Advertisement

Advertisement


Home > Politics - Opinion

దిక్కులేని సైకిలు- దిక్కుతోచని జనసైనికులు

దిక్కులేని సైకిలు- దిక్కుతోచని జనసైనికులు

అన్నయ్య చిరంజీవి అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ పెట్టింది ఎందుకంటే మార్పుకోసమన్నాడు. చివరికి తన పార్టీని కాంగ్రెసులోకి మార్చేసాడు. 

తర్వాత తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేనతో కొత్త రాజకీయం చూపిస్తానన్నాడు. ఏ జనసైనికుడూ చూడడానికి ఇష్టపడని కొత్తదనాన్ని చూపిస్తున్నాడిప్పుడు. 

ఆమధ్య రాజు రవితేజ, ఈ మధ్యన పసుపులేటితో పాటూ ఎందరో జనసేనబాధితులు బయటికొచ్చి మనసు విప్పినా, ఇప్పటికీ నోరు తెరిచి మైకుముందు బాధ చెప్పుకోవడానికి మనసొప్పని బాధితులు చాలామందే ఉన్నారు. 

అయినవాళ్లకి ఆకుల్లోనూ, కాని వాళ్లకి కంచాల్లోనూ...అన్నట్టుగా ఎప్పటి నుంచో జనసేన జెండాలు మోస్తూ తమ పవర్ స్టార్ తమకేదో పవర్ అందిస్తాడాని ఆశపడ్డ ఎందరో ఇప్పటికే జెండాలొదిలేసి వెళ్లిపోయారు. కానీ ఇంకా ఎక్కడో ఆశ చావక ఓపిగ్గా ఉన్నవాళ్లకి కూడా ఇప్పుడు పూర్తిగా విషయం బోధపడి కన్నీళ్లొస్తున్నాయి. 

పొత్తు సమీకరణాల్లో భాగం కావొచ్చు, లేదా స్వార్ధం కావొచ్చు...డబ్బున్న ఆసాములకే జనసేన టికెట్లిస్తున్నారు. పార్టీని నమ్ముకుంటూ క్షేత్రస్థాయిలో తమకంటూ ఓటు బ్యాంకుని ఎంతో కొంత ఏర్పాటు చేసుకున్న నాయకులని మాత్రం పక్కన పెట్టేసారు. 

ఉదాహరణకి విశాఖ ప్రాంతంలో చిరకాలంగా పార్టీ కోసం పని చేసిన వారు ఇప్పుడు వారిలో వారే మధనపడుతున్న పరిస్థితి. కొత్తగా వచ్చిన వారికి పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారు. టికెట్ లు ఇచ్చేలా చూస్తున్నారు. ఇన్నాళ్లుగా పార్టీని బతికించుకుంటూ, నిలబెట్టుకుంటూ వచ్చిన వారిని మాత్రం దూరం పెడుతున్నారు.

పైగా తాజాగా విశాఖ వెళ్లి వచ్చిన తరువాత పవన్ తన వ్యక్తిగత సిబ్బందికి ప్రత్యేకమైన ఆదేశాలు ఇచ్చారని గుసగుసలు వినినిపిస్తున్నాయి. ఆ ఆదేశాలేంటంటే.. జనసేనలో పాతవారు ఎవరైనా తన అపాయింట్ మెంట్ అడిగితే ఇవ్వనవసరం లేదని, తనను కలిపించే ప్రయత్నం చేయవద్దని పవన్ ఆదేశాలు ఇచ్చినట్లు పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

మొన్నటి వరకు విశాఖలో వినిపించిన శివశంకర్, పంచకర్ల లాంటి వారి పేర్లు ఇప్పుడు పెద్దగా వినిపించడం లేదు. కొత్త గా వచ్చిన విజయ్ కుమార్, కొణతాల రామకృష్ణ, సోదరుడు నాగబాబు పేర్లే ఎక్కువ వినిపిస్తున్నాయి. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా తమ పార్టీ వుంటుందని, కొత్తదనం చూపబడుతుందని పదే పదే చెబుతూ వచ్చిన పవన్ ఇప్పుడు ఇలా మారిపోవడంతో సీనియర్లు ఏమీ పైకి మాట్లాడలేక, వారిలో వారు తమ భావాలు పంచుకుంటూ, నిట్టూరుస్తున్నారు.

ముద్రగడ పద్మానాభం లాంటి సీనియర్ కాపు నాయకుడిని తీసుకోవద్దని చంద్రబాబు ఆర్డరేస్తే తాను జనసేనలోకి తీసుకోలేదు పవన్ కళ్యాణ్.

