తాము కలలు కంటున్నట్లుగా పొత్తులోభాగంగానైనా తమ అధినేత పవన్ కల్యాణ్ గార్ని కనీసం 2 1/2 సం॥రాలు ముఖ్యమంత్రిగా చూడాలన్నది వారి కోరిక. తక్కువ సంఖ్యలో జనసేనకు సీట్ల కేటాయింపు ద్వారా ముందు ముందు తమకు అధికారంలో రావాల్సిన వాటా రాకుండా పోతుందేమోనన్నది వారి ఆవేదన. జన సైనికులను సంతృప్తి పరచకుండా వైఎస్ఆర్ పార్టీని ఎలా ఓడించగల్గుతామని కూటమి నాయకులు నమ్ముతున్నారో తెలియటం లేదు”
ఇంకా పలు కీలక అంశాలను లేఖలో హరిరామ జోగయ్య లేఖలో ప్రస్తావించారు. జోగయ్య ఆవేదనలోని సారాంశం ఏంటంటే..ఇంత తక్కువ సీట్లతో జన సైనికులు సంతృప్తి చెందరని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఓట్ల బదిలీ జరగదని నేరుగానే మరోసారి చెప్పారు. తక్కువ సీట్లు తీసుకోవడంతో తీవ్ర ఆవేదనకు లోనైన హరిరామ జోగయ్య కాస్త కఠినంగానే స్పందించారు. క్షేత్రస్థాయిలో జనసేన మరీ ఇంత హీనంగా వుందా? అని ఆయన ప్రశ్నించారు.