ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో హీరో మహేష్ బాబు ఫ్యాన్స్ టీడీపీకి మద్దతు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకులు కూడా ఇదే అంచనా వేస్తున్నారు. ఇందుకు కారణం … ఎన్నికల్లో మహేష్ బాబు బాబాయి అంటే దివంగత హీరో కృష్ణ తమ్ముడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు టీడీపీ అభ్యర్థిగా పెనమలూరు నుంచి పోటీ చేయబోతున్నారు కాబట్టి.
చంద్రబాబు నాయుడు ఆయనకు టిక్కెట్ ఖరారు చేసినట్లు సమాచారం. దీంతో మహేషబాబు ఫ్యాన్స్ టీడీపీకి మద్దతు ఇస్తారని అంటున్నారు. నాడు నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఆదిశేషగిరి రావు మహేష్ ఫ్యాన్స్ తో సమావేశమై పార్టీకి అనుకూలంగా పని చేసేలా ఒప్పించారు. టీడీపీ నాయకులు ఈ విషయం గుర్తు చేస్తున్నారు.
కృష్ణ అల్లుడు గల్లా జయదేవ్ టీడీపీ నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. ఈ సారి పోటీకి దూరంగా ఉన్నారు. ఈ సమయంలో ఆదిశేషగిరి రావు పేరు తెర పైకి వచ్చింది. టీడీపీ అధినేత చంద్రబాబుకు వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో అభ్యర్దుల పైన స్పష్టత ఇచ్చారు. వైసీపీ నుంచి నేతలు పార్టీలోకి వస్తున్న వేళ ముఖ్యమైన సీట్ల విషయం లో ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఎన్డీఆర్ జిల్లాలో సీట్ల విషయంలో అనేక మార్పులు ఖాయంగా కనిపిస్తున్నాయి. అక్కడ పెనమలూరు సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే పార్థసారధి వచ్చే ఎన్నికల్లో టీడీపీ నూజివీడు అభ్యర్దిగా పోటీ చేస్తున్నారు. అక్కడ టీడీపీ నేత ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరటం ఖాయమైంది. ఈ సమయంలో పెనమలూరు నుంచి కొత్త అభ్యర్దిని చంద్రబాబు ఖరారు చేసినట్లు సమాచారం.
దివంగత సినీ హీరో కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు టీడీపీ అభ్యర్దిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. గతంలో వైసీపీలో క్రియాశీలకంగా పని చేసిన ఆదిశేషగిరి రావు టీడీపీలో చురుగ్గా ఉంటున్నారు. తాజాగా చంద్రబాబును కలిసిన ఆదిశేషగిరి రావు తాను పెనమలూరు నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసారు.
చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసారని పార్టీ నేతలు చెబుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ తరువాత సినీ రంగం నుంచి ఆదిశేషగిరి రావు తొలిగా స్పందించి ఖండించారు. వాస్తవానికి సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. ఆయనకు ప్రత్యక్ష రాజకీయాలపై బాగా ఆసక్తి ఉందని అంటుంటారు.
ఈ క్రమంలోనే 2014 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో జాయిన్ అయ్యారు. ఆ ఎన్నికల్లో గుంటూరు ఎంపీ టిక్కెట్ ఆశించారని చెబుతారు. అయితే ఆశించిన టిక్కెట్ దక్కలేదనో ఏమో కానీ అనంతరం ఆయన వైసీపీకి రాజీనామా చేశారు. గతంలో కాంగ్రెస్ లోనూ పనిచేశారు. కాగా… పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టుందని చెబుతారు. ఇదే సమయంలో అక్కడ టీడీపీ సీటు కోసం నేతల మధ్య గట్టి పోటీ కూడా ఉంది.
ప్రస్తుత ఇన్ చార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఉండగా… మైలవరం నుంచి మాజీ మంత్రి దేవినేని ఉమాను ఇక్కడ నుంచి పోటీ చేయిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ సమయంలో ఆదిశేషగిరిరావు పేరు తెరపైకి వచ్చింది. ఆదిశేషగిరి రావు పోటీ చేయటం ద్వారా కృష్ణ , మహేష్ బాబు ఫ్యాన్స్ టీడీపీకి మద్దతుగా నిలుస్తారని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు.