ఏపీలో అధికార పక్షం వైసీపీ గ్రాఫ్ క్రమంగా పెరుగుతోంది. రెండు నెలల క్రితం వైసీపీ పరిస్థితి… ఓటమి వైపు పయనిస్తోందన్న భావన చాలా మందిలో వుండేది. ఎన్నికల సమయానికి వైసీపీపై మరింత వ్యతిరేకత పెరుగుతుందనే చర్చ విస్తృతంగా సాగింది. నిజానికి అదే జరిగి వుండాలి. కానీ వైసీపీ గ్రాఫ్ పడిపోవడం పక్కన పెడితే, పెరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనికి ప్రధాన కారణం జగన్ గద్దె దించాలన్న ప్రతిపక్షాల కూటమి సరైన మార్గంలో నడవకపోవడమే.
ఒంటరిగా వైసీపీని ఎదుర్కోలేమనే ఉద్దశంతో టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ జట్టు కట్టారు. అధికారంలోకి రావడానికి ఎవరి పంథా వారిది. దీన్ని ఎవరూ కాదనలేరు. టీడీపీ, జనసేన అధికారికంగా పొత్తు కుదుర్చుకోవడంతో ఆ రెండు పార్టీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. వైసీపీ శ్రేణుల్లో కలవరం మొదలైంది. ఇల్లలకగానే పండగా కాదన్న సామెత చందంగా… టీడీపీ, జనసేన పొత్తులో సమన్వయం ప్రధాన సమస్యగా మారింది.
రాజకీయాల్లో ఎప్పుడూ 2+2= 4 కాదని అంటారు. దీనికి టీడీపీ, జనసేన కలయిక అతీతం కాదలేదు. టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకోవడంతో అధికారంపై ఆ రెండు పార్టీల నేతల్లో ఆశలు చిగురించాయి. దీంతో టీడీపీ, జనసేన పార్టీల టికెట్లకు డిమాండ్ ఏర్పడింది. ఇదే సందర్భంలో ఇరుపార్టీల నేతల ఆశావహుల మధ్య విభేదాలు కూడా అదే స్థాయిలో పెరగడం మొదలయ్యాయి. కరవమంటే కప్పకు, విడవమంటే పాముకు కోపం అనే చందంగా… టీడీపీ, జనసేన నేతల్లో ఒకరికి టికెట్ ఇస్తే మరొకరికి కోపం వచ్చే పరిస్థితి నెలకుంది. ఇందుకు తాజా ఉదాహరణ రాజమండ్రి రూరల్ సీటే.
కందుల దుర్గేష్‌కు టికెట్ ప్రకటించి రాజమండ్రి నుంచి పవన్ వెళ్లిపోయారు. అక్కడ ఏం జరుగుతున్నదో అందరికీ తెలిసిందే. అలాగే రాజోలు, రాజానగరంలలో కూడా జనసేన పోటీ చేస్తుందని పవన్ ప్రకటించడంపై టీడీపీ గుర్రుగా వుంది. ఇదే సందర్భంలో పొత్తు ధర్మాన్ని పాటించకుండా చంద్రబాబు ఇద్దరు అభ్యర్థుల్ని ప్రకటించారని పవన్‌కల్యాణ్ రిపబ్లిక్ డే నాడు నిష్టూరమాడిన సంగతి తెలిసిందే.
టీడీపీ, జనసేన అధినేతలు ఇంకా అభ్యర్థుల్ని ప్రకటించకుండానే ఆ పార్టీల్లో లొల్లి ప్రారంభమైంది. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ సర్ది చెప్పినా వినిపించుకోని వాతావరణాన్ని ఆ రెండు పార్టీల్లో చూడొచ్చు. నూజివీడు టీడీపీ ఇన్‌చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వర్లు పార్టీ ఎందుకు వీడాల్సి వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నూజివీడుకు ఇంకా టీడీపీలో చేరకనే మాజీ మంత్రి కొలుసు పార్థసారథిని ఇన్‌చార్జ్‌గా నియమించారు.
ఇదే వైసీపీ అభ్యర్థుల మార్పుచేర్పులు చిన్నచిన్న అలకలు తప్ప, సీఎం జగన్‌ను తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్న దాఖలాలు లేవు. దీనికి ప్రధాన కారణం వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందన్న సానుకూల వాతావరణం ఉండడమే. టీడీపీ, జనసేన పొత్తులో చాలా మందికి టికెట్లు గల్లంతు అవుతాయనే భయం ఇరు పార్టీల నేతల్లో ఉండగా, ఇప్పుడు బీజేపీ కూడా తోడవుతోంది. దీంతో ఇంకెంత మంది త్యాగాలకు సిద్ధపడాల్సి వస్తుందో అనే ఆందోళన ఆ పార్టీల నేతలను వెంటాడుతోంది.
పోనీ కూటమి అధికారంలోకి వస్తుందనే నమ్మకం ఉంటే, నాయకత్వాల్ని పోగొట్టుకుని త్యాగాలకు సిద్ధమవుతామని అంటున్నారు. అలాంటి పరిస్థితి కనిపించడం లేదని ఆ పార్టీల నేతల భావన. వైసీపీ ఎన్నికల శంఖారావం భీమిలిలో మొదలై… ఇప్పటికి మూడు సభల్ని నిర్వహించారు. వాస్తవం మాట్లాడుకోవాల్సి వస్తే…ఒకదానికి మించి మరొక సభ సూపర్ హిట్ అయ్యాయి.
