గతంలో ఎన్నడూ చూడని ప్రయోగాలను ఈసారి తెలుగుదేశం పార్టీ చేస్తోంది అని అంటున్నారు. ఎన్నికలు వస్తే చాలు సీనియర్ నేతలను ముందు పెట్టి వారితోనే బండి లాగించేస్తూ అనుభవం అని టీడీపీ చెప్పుకుంటూ ఉండేది. గతంలో అది వర్కౌట్ అయినా వైసీపీ ఫ్రెష్ క్యాండిడేట్స్ ని ఎక్కడికక్కడ పరిచయం చేస్తూ మంచి ఫలితాలు అందుకోవడంతో టీడీపీ అదే రూట్ లో వెళ్తోందని అంటున్నారు.
విజయనగరం ఎంపీ సీటు విషయంలో ఎన్నికల రాజకీయాలకు పూర్తిగా కొత్త ముఖం అయిన వారికి ఇచ్చేందుకు టీడీపీ చూస్తోంది అన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. సాఫ్ట్ వేర్ దిగ్గజం గా ఉన్న గేదెల శ్రీనుబాబుని ఎంపీ అభ్యర్ధిగా నిర్ణయిస్తారు అని ప్రచారం సాగుతోంది.
ఆయన అయిదేళ్ల క్రితమే విశాఖ నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేయాలని అనుకున్నారు. తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన బీసీ నేత కావడం ఆయనకు ప్లస్ పాయింట్. అంగబలం అర్ధబలం గట్టిగా ఉన్న వారు కావడం మరో ప్లస్ పాయింట్. అయిదేళ్ల క్రితం జనసేన నుంచి విశాఖలో పోటీ చేయాలని చూస్తే ఆ టికెట్ జేడీ లక్ష్మీనారాయణకు వెళ్ళిపోయింది.
ఆ తరువాత శ్రీనుబాబు వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి విశాఖ కానీ విజయనగరం కానీ ఎంపీ టికెట్ ఆశించారు అని ప్రచారం సాగింది. ఆ రెండు టికెట్లు బొత్స కుటుంబానికి వెళ్లడంతో ఆయన టీడీపీలో చేరుతున్నారని అంటున్నారు. ఇటీవల ఉత్తరాంధ్రా పర్యటనకు వచ్చిన నారా లోకేష్ తో ఆయన భేటీ అయ్యారు. దాంతో ఆయన చేరిక ఖాయం అని అంటున్నారు.
విజయానగరంలో తూర్పు కాపులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. దాంతో శ్రీనుబాబుని పోటీకి పెడితే బాగుంటుంది అని టీడీపీ భావిస్తోంది అంటున్నారు. ఇప్పటికే పల్సస్ సంస్థ ద్వారా యువత కోసం కార్యక్రమాలు చేపడుతూ వస్తున్న ఆయన అది తనకు కలసివస్తుందని భావిస్తున్నారు.
శ్రీనుబాబుకు విజయనగరం ఎంపీ టికెట్ ఖరారు అయితే కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుకు ఆప్షన్ లేనట్లే అంటున్నారు. ఆయన తన కుమార్తె అదితి గజపతిరాజుని అసెంబ్లీకి పోటీ చేయించి తాను ఎంపీగా చేయాలనుకుంటున్నారు. అయితే ఒక కుటుంబానికి ఒకే టికెట్ అంటూ టీడీపీ ఈ విధంగా కొత్త ముఖాన్ని రంగంలోకి దించుతోంది అని అంటున్నారు.