తెలుగుదేశం పార్టీ పొత్తు ప్రయాణంలో బోలెడన్ని ట్విస్టులు ఉండబోతున్నాయని స్పష్టం అవుతోంది. ఒకవైపు వైఎస్ జగన్ పై తీవ్ర వ్యతిరేకత ఉందని, జగన్ గాలికి వచ్చాడని, ఒక్క అవకాశం అంటే జగన్ కు ఛాన్సిచ్చారని చెప్పే తెలుగు తమ్ముళ్లు మరి అలాంటప్పుడు తమ అధినేత ఎందుకు పొత్తులంటూ వారి కాళ్లూ, వీరి గడ్డాలు పట్టుకుంటారనే ప్రశ్నకు సమాధానం చెప్పలేరు! సమాధానం సంగతలా ఉంటే.. చంద్రబాబు నాయుడు చేస్తున్న పొత్తుల విన్యాసాలతో తమ్ముళ్లే విసిగి వేసారిపోతున్నారు కూడా! అవసరమా ఈ పొత్తులు? అనే ప్రశ్న తమ్ముళ్లలో నిజాయితీగానే వినిపిస్తోంది.
జనసేనతో తెలుగుదేశం పార్టీకి పొత్తు వల్ల లాభం కలుగుతుందని నమ్మే తెలుగు తమ్ముళ్లు అయితే కొందరున్నారు. ఎన్ని సీట్లు ఇచ్చినా, పవన్ ఓట్లు గనుక తెలుగుదేశం పార్టీకి బదిలీ అయితే అది తమకు లాభం అని వారు అనుకుంటున్నారు. అయితే కాపు సామాజికవర్గం నేతలు మాత్రం.. జనసేనకు తగుమర్యాద ఇస్తేనే ఓట్ల బదలాయింపు జరుగుతుంది తప్ప, ఏదో తూతూమంత్రంగా సీట్లు ఇస్తే బదలాయింపు జరగదని గట్టిగా చెబుతున్నారు. రాయలసీమ వరకూ చూస్తే జనసేనతో పొత్తు అనేది తెలుగుదేశం పార్టీకి నష్టం చేసేదే తప్ప పైసా లాభం చేకూర్చేది కాదని కచ్చితంగా చెప్పవచ్చు. రాయలసీమలో ఆది నుంచి బలిజలు తెలుగుదేశం పార్టీకే మద్దతుగా ఉంటారు.
ఒకానొకప్పుడు బీసీలు ఎలా అయితే తెలుగుదేశం పార్టీకి అంటిపెట్టుకుని ఉండేవారో, బలిజలు ఇప్పటికీ తెలుగుదేశం పార్టీకే అంటిపెట్టుకుని ఉన్నారు. సీమలో బలిజల సావాసం ప్రధానంగా బీసీలతోనే ఉంటుంది. దీంతో రాజకీయంగా కూడా ఆ వర్గాలు తెలుగుదేశం పార్టీ వైపే నిలిచాయి. అయితే బీసీల్లో చాలా మార్పు వచ్చింది. 2009 నుంచినే ఈ మార్పు మొదలైంది. ఫీజురీయింబర్స్ మెంట్ పథకం బీసీల్లో బాగా మార్పు తీసుకువచ్చిన పథకం అని చెప్పొచ్చు.
అప్పటి వరకూ బీసీలకు చంద్రబాబు నాయుడు కత్తెరలు, సుత్తులు, శానాలు, సైకిళ్లు ఇచ్చి.. మీ పని మీరు చేయాలన్నట్టుగా అదే ఆదరణ అన్నట్టుగా బిల్డప్ కొడితే, వైఎస్ తెచ్చిన ఫీజురీయింబర్స్ మెంట్ పథకం వల్ల బోలెడంతమంది బీసీల పిల్లలు మంచి డిగ్రీలు చదువుకోగలిగారు. బీటెక్ లు, ఎంబీఏ, ఎంసీఏ వంటి వృత్తివిద్యా కోర్సులకు అందించిన ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం బీసీల గతినే మార్చి వేసింది. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం గనుక ఆ పథకం తీసుకురాకపోతే.. బీసీల పిల్లల్లో చాలా మంది ఆ కోర్సులను చదవగలిగే వారనడంలో పెద్ద ఆశ్చర్యం లేదు. ఆ ప్రభావం 2009 ఎన్నికల మీదే పడింది!
