నారా లోకేశ్ యువగళం పాదయాత్ర మొదలు పెట్టినప్పటి బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన అంశం రెడ్ బుక్. వైసీపీ శ్రేణుల్ని , అధికారుల్ని బెదరగొట్టి, రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకోవచ్చనే వ్యూహంతో లోకేశ్ రెడ్‌బుక్‌ను తెరపైకి తెచ్చారు.
ప్రతి దానికీ రెడ్ బుక్ చూపిస్తూ…ఇదిలో ఇందులో మీ పేర్లు రాసుకున్నా, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మీ పని పడతా అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించడం మొదలు పెట్టారు.
నిజమే, లోకేశ్ అనుకున్నట్టు వైసీపీ నాయకులు, కార్యకర్తలు భయపడ్డారు. అయితే లోకేశ్ ఊహించినట్టు ఆయనకు ఎవరూ దాసోహం కాలేదు.
టీడీపీ అధికారంలోకి రాగానే అది చేస్తా, ఇది చేస్తా అని లోకేశ్ హెచ్చరిస్తున్నారు కదా, అసలు ఆ పార్టీకి అధికారం దక్కకుండానే చేస్తే అనే పట్టుదలతో ప్రత్యర్థులు ముందుకు సాగేలా రెడ్ బుక్ ఉపయోగపడింది. లోకేశ్ ఎక్కువ భయపెట్టి, వైసీపీలో అసంతృప్తులను సైతం జగన్ విజయం కోసం పని చేసేందుకు ఉసిగొల్పింది.
తాను మూర్ఖుడిని అని, చంద్రబాబు మాదిరిగా ఊరికే విడిచి పెట్టనని లోకేశ్ తరచూ హెచ్చరిస్తున్నారు. ఇవన్నీ ఆయన ఏ ఉద్దేశంతో చేస్తున్నారో తెలియదు. కానీ రెడ్ బుక్ చూపి వార్నింగ్ ఇవ్వడం మాత్రం జగన్ నెత్తిన పాలు పోసినట్టే అని వైసీపీ నేతలు అంటున్నారు.
వైసీపీలో అసంతృప్తులను ఎలా సర్ది చెప్పుకోవాలని ఆలోచిస్తున్న తరుణంలో, ఆ పని లోకేశ్ పుణ్యాన సులువైందని అధికార పార్టీ నేతలు చెప్పడం విశేషం.
మనకెందుకులే అని ఊరుకున్న వైసీపీ నాయకులు, కార్యకర్తల్ని అనివార్య పరిస్థితుల్లో మళ్లీ జగన్ కోసం క్షేత్రస్థాయిలో పని చేయించడంలో రెడ్ బుక్ ప్రధాన పాత్ర పోషించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
లోకేశ్ మూర్ఖత్వాన్ని అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రదర్శించి వుంటే, వైసీపీకి నష్టం జరిగేది. కానీ లోకేశ్ అత్యుత్సాహంతో , అధికారంలోకి వచ్చినట్టే అని భావించి, ప్రత్యర్థులపై తీవ్ర హెచ్చరికలు చివరికి టీడీపీ నష్టం కలిగిస్తుండగా, వైసీపీ శ్రేణుల్ని ఏకం చేస్తున్నారు.
రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే లోకేశ్ రెడ్ బుక్, తోలు, తాట తీస్తా లాంటి అతిశయోక్తి వార్నింగ్‌లకు తెగబడుతున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.