హారర్ ను పీక్ స్టేజ్ లో చూపించే సినిమాలొస్తున్నాయి. ఒకప్పట్లా కెమెరా యాంగిల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో భయపెడతామంటే కుదిరే పని కాదు. ఓటీటీ విజృంభనతో ప్రేక్షకులు కూడా అప్ డేట్ అయ్యారు. మసూద హిట్టయినా, తాజాగా వచ్చిన పిండం, పొలిమేర-2 అందర్నీ ఆకర్షించినా, ఊహించని హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టే ఆదరణ దక్కింది.
వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా తమ సినిమా కూడా ఉంటుందని చెబుతోంది తంత్ర యూనిట్. అనన్య నాగళ్ల లీడ్ రోల్ పోషించిన చిత్రం తంత్ర. ఈ సినిమాకు ఎ-సర్టిఫికేట్ వచ్చింది. హారర్ ఎలిమెంట్స్ గట్టిగా ఉన్నాయని, అందుకే 'ఎ' ఇవ్వాల్సి వచ్చిందని స్వయంగా సెన్సార్ సభ్యులు ప్రకటించారు.
దీంతో తంత్ర యూనిట్ దీన్నే తమ ప్రచారానికి వాడుకుంది. ఎ-సర్టిఫికేట్ ను ప్రముఖంగా ప్రస్తావిస్తూ తమ సినిమాకు పిల్ల బచ్చాలు రావొద్దంటూ స్టేట్ మెంట్ ఇచ్చింది. అలా తమ సినిమాలో హారర్ నెక్ట్స్ లెవెల్లో ఉందంటూ చెప్పకనే చెబుతోంది.
ఈ సినిమాపై అనన్య నాగళ్ల చాలా హోప్స్ పెట్టుకుంది. వకీల్ సాబ్ సినిమా ఆమె కెరీర్ కు ఏమీ కలిసిరాలేదు. ఇప్పుడీ తంత్ర మూవీతో మరోసారి బిజీ అవ్వాలని చూస్తోంది. అన్నట్టు ఇదే సినిమాలో మర్యాదరామన్న ఫేమ్ సలోనీ కూడా నటించింది. ఆమెది కూడా సేమ్ సిచ్యుయేషన్.
కొత్త కుర్రాడు శ్రీనివాస్ గోపిశెట్టి ఈ సినిమాను తెరకెక్కించగా.. దివంగత నటుడు శ్రీహరి కుటుంబానికి చెందిన ధనుష్ రఘుముద్రి ఈ సినిమాతో హీరోగా పరిచయమౌతున్నాడు.