అప్పటి వరకూ తాము హార్డ్ కోర్ తెలుగు తమ్ముళ్ల అని చెప్పుకున్న వాళ్లంతా ఆ తెరలు తీసుకుబయటకు వచ్చారు. క్రమంగా ఆ శాతం మరింత పెరిగింది. రాజకీయంగా వైఎస్ జగన్ ఎంపిక చేసిన అభ్యర్థిత్వాలు కూడా కథలో మరింత మార్పు తీసుకొచ్చాయి. అలా బీసీలు విజయవంతంగా తెలుగుదేశం పార్టీకి దూరం అయినా, బలిజల్లో మాత్రం ఇంకా మెజారిటీ మంది జై తెలుగుదేశం అనే అంటారు సీమలో. వారికి పవన్ కల్యాణ్ పై కూడా అభిమానం అయితే ఉంది. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకే పడే ఓటు ఇప్పుడు పవన్ వల్ల అదనంగా అయితే మారదు! జనసేన, కమ్యూనిస్టు పార్టీలు, బీఎస్పీ కలిసి పోటీ చేసిన గత ఎన్నికల్లో .. రాయలసీమలో అయితే ఆ కూటమి నామమాత్రంగా కూడా ఓట్లను పొందలేదు! కాబట్టి.. ఆ ఓట్లన్నీ ఇప్పుడు తెలుగుదేశంతో కూడినా పరిస్థితిలో అయితే పెద్దగా మార్పు రాదు కూడా!
పై పెచ్చూ .. రాయలసీమలో సీట్ల షేరింగ్, జనసేన తరఫున నిలిచే వారికి తెలుగుదేశం పార్టీ గౌరవం ఇవ్వకపోవడం వంటివి కూడా అంతిమంగా టీడీపీకే నష్టం చేకూర్చే అంశాలే! కనీసం ఒక్కో పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక్కో సీటును జనసేనకు కేటాయించినా అక్కడ తెలుగుదేశంలో ముసలం మొదలయ్యే అవకాశం ఉంది. జనసేన తరఫున పోటీ చేసే వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ క్యాడర్ సహకారం అందించదనేది నిష్టూరమైన నిజం! వీలైతే చంద్రబాబు నాయుడే తెలుగుదేశం రెబల్ చేత నామినేషన్ వేయిస్తారు, అదీ కాదంటే.. ఆఖరి నిమిషంలో వారికే బీఫారం ఇచ్చి జనసేనను ఆటలో అరటిపండుగా మార్చగల సత్తా కూడా చంద్రబాబుకు ఉంది!
మరి జనసేనను అయితే చంద్రబాబు ఇలా ఆటాడుకోలగరు కానీ.. బీజేపీతో కూడా పొత్తు తెలుగుదేశం అధినేత చేజేతులారా చేసుకుంటున్న మరో పొరపాటుగా మారింది. బీజేపీ పేరు చెబితే రాయలసీమలో అయితే ఒక్క ఓటు పడకపోగా.. తెలుగుదేశం పార్టీకి వేద్దామనుకున్న మైనారిటీ వర్గాలు కూడా దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. మైనారిటీలో తెలుగుదేశం పార్టీకి హార్డ్ కోర్ అభిమానులున్నారు! రాయలసీమ, నెల్లూరు- ప్రకాశం జిల్లాల్లో ముస్లిం, క్రిస్టియన్లలో తెలుగుదేశం పార్టీకే ఓటు అనే వారు, ఆ పార్టీ తరఫున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే వారు, ఎన్నికల బరిలో నిలిచే వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే జాతీయ స్థాయి పరిణామాలతో బీజేపీ మైనారిటీలను హడలుగొడుతోంది!
