టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయ నిష్క్రమణ తీవ్ర అవమానకర రీతిలో జరగనుందా? అంటే.. ఔననే సమాధానం వస్తోంది. చంద్రబాబునాయుడు పగ పడితే, తన ప్రత్యర్థులను ఏం చేస్తారనేది పక్కన పెడితే, సొంత పార్టీ వాళ్లను మాత్రం ఏమైనా చేయగలరనే ప్రచారం వుంది. దీనికి టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్‌కు చివరి రోజుల్లో పట్టిన దుస్థితే నిదర్శనం. తాజాగా గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరో నిలువెత్తు ఉదాహరణగా నిలవనున్నారనే చర్చకు తెర లేచింది.
రాజమండ్రి రూరల్ టికెట్ విషయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి టెన్షన్ తప్పడం లేదు. తాజాగా రాజమండ్రి రూరల్ నుంచి టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా కందుల దుర్గేష్ బరిలో వుంటారని పవన్‌కల్యాణ్ తేల్చి చెప్పారు. దీంతో జనసేన శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇదే సందర్భంలో టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నాయి. బుచ్చయ్య చౌదరి వయసు 77 ఏళ్లు. ఈ వయసులో కూడా ఆయన ఎంతో ఉత్సాహంగా కనిపిస్తారు. నిజానికి రాజకీయాల నుంచి రిటైర్ కావాల్సిన వయసు.
అయితే రాజకీయాలపై ఇష్టాన్ని చంపుకోలేక, ఆరోగ్యం సహకరిస్తుండడంతో మరో దఫా పోటీ చేయాలని ఆయన ఉత్సాహం చూపుతున్నారు. రాజకీయాల నుంచి గౌరవంగా నిష్క్రమించేలా చంద్రబాబు తగిన రీతిలో చర్యలు తీసుకోవాల్సిన అవసరం వుంది. కానీ గతంలో తన విషయంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యతిరేకించిన తీరే చంద్రబాబుకు ఇంకా గుర్తుంది. అదే ఆయన్ను వెంటాడుతోంది.
జనసేనతో పొత్తు సాకుతో గోరంట్ల బుచ్చయ్య చౌదరికి శాశ్వతంగా ముగింపు పలకాలని చంద్రబాబు కుట్ర పన్నారనేది ఆయన అభిమానుల ఆరోపణ. చంద్రబాబు ప్రమేయం లేకుండానే రాజమండ్రి రూరల్ అభ్యర్థిని పవన్‌కల్యాణ్ ప్రకటించేంత ధైర్యం ఎలా వస్తుందని గోరంట్ల ఆవేదనగా చెబుతున్నారు. గోరంట్లపై చంద్రబాబు మనసెరిగి , తాజాగా కందుల దుర్గేష్ పోటీ చేస్తారని ప్రకటించి, రాజమండ్రి రూరల్ టీడీపీలో చిచ్చు రేపారు.
నిజంగా టీడీపీ అధిష్టానానికి చిత్తశుద్ధి వుంటే… రాజమండ్రి రూరల్ సీటు విషయమై జనసేన ప్రకటనను ఖండించాలని గోరంట్ల బుచ్చయ్య తన అనుచరులతో అంటున్నారని తెలిసింది. కందుల దుర్గేష్ గౌరవాన్ని పెంచేలా పవన్ ప్రవర్తిస్తుంటే, తన పరువు, ప్రతిష్టలను మంటగలిపేలా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని గోరంట్ల తన సన్నిహితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ నుంచి జనసేన పోటీ చేస్తుందనే ప్రచారం తప్పని తాను ఖండించాల్సి రావడం దురదృష్టకరమని బుచ్చయ్య మాట. సోషల్ మీడియా వేదికగా బుచ్చయ్య చౌదరి చేసిన ప్రకటన ఏంటో తెలుసుకుందాం.
“రాజమండ్రి రూరల్ తెలుగుదేశం కార్యకర్తలు కి అభిమానులకి శ్రేయోభిలాషులకు మనవి. టీవీ వార్తల్లో, వాట్సాప్ మెసేజ్ ల్లో వస్తున్న వార్తలు ఊహాజనితం. అవి నమ్మి భావోద్వేగాలకి గురి కావద్దు. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం కచ్చితంగా “గోరంట్ల” పోటీలో ఉంటారు. దీంట్లో ఎలాంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. దీనికి సంబంధించి తొందరలో నారా చంద్రబాబు నాయుడి అధికారిక ప్రకటన ఉంటుంది” అని గోరంట్ల చెప్పుకోవాల్సి వచ్చింది.
రాజమండ్రి రూరల్ టీడీపీ సిటింగ్ స్థానం. అలాంటి చోట జనసేన అభ్యర్థిని ప్రకటిస్తే, చంద్రబాబునాయుడు, లోకేశ్, అచ్చెన్నాయుడు ప్రేక్షక పాత్ర పోషించడం అంటే… పవన్ ప్రకటనకు ఆమోద ముద్ర వేసినట్టు కాదా? అనే ప్రశ్న ఉత్పన్నమైంది. గతంలో ఎన్టీఆర్‌ను పదవీచ్యుతుడిని చేసే సందర్భంలో చంద్రబాబుపై గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్టీఆర్ తుది శ్వాస వరకూ ఆయన వెంటే గోరంట్ల నడిచారు. ఆ తర్వాత కాలంలో రాజకీయ అవసరాల రీత్యా చంద్రబాబు వెంట గోరంట్ల నడుస్తున్నారు.
ఇప్పుడు తనపై నాడు చేసిన ఘాటు విమర్శలకు ప్రతీకారం తీర్చుకుంటున్నాడనే అనుమానాలకు ఊతం ఇచ్చేలా బుచ్చయ్య టికెట్ విషయంలో బాబు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబునాయుడు ఎంత అమానవీయంగా వుంటారో, గోరంట్ల బుచ్చయ్య రాజకీయ నిష్క్రమణకు పన్నిన కుట్రే నిదర్శనమని ఆయన అభిమానులు ఆవేదనతో చెబుతున్నారు. తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు బుచ్చయ్య తిరగబడతారా? లేక నిస్సహాయంగా అవమానకర రీతిలో నిష్క్రమిస్తారా? అనేది కాలం జవాబు చెప్పాల్సి వుంది.