మహా రాష్ట్ర రాజకీయాలు దేశాన్ని ఎప్పుడూ ఆకర్షిస్తూ ఉంటాయి. మహారాష్ట్రలో ముఖ్యమంత్రి మారిన, ప్రభుత్వం మారినా, కీలక రాజకీయ పరిణామాలు సంభవించినా.. దేశం యావత్తూ ఆసక్తితో వీక్షిస్తూ ఉంటుంది ఆ పరిణామాలను! రాజకీయంగా బోలెడంత వైవిధ్యం ఉన్న రాష్ట్రం కూడా ఇది! ఒకేవాదంతో రెండు పార్టీలను ఆదరించేంత పెద్ద మనసు మహారాష్ట్ర ప్రజలది! కాషాయవాదంతో ఒకప్పుడు బీజేపీ, శివసేనలు మిత్రపక్షాలుగా సమాదరణ పొందాయి! వీటి మధ్యన పెద్దన్న ఎవరు అనే పోరాటం విడిపోవడం వరకూ వచ్చింది. అది మరింత ముదిరి సేను బీజేపీ నిలువునా, అడ్డంగా చీల్చింది!
ఇప్పుడు అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే ప్రయత్నంతో ఉన్నాడు ఉద్ధవ్ ఠాక్రే! ఇక కాంగ్రెస్ వాదంలోనూ రెండు పార్టీల ఆదరణ ఉంది. కాంగ్రెస్ నుంచి చీల్చుకువచ్చి శరద్ పవార్ ఏర్పాటు చేసుకున్న ఎన్సీపీ ఆ తర్వాత దశాబ్దాలుగా కాంగ్రెస్ మిత్రపక్షంగా కొనసాగూనే ఉంది, మరోవైపు తన ఉనికినీ చాటుకుంటూ వచ్చింది. అయితే ఆ ఎన్సీపీనీ చీల్చి తన దోస్తుగా చేసుకుంది కమలం పార్టీ!
శివసేనలోని చీలిక పక్షం, ఎన్సీపీలోని చీలిక పక్షం ఇప్పుడు కమలం పార్టీకి మిత్రులు! ఎన్సీపీని గతంలో బీజేపీ బోలెడంత విమర్శించింది, స్వయంగా మోడీ అనేక పర్యాయాలు అన్నారు.. ఎన్సీపీ అంటే నేచురలీ కరప్టెడ్ పార్టీ అని! అలాంటి కరప్టెడ్ పార్టీలోని ప్రధాన నేతలందరినీ ఇప్పుడు బీజేపీ తన మిత్రులుగా చేసుకుంది. అయినా కమలం పార్టీ ఆకలి తీరడం లేదు!
కాంగ్రెస్ నుంచి కూడా నేతలను ఎడాపెడా చేర్చుకుంటూ ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు తీవ్రమైన అవినీతికి పాల్పడ్డారు అంటూ బీజేపీ ఎవరినైతే విమర్శించిందో వారిని ఇప్పుడు కళ్లకు అద్దుకుని చేర్చుకుంటోంది. చేరిన వెంటనే రాత్రికి రాత్రి వారిని రాజ్యసభకు నామినేట్ చేసేసింది! ఇలా బీజేపీ ఎన్సీపీ, కాంగ్రెస్ కలయికగా మారింది! మరి శివసేనను చీల్చినా, ఎన్సీపీని చీల్చినా బీజేపీ అయితే ఇంకా ప్రశాంతంగా ఉండలేకపోతున్నట్టుగా ఉంది. అందుకే కాంగ్రెస్ బుట్టలో కూడా చేతులు పెట్టి వీలైనంతమందిని చేర్చుకుంటోంది. మరికొందరిని శివసేన చీలిక వర్గంలోకో, ఎన్సీపీ చీలక వర్గంలోకో కలిపేస్తోంది! ఈ విషయంలో ఎన్ని విమర్శలు వచ్చినా వెనక్కు తగ్గడం లేదు కూడా!
రానున్న లోక్ సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో సీట్లను నెగ్గడంతో పాటు, ఆ వెంటనే జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కూడా బీజేపీకి ప్రతిష్టాత్మకమే. అందుకే బీజేపీ అక్కడ ఎంతకైనా తెగించడానికి రెడీ అయినట్టుగా ఉంది! అవినీతి పరులుగా తను ఎవరికైతే ముద్రలేసిందో వారితోనే ఇప్పుడు బీజేపీ అంటకాగుతోంది. దీని వల్ల జాతీయ స్థాయిలో తను నవ్వుల పాలవుతున్నానే స్పృహతో కూడా బీజేపీ లేదిప్పుడు. అధికారమే పరమావధి అయినప్పుడు ఇంక ఎలా నవ్వులపాలైతేనేం!
ఇక కాంగ్రెస్ కూటమి కూడా గట్టిగానే ప్రయత్నిస్తోంది. 2019 నాటికి కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనల ఓట్ల శాతం మొత్తం కలిపితే అది బీజేపీ ఓట్ల శాతం కన్నా ఎక్కువ అని, ఆ మూడు పార్టీలూ కలిసి పోటీ చేస్తే బీజేపీని ఓడించవచ్చనే లెక్క ఒకటి ఉంది. అయితే రాజకీయాల్లో వన్ ప్లస్ వన్ ఎప్పటికీ టూ కాదు. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీలు కలిసి పోటీ చేయడం అయితే ఖాయంగానే ఉంది. అయితే ఎన్సీపీ చీలిపోయింది, సేన చీలింది. మరి ఆ మేరకు ఆ పార్టీల ఓటు బ్యాంకు కూడా చీలి ఉంటుందా లేదా.. చీలిక వర్గాలకు ఆ పార్టీల అభిమానుల్లో ఆదరణ ఉందా లేదా అనేది ప్రశ్నార్థకం! అలాగే దశాబ్దాలుగా కాంగ్రెస్ ఎన్సీపీలకు శివసేన కు శత్రుపక్షంగానే చలామణిలో ఉంది.
ఇప్పుడు ఈ చేతులు కలపడానికి ఇరు పార్టీల కార్యకర్తలూ ఏ మేరకు ఆమోదిస్తారో చూడాల్సి ఉంది. ఇప్పటికే సేన చీలింది. ఆ ప్రభావం కూడా ఈ పొత్తుపై ఉంటుంది. అలాగే ఈ కూటమి తరఫున సీట్ల బేరం కూడా ఇంకా తెగలేదు!
తమ పార్టీ 23 ఎంపీ సీట్లలో పోటీ చేస్తుందని ఉద్దవ్ సేన ప్రకటించేసుకుంటోంది. అయితే ఈ సేనకు 13 ఎంపీ సీట్లు, కాంగ్రెస్ కు 14, శరద్ పవార్ చేతిలో ఉన్న ఎన్సీపీకి 9, స్థానిక చోటా పార్టీలకు రెండు అనే లెక్క కుదిరిందట, మరో ఎనిమిది ఎంపీ సీట్ల విషయంలో ప్రధానంగా కాంగ్రెస్- ఉద్ధవ్ సేనల మధ్యన ప్రతిష్టంభన నెలకొంది.
ఇక బీజేపీ కూటమిలో ఇంకా సీట్ల తకరారు క్లారిటీ వచ్చినట్టుగా లేదు. అజిత్ పవార్ ఎన్సీపీకి బీజేపీ ఎన్ని సీట్లు ఇస్తుంది, శివసేన చీలిక వర్గానికి ఎన్ని ఇస్తుంది, తను ఎన్ని పోటీ చేస్తోందో కమలం పార్టీ ఇంకా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది!
-హిమ