అనకాపల్లి ఎంపీ సీటు జనసేన తరఫున పోటీ చేయనున్న సినీ నటుడు నాగబాబుకు టఫ్ అవుతుందా అన్న విశ్లేషణ వినిపిస్తోంది. అనకాపల్లిలో తూర్పు కాపులు, కొప్పుల వెలమలు ఎక్కువ. ఈ రెండు సామాజిక వర్గాల డామినేషన్ కూడా బాగా ఉంటుంది. ఎన్నికల్లో వీరి ప్రభావం అధికంగా ఉంటుంది.
సామాజిక సమీకరణలు రీత్యా చూసుకుంటే నాగబాబు గోదావరి జిల్లాలకు చెందిన ఓసీ కాపుగా ఉంటారు. బీసీలు ఎక్కువగా ఉన్న ఈ ప్లేస్ లో ఆయన పోటీకి సిద్ధపడుతున్నారు. అలాగే ఉత్తరాంధ్రా అంటే ఎన్నో బీసీ కులాలు ఉంటాయి. ఇక్కడ ఉన్నన్ని కులాలు కూడా ఎక్కడా లేవు.
బీసీల కోటగా చెప్పుకునే అనకాపల్లిలో నాగబాబు ఎంపీ పోటీ అన్నది ఒక విధంగా కత్తి మీద సాము అని అంటున్నారు. బీసీ నేత, మాజీ ఎంపీ కొణతాల రామక్రిష్ణకు ఎంపీ టికెట్ ఇవ్వలేదని ఆయనకు అన్యాయం జరిగిందన్న ప్రచారం కూడా అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్ లో సాగుతోంది.
అనకాపల్లిలోని గవర ఉప కులానికి చెందిన కీలక బీసీ నేతగా కొణతాల ఉన్నారు. ఆయన రాజకీయ సామాజిక ప్రభావం కూడా బలంగా ఉంటుంది అని అంటున్నారు. ఆయన తగ్గినా అనుచరులు అభిమానులు ఆ సామాజిక వర్గం మాత్రం ఈ విషయంలో రగులుతూనే ఉంటుంది అని అంటున్నారు.
తెలుగుదేశం నుంచి ఎంపీ సీటు కోసం ఆశావహులు అనేక మంది ఉన్నారు. వారంతా కూడా జనసేన తరఫున నాగబాబుకు ఎంతవరకూ మనస్పూర్తిగా మద్దతు ఇస్తారు అన్నది కూడా చూడాల్సి ఉంది. నాగబాబు ఎంపీ అభ్యర్ధిగా నిలబడితే కొప్పుల వెలమ సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు వైసీపీ తరఫున పోటీ చేస్తారు అని ప్రచారంలో ఉంది.
కొప్పుల వెలమలు అంతా బూడికే అపుడు మద్దతుగా నిలిచే అవకాశం ఉంటుంది. అలాగే బీసీలలో కూడా భారీ చీలిక వస్తుంది అని అంటున్నారు. గవర సామాజిక వర్గం ఎక్కువగా ఉండే మాడుగుల నుంచి రెండు సార్లు గెలిచిన బూడికి ఆ సామాజిక వర్గం దన్ను కూడా గట్టిగానే ఉంటుంది అని చెబుతున్నారు.
నాగబాబు వర్సెస్ బూడి అయితే మాత్రం పోటీ చాలా గట్టిగానే ఉంటుంది అని అంటున్నారు. ఈ గట్టి పోటీలో కూడా మొగ్గు బీసీ అభ్యర్ధి వైపే ఉండే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. దీనికి తోడు లోకల్ కార్డు కూడా అనకాపల్లి ఎంపీ ఎన్నికల్లో ఎపుడూ ప్రభావం చూపిస్తుంది. పారాచూట్ నేతలకు ఎపుడూ జనాలు చోటు ఇవ్వలేదు అని గుర్తు చేస్తున్నారు. ఈ సమీకరణలు అన్నీ చూసినపుడు నాగబాబు గట్టిగా శ్రమ పడాల్సిన అవసరాన్ని తెలియ చెబుతున్నాయని అంటున్నారు.