జగన్ పాలనపై వైసీపీ శ్రేణుల్లో అసంతృప్తి వుందనే విమర్శ… ఈ సభలతో కొట్టుకుపోయింది. జగన్ మళ్లీ అధికారంలోకి వస్తాడనే బలమైన సంకేతాలు తీసుకెళ్లడంలో వైసీపీ సిద్ధం సభలు విజయవంతమయ్యాయి. ఈ దెబ్బతో వైసీపీని వీడిన నేతలు సైతం పునరాలోచనలో పడ్డారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడి కనీసం నెలరోజులు కూడా గడవకనే మళ్లీ పాతగూటికే చేరారు.
వైసీపీలో సిటింగ్‌లకు సీట్లు లేవని చెప్పినా, జగన్‌ను వీడి వెళ్లని పరిస్థితిని చూడొచ్చు. విజయవాడ సెంట్రల్, రాయదుర్గం, పూతలపట్టు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కొంత అసంతృప్తికి గురైనా, మళ్లీ సర్దుకున్నారు. రాయదుర్గం ఎమ్మెల్యే, పూతలపట్టు ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, ఎంఎస్ బాబు వైసీపీ తీరుపై విమర్శలు గుప్పించినా, వెంటనే పొరపాటైందని అధినేతకు మద్దతుగా నిలిచారు.
ఇదే టీడీపీ సిటింగ్ లేదా మాజీ ఎమ్మెల్యేలకు సీట్లు లేవని చెబితే, అప్పుడు తెలుస్తుంది అసంతృప్తి, ఆగ్రహం అంటే ఏంటో. విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరి, టీడీపీకి కొరకరాని కొయ్యగా మారారు. ఇదే వైసీపీని వీడిన నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు మాత్రం నోరు మెదపడం లేదు. నరసారావుపేట బదులు గుంటూరు టికెట్ ఇస్తానంటే, ఇష్టపడక కృష్ణదేవరాయలు టీడీపీని ఎంచుకున్నారు. అంతే తప్ప, సిటింగ్ సీట్లో కొనసాగిస్తానంటే కృష్ణదేవరాయలు పార్టీ మారే వారు కాదు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల ఎంపికలో సామాజిక సమీకరణలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ముఖ్యంగా బీసీలకు ఆయన పెద్దపీట వేయడం టీడీపీ, జనసేన పార్టీలను కలవరపెడుతోంది. పవన్‌తో పొత్తు పెట్టుకుంటే ఆయన సామాజిక వర్గం ఓట్లు టీడీపీకి గంపగుత్తగా పడతాయని చంద్రబాబు ఆలోచన. అయితే పొత్తులో భాగంగా కనీసం 40 సీట్లు జనసేనకు తక్కువ కాకుండా ఇస్తేనే ఓట్ల బదిలీ సాఫీగా జరుగుతుందని కాపు ఉద్యమ నాయకులు పదేపదే హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఎల్లో మీడియా మాత్రం 20 నుంచి 25 సీట్లు మాత్రమే జనసేనకు ఇస్తారని రాస్తున్నాయి.
ఇదే నిజమైతే టీడీపీకి జనసేన నుంచి ఓట్ల బదిలీ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని వారు హెచ్చరిస్తున్నారు. అంటే చంద్రబాబు ఏ ఓట్ల కోసమైతే జనసేనతో పొత్తు పెట్టుకున్నారో, ఆ ఫలితాలు రావని కాపు నాయకులు హెచ్చరించడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు కాపు ఓట్లు పెద్దగా రావనుకుని బీసీల కోసం జగన్ వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నారు. బీసీలకు అత్యధికంగా సీట్లు ఇస్తూ, వారి అభిమానాన్ని చూరగొనడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీలు కాకుండా మొదటి నుంచి వైసీపీకి ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, క్రిస్టియన్ మైనార్టీలు అండగా నిలుస్తున్నారు.
బీజేపీతో పొత్తు పెట్టుకుంటే కొన్ని వర్గాల ఓట్లు పూర్తిగా కూటమికి దూరం అవుతాయి. ఇప్పుడు బీసీలు మరింత బలంగా వైసీపీకి అండగా నిలిచే పరిస్థితి కనిపిస్తోంది. ఈ పరిణామాలన్నీ వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తుందనే ప్రచారానికి ఊతమిస్తున్నాయి. మరోవైపు ఇవే టీడీపీ, జనసేన కూటమికి నెగెటివ్. సీట్లు, నియోజక వర్గాల కేటాయింపు వచ్చే సరికి టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కూటమికి మరింత వ్యతిరేకత ఎదురుకానుంది. అందుకే వైసీపీ విషయంలో ఎల్లో మీడియా తప్ప, నాయకుల వైపు నుంచి వ్యతిరేక గళాలు బలంగా వినిపించడం లేదు.
కూటమిలో సీట్లు, టికెట్ల కీచులాట జరుగుతుంటే, వైసీపీ మాత్రం సానుకూల వాతావరణంలో ప్రచారాన్ని హోరెత్తించనుంది. ఇది వైసీపీ అధికారానికి చేరువ కావడానికి దోహదం చేయనుంది. టీడీపీ, జనసేన, బీజేపీ సీట్లు, టికెట్ల సిగపట్లను చూసి, ఎటూ ఈ కూటమి అధికారంలోకి వచ్చేది లేదు, చచ్చేది లేదనే భావనతో వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.