కాస్త ఆలస్యంగా అయినా పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి జనసేనాని పవన్‌కల్యాణ్ ఇవాళ వెళుతున్నారు. ఈ నెల 14న పవన్ భీమవరానికి వెళ్లాల్సి వుండింది. అయితే హెలీకాప్టర్ ల్యాండ్ కావడానికి అనుమతి ఇవ్వకపోవడంతో పశ్చిమగోదావరి జిల్లా పర్యటనే ఆయన రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఆయన హెలీకాప్టర్ దిగడానికి అనుమతి లభించింది.
ఇవాళ సాయంత్రం భీమవరంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో పవన్ సమావేశం కానున్నారు. అంతకు ముందు టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంజిబాబుతో సమావేశం అవుతారని జనసేన వర్గాలు తెలిపాయి.
ఇటీవల ఆయన విశాఖ, రాజమండ్రిలలో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన పోటీ చేసే నియోజకవర్గాలపై క్లారిటీ ఇవ్వడంతో పాటు చాలా వరకూ అభ్యర్థులను కూడా ప్రకటించారు. రాజానగరం మినహాయిస్తే రాజమండ్రితో పాటు విశాఖ జిల్లాలో నాలుగైదు నియోజకవర్గాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పవన్ భీమవరం పర్యటన ఆసక్తి రేపుతోంది. ఎందుకంటే భీమవరంలోనే పవన్ మరోసారి పోటీ చేస్తారనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. గత ఎన్నికల్లో భీమవరం, గాజువాక నియోజకవర్గాల్లో పవన్ పోటీ చేసి, రెండు చోట్లా ఓటమి మూటకట్టుకున్నారు. దీంతో ఒంటరిగా పోటీ చేస్తే రాజకీయంగా వీరమరణం తప్ప, విజయం సాధించలేనని ఆయన బహిరంగంగానే ప్రకటించారు. అసెంబ్లీలో తాను అడుగు పెట్టాలనే పట్టుదల నుంచి పుట్టిందే పొత్తు.
మరోవైపు టీడీపీకి జనసేన అండ లేనిదే జగన్‌ను ఎదుర్కోలేమని అర్థమైంది. ఇరు పార్టీల రాజకీయ అవసరాలు పొత్తుకు దారి తీశాయి. అయితే పవన్‌కల్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయమై ఇప్పటికీ సస్పెన్స్.
ఈ దఫా పవన్ ఎన్ని నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తారనేది కూడా తెలియడం లేదు. పవన్‌ను జగన్ బాగా భయపెట్టారన్నది నిజం. ఒకవేళ తాను పోటీ చేసే నియోజకవర్గాన్ని ముందే ప్రకటిస్తే, జగన్ ఎలాగైనా ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డుతారని పవన్ వణికిపోతున్నారు. అందుకే తాను పోటీ చేసే సీటుపై మాత్రం అడగొద్దని పవన్ అంటున్నారు.
అయితే ఎన్నికలు సమీపిస్తుండడం, మరోవైపు జనసేన పోటీ చేసే నియోజకవర్గాలపై కొన్ని చోట్ల స్పష్టత ఇస్తున్న నేపథ్యంలో భీమవరం పర్యటన ఆసక్తి రేపుతోంది. భీమవరం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ప్రకటించి, సస్పెన్స్‌కు తెరదించుతారా? లేక మరికొంత కాలం కొనసాగిస్తారా? అనే చర్చకు తెరలేచింది.
ఎన్నికల షెడ్యూల్ వచ్చే వరకూ తన సీటుపై ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ స్పష్టత ఇవ్వరని జనసేన నాయకులు అంటున్నారు. ఎన్నికల షెడ్యూల్ వస్తే, ఇక ప్రభుత్వ నిధుల్ని పవన్ పోటీ చేసే నియోజకవర్గంలో జగన్ కుమ్మరించలేరనేది వారి ఆలోచన. ఏది ఏమైనా భీమవరంలో పోటీ చేయడంపై ప్రకటించే సాహసానికి పవన్ ఒడికడతారా? అనేది చర్చనీయాంశమైంది.