తెలుగుదేశం- బీజేపీ- జనసేనల పొత్తులో భాగంగా ఈ కూటమి తరఫున ఎన్నికల నాటికి చాలా మంది అనామక అభ్యర్థులు తెరపైకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. జనాలు మరిచిపోయిన వారు, జనాలను మరిచిపోయిన వారు, జనాలకు అస్సలు తెలియని వారు కూడా ఈ కూటమి తరఫున అభ్యర్థులుగా పోటీకి దిగబోతున్నారని స్పష్టం అవుతోంది.
పొత్తుల నేపథ్యంలో చంద్రబాబు నాయుడుకు అన్నింటినీ డిసైడ్ చేసే అవకాశాలు తక్కువగా ఉన్నట్టున్నాయి. చంద్రబాబు చేతిలో బ్యాలెన్స్ తప్పి పోయి.. చాలా చోట్ల ఎవరెవరో తెరపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ పొత్తులో భాగంగా రాజంపేట ఎంపీ అభ్యర్థిగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేయబోతున్నారనే టాక్ వస్తోంది! మరి ఇప్పుడు కిరణ్ అక్కడ పోటీ చేసేస్తే.. జనాలు ఎగిరిగంతేసి ఓట్లేసేస్తారనమాట! చెప్పుల పార్టీ పుట్టి మునిగాకా కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పటి వరకూ ఎక్కడా జనాల మధ్యన అడ్రస్ లేడు! కనీసం తన పార్టీ చిత్తుగా ఓడిన తర్వాత ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన వ్యక్తికాదాయన! ఆ తర్వాత కాంగ్రెస్ లో చేరాడో చేరతాడనే వార్తలు చాన్నాళ్ల పాటు వచ్చాయి.
అయితే అలా కాదని మళ్లీ బీజేపీలోకి చేరినట్టున్నారు. అక్కడ ఏనాడూ కిరణ్ పేరు వినిపించిన దాఖలాలు లేవు! అయితే ఇప్పుడు ఉన్న ఫలంగా పొత్తులో భాగంగా బీజేపీ తరఫున టీడీపీ, జనసేనల మద్దతుతో కిరణ్ కుమార్ రెడ్డి ఎంపీగా పోటీ చేసేస్తారట!
కేవలం కిరణ్ కుమార్ రెడ్డి మాత్రమే కాదు.. పొత్తుల నేపథ్యంలో ఇలాంటి వారెంతోమంది తెరపైకి వస్తారని టాక్! ధర్మవరం ఎమ్మెల్యే టికెట్ ను చంద్రబాబు నాయుడు బీజేపీకి ఇస్తారట! అక్కడ టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వరదాపురం సూరి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తారట! ఇన్నాళ్లూ అక్కడ పరిటాల శ్రీరామ్ ను ఇన్ చార్జిగా పెట్టారు చంద్రబాబు. ఇప్పుడు బీజేపీలోని తన శిష్యుడైన వరదాపురం సూరికి సీటు దక్కేలా చంద్రబాబు పొత్తు రాజకీయం ఉంటుందట! ఇది కూడా రాజకీయంగా మైనస్సే తప్ప ప్లస్ కాదు.
పార్టీ అధికారం కోల్పోగానే కమలం పార్టీలోకి చేరి పోయి తన స్వార్థం చూసుకున్న వరదాపురంపై టీడీపీ క్యాడర్ లో పీకల్దాకా ఉంది! అలాంటిది ఇప్పుడు ఆయన బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తే.. కసిగట్టుకుని టీడీపీ వాళ్లే ఓడిస్తారు కూడా! మొత్తానికి ఈ పొత్తుల వ్యవహారం ఇలా అయినా ఆసక్తిని రేకెత్తిస్తూ ఉంది!