బీజేపీ అంటే ఆది నుంచి మైనారిటీల్లో పెద్ద సానుకూలత లేదు. బీజేపీ మరింత బలీయమైన శక్తిగా మారుతుండటంతో సానుకూలత సంగతిని పక్కన పెడితే ఒక రకమైన వ్యతిరేకత తీవ్రమైంది. ప్రత్యేకించి దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి మైనారిటీల్లో వ్యతిరేకత బాగా పెరిగింది. కర్ణాటకలో అప్పటి వరకూ కాంగ్రెస్, జేడీఎస్, కమ్యూనిస్టు పార్టీలు ఇలా చీలిన మైనారిటీ ఓటు బ్యాంకు గత ఎన్నికల నాటికి ఏకతాటి మీదకు వచ్చింది. ఈ పరిణామాలు ఏపీలో కూడా మైనారిటీలు బీజేపీ వైపు మొగ్గనిచ్చేలా లేవు. చంద్రబాబు కోసం ఓటేయడానికి సిద్ధంగా ఉన్న ముస్లింలున్నారు, క్రిస్టియన్లూ ఉన్నారు! అయితే.. బీజేపీని ఇప్పుడు చంద్రబాబు చంకలో పెట్టుకురావడం వల్ల ఇలాంటి ఓట్లకు గండిపడటం ఖాయమైంది.
కేవలం మైనారిటీ ఓట్లే కాదు.. విభజిత ఏపీకి కూడా ఇప్పటి వరకూ బీజేపీ ఉద్ధరించింది శూన్యం! ఉమ్మడి ఏపీ విభజనలో కూడా కీలక పాత్ర పోషించిన కమలం పార్టీ , ఆ తర్వాత బోలెడన్ని హామీలు ఇచ్చి మోసమే చేసింది తప్ప చేసిందేమీ లేదు. ఏదో తెలుగుదేశం పార్టీ బలాన్ని ఉపయోగించుకుని కొద్దో గొప్పో సీట్లను రాబట్టుకోవాలనే ప్రయత్నమే తప్ప ఏపీని భవిష్యత్తులో ఉద్దరించే ఉద్దేశం కూడా కమలం పార్టీకి లేదు!
అన్నింటికీ మించి.. బీజేపీ బేరం ఏమిటనేది అత్యంత ఆసక్తిదాయకమైన అంశం. కమలం పార్టీ బేరం భారీ స్థాయిలో ఉంటే.. వీలైనన్ని ఎంపీ నియోజకవర్గాలనో, ఎమ్మెల్యే నియోజకవర్గాలనో కావాలని ఆ పార్టీ పట్టుబడితే ఆ కోటాలో తెలుగుదేశం పార్టీ నష్టపోవడం ఖాయం. అటు రాజకీయంగా ఉనికిని కోల్పోవడంతో పాటు, బీజేపీ ఆ సీట్లలో తన శక్తియుక్తులతో గెలవలేని పరిస్థితే ఏర్పడుంది. చంద్రబాబు ఏ లెక్కలతో బీజేపీతో పొత్తు పెట్టుకున్నా.. కనీసం 2014 నాటి బలం కూడా ఇప్పుడు ఏపీలో బీజేపీకి లేదు! అప్పుడు మోడీపై ఉన్న విపరీతమైన హైప్ చంద్రబాబుకు వీలైనంత మేలు చేసి ఉండవచ్చు. పదేళ్లు గడిచిపోయాయి.. మోడీ చేయగలిగేదేమిటో, చేస్తున్నది ఏమిటో కూడా జనాలకు క్లారిటీ వచ్చింది!