కాపుల ఓట్ల కోసమే చంద్రబాబు జనసేనతో పొత్తు అనుకుంటే పవన్ కళ్యాణ్ కాపు నాయకుల్ని తన పార్టీలోకి చేర్చుకోవడం ఎంత అవసరమో చెప్పాలి కదా! అలా చెప్పే తెలివి లేదా? ధైర్యం లేదా?

తండ్రి వద్దంటే దత్తపుత్రుడు కూడా వద్దంటూ పితృవాక్యపరిపాలన చేస్తున్నాడనుకోవాలా?

ఇదెక్కడి కాపు నాయకత్వం పవన్ కళ్యాణ్! 

ఈ విషయం చెబుతూ ఒక జనసైనికుడు అన్న మాటని ఇక్కడ చెప్పుకోవాలి... "పవన్ కళ్యాణ్ అదృష్టం చిరంజీవి తమ్ముడవ్వడం కాదు... చంద్రబాబుకి దత్తపుత్రుడవ్వడం. ఆ "లెక్కే" వేరు. అందుకే బాబుగారంటే ఆయనకంత విశ్వాసం. కాపుల్ని తెదేపా కాళ్లదగ్గర పాడేసేటంత విశ్వాసం". 

పవన్ ముందునుంచీ చెప్పేదొకటి చేసేదొకటి...

కాపుల నాయకుడినంటాడు..వాళ్లకే అన్యాయం చేస్తాడు.

సినిమా హీరోనంటాడు..నిర్మాతల్ని ముంచుతాడు.

తాను ఎక్కడ నిలబడతాడో చెప్పడు..

ఎవరికి ఏ టికెట్ ఇస్తున్నాడో నోరు విప్పడు..

చిన్నన్నయ్య అభ్యర్థిత్వానికి ఒక న్యాయం, మిగిలిన వారికి ఇంకొక న్యాయం.

ఎవరికీ ఏ క్లారిటీ ఇవ్వడు.

క్లారిటీ కోసం అడుగుదామంటే అపాయింట్మెంట్ ఇవ్వడు.

ఎవరన్నా ఎదురుతిరిగి గట్టిగా అడిగితే పొమ్మంటాడు.

ఒక గ్రామాన్ని దత్తత తీసుకున్నట్టు పవన్ ని దత్తత తీసుకుని చంద్రబాబు పోషిస్తుంటే ఎవరంటే లెక్కుంటుంది? ఎందుకుంటుంది?

ఇంతకీ పవన్ దేంట్లో గొప్పో చంద్రబాబు తప్ప ఎవ్వరూ చెప్పలేని పరిస్థితి.

ఏం సాధించాడని.. ఏం సాధిస్తాడని..?

ఎందుకో చంద్రబాబుకి పవన్ అంటే అంత నమ్మకం?

పవన్ కి కొందరు సినిమావాళ్లు ముద్దుగా పెట్టుకున్న పేరు "బిల్డప్ బాబాయ్".

ఎక్కే విమానం, దిగే విమానం.. ఎయిర్పోర్టులో దేశ ప్రధాని కూడా నడవనంత దర్పంగా నడుచుకుంటూ వెళ్లడం..

ఎస్పీజీ రేంజులో చుట్టూ ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ ని పెట్టుకుని షో చేయడం...

తనని లేపేయడానికి రెక్కీ నిర్వహిస్తున్నారంటూ తనని తాను చాలా ఎక్కువగా ఊహించుకోవడం...

ఇలా ఒకటి కాదు.. చెప్పుకోవడానికి అతను చేసిన మంచి పని, ముందుపెట్టిన మంచి ఆలోచన, పలికిన మంచి మాట ఒక్కటి లేదు. 

అయినప్పటికీ ఎప్పుడో నక్కతోక తొక్కినట్టు చంద్రబాబు ఆదరణని పొందాడు. ఖరీదైన కాలక్షేపం చేస్తున్నాడు. 

ఒక పక్క జనసైనికులు దిక్కుతోచని స్థితిలో ఉంటే, తెదేపా అధినాయకుడు దిక్కులేని స్థితిలో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ జనసైనికుల బీపీ పెంచుతుంటే, కేంద్ర భాజాపా పొత్తులెక్క తేల్చకుండా చంద్రబాబుకి బీపీ తెప్పిస్తోంది. చంద్రబాబుకేసి చూస్తూ తెదేపా నాయకులు కూడా దిక్కులేని స్థితిలో ఉన్నారు. 

ఈ ఎన్నికల ఫలితాలతోనైనా చంద్రబాబు "పొత్తులు-కొరకరాని కొయ్యలు" అనే నిజం తెలుసుకుంటాడని ఆశించాలి. 

ఒక పక్క "సిద్ధం" మీటింగుల్లో జగన్ ప్రభంజనం చూస్తుంటే ఈ ఎన్నికల్లో వీయబోయేది ఫ్యాను గాలా లేక తుఫాను గాలా అనేది తెలీయడం లేదు. