స్మశానంలో సినిమా ఫంక్షన్

సినిమా ఫంక్షన్ అనగానే ఎవరైనా పార్క్ హయత్ వైపు లేదా జేఆర్సీ కన్వెన్షన్ వైపు చూస్తారు. తక్కువలో తక్కువ కానిచ్చేయాలనుకుంటే ప్రసాద్ ల్యాబ్స్ ఉండనే ఉంది. మరి స్మశానంలో సినిమా ఫంక్షన్ ఎవరైనా చేస్తారా?…

సినిమా ఫంక్షన్ అనగానే ఎవరైనా పార్క్ హయత్ వైపు లేదా జేఆర్సీ కన్వెన్షన్ వైపు చూస్తారు. తక్కువలో తక్కువ కానిచ్చేయాలనుకుంటే ప్రసాద్ ల్యాబ్స్ ఉండనే ఉంది. మరి స్మశానంలో సినిమా ఫంక్షన్ ఎవరైనా చేస్తారా? ఇదే ఇక్కడ గమ్మత్తు.

టాలీవుడ్ లో ఓ సినిమా ఫంక్షన్ ను నిజంగానే స్మశానంలో చేస్తున్నారు. సినిమా పేరు గీతాంజలి మళ్లీ వచ్చింది. వేదిక.. బేగంపేట స్మశాన వాటిక. శనివారం రాత్రి 7 గంటలకు బేగంపేటలోని స్మశాన వాటికలో గీతాంజలి మళ్లీ వచ్చింది సినిమా టీజర్ ను లాంఛ్ చేస్తున్నారు. మీడియాను అక్కడికే ఆహ్వానించారు. ఏర్పాట్లు ఘనంగా చేస్తున్నారంట.

సూపర్ హిట్టయిన గీతాంజలి సినిమాకు కొనసాగింపుగా వస్తోంది “గీతాంజలి మళ్లీ వచ్చింది”. నటి అంజలికి ఇది ప్రతిష్టాత్మక 50వ చిత్రం. హారర్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన సినిమా కాబట్టి, స్మశానంలో టీజర్ లాంచ్ చేస్తే బాగుంటుందని యూనిట్ గట్టిగా ఫీలైనట్టుంది. అందుకే ఇలా డిసైడ్ అయ్యారు. 

కోన ఫిలిం కార్పొరేషన్, ఎంవీవీ సినిమా బ్యానర్లపై తెరకెక్కింది “గీతాంజలి మళ్లీ వచ్చింది”. ఈ హారర్ కామెడీ సినిమాలో క్యారెక్టర్స్ భయపడుతుంటే ప్రేక్షకులకు నవ్వు వస్తుందట. ఇక క్యారెక్టర్స్ నవ్వుతుంటే, థియేటర్ లో ప్రేక్షకులకు భయమేస్తుందంట. శివ తుర్లపాటి డైరక్ట్ చేసిన ఈ సినిమాలో శ్రీనివాసరెడ్డి, సత్యంరాజేష్, షకలక శంకర్, అలీ, సునీల్ కీలక పాత్రలు పోషించారు. ఇంతకీ స్మశానంలో జరిగే ఈ సినీ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ ఎవరో..?