జనసేన అంటే కాపుల పార్టీ అనే విమర్శకు బలం కలిగించేలా చేరికలున్నాయి. తాజాగా మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బరాయుడు జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆయన అనుచరులు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం టికెట్‌ను ఆయన ఆశిస్తున్నారు. ఈ మేరకు జనసేనలో ఆయన చేరుతున్నారని సుబ్బరాయుడు అనుచరులు చెబుతున్నారు.
రాజకీయాల్లో సుదీర్ఘ అనుభం కలిగిన సుబ్బరాయుడు ఒకప్పుడు పశ్చిమగోదావరి జిల్లాలో ఓ వెలుగు వెలిగారు. నర్సాపురం నుంచి నాలుగుసార్లు టీడీపీ తరపున, ఒకసారి కాంగ్రెస్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అలాగే 1996లో నర్సాపురం లోక్‌సభ సభ్యుడిగా టీడీపీ తరపున గెలిచారు. గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పని చేశారు. 2009లో పీఆర్పీలో చేరడంతో కొత్తపల్లి రాజకీయ పయనం ఒడిదుడుకలకు లోనైంది.
పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆయన కూడా అదే పార్టీలో కొనసాగారు. 2014లో ఆయన టీడీపీలో చేరారు. కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2019లో వైసీపీలో చేరారు. నర్సాపురం ఎమ్మెల్యేతో విభేదాల కారణంగా వైసీపీని వీడారు.
ఇప్పుడు జనసేనలో చేరేందుకు పవన్‌కల్యాణ్‌తో చర్చించినట్టు సమాచారం. జనసేనలో చేరి నర్సాపురం నుంచి పోటీ చేయాలనేది ఆయన వ్యూహం. కొత్తపల్లి ఆలోచనలకు తగ్గట్టు జనసేనాని పవన్‌కల్యాణ్ ఏ మేరకు నడుచుకుంటారో చూడాలి.