టీడీపీకి పెద్ద దిక్కు ఆయనే?

విశాఖ టీడీపీకి పెద్ద దిక్కుగా ఒకనాడు మాజీ ఎంపీ ఎంవీవీస్ మూర్తి ఉండేవారు. ఆయన విశాఖ మాత్రమే కాదు ఉత్తరాంధ్రా జిల్లాల దాకా పార్టీ గురించి పట్టించుకునేవారు. అన్ని రకాలైన వనరుల విషయంలో ఆయన…

విశాఖ టీడీపీకి పెద్ద దిక్కుగా ఒకనాడు మాజీ ఎంపీ ఎంవీవీస్ మూర్తి ఉండేవారు. ఆయన విశాఖ మాత్రమే కాదు ఉత్తరాంధ్రా జిల్లాల దాకా పార్టీ గురించి పట్టించుకునేవారు. అన్ని రకాలైన వనరుల విషయంలో ఆయన చాలా వరకూ బాధ్యత వహించేవారు. ఒక విధంగా ఆ రోజులలో టీడీపీ నిబ్బరంగా ఉండేది అంటే ఎంవీవీఎస్ వల్లనే అని చెబుతారు.

ఆయన ఆరేళ్ల క్రితం దివంగతులు అయ్యారు. ఆయన వారసుడిగా వచ్చిన మనవడు బాలయ్య అల్లుడు శ్రీభరత్ ఇన్నాళ్ళకు ఆ ప్లేస్ లోకి కుదురుకుంటున్నారు అని అంటున్నారు. ఈసారి ఎన్నికల్లో విశాఖకు సంబంధించి అంగబలం అర్ధబలం బాధ్యతలు శ్రీభరత్ చూసుకుంటారు అని ప్రచారం సాగుతోంది.

ఆయన విశాఖ ఎంపీ టికెట్ ని ఆశిస్తున్నారు. పొత్తుల వల్ల అది కాకపోయినా ఆయనకు ఎమ్మెల్యే అయినా అకామిడేట్ చేసేందుకు పార్టీ సిద్ధంగా ఉంది అని అంటున్నారు. ఇటీవల తోడల్లుడు నారా లోకేష్ శంఖారావం పేరుతో విశాఖలో సభలు నిర్వహిస్తే ఆయన వెంటే ఉంటూ శ్రీభరత్ అన్నీ చూసుకున్నారు. ఆయన ఉత్తర నియోజకవర్గం పార్టీకి నేనే అందుబాటులో అన్ని వేళలా ఉంటాను అని భరోసా ఇచ్చారు.

తెలుగుదేశం పార్టీకి ఇప్పటిదాకా అంగబలం అర్ధబలం వంటి విషయాలలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఉండేవారు. ఆయనను ఇపుడు విశాఖ జిల్లా నుంచే షిఫ్ట్ చేయబోతున్నారు. ఆయనను చీపురుపల్లి నుంచి పోటీ చేయమని పార్టీ కోరుతోంది. శ్రీభరత్ విశాఖ పార్టీ వ్యవహారాలు చూసుకుంటున్నందువల్లనే పార్టీకి ఈ ధీమా వచ్చింది అని అంటున్నారు.

శ్రీభరత్ సన్నిహిత బంధువు కూడా అవుతారు కాబట్టి సొంత మనిషి పర్యవేక్షణ అవసరం అని కూడా పార్టీ పెద్దలు అభిప్రాయపడుతున్నట్లుగా ఉంది అని అంటున్నారు. శ్రీభరత్ విషయంలో చంద్రబాబు లోకేష్ పూర్తి సానుకూలంగా ఉన్నారని అంటున్నారు. ఎంవీవీస్ మూర్తి అయితే రాజకీయ వ్యూహాలను కూడా రూపొందిస్తూ అన్ని పార్టీలతో కలుపుగోలుగా ఉంటూ టీడీపీని ముందుకు తీసుకెళ్ళేవారు. శ్రీభరత్ కూడా తన తాత మాదిరిగా విశాఖ టీడీపీకి పెద్ద దిక్కుగా అవుతారా అన్నది ముందు ముందు చూడాలని అంటున్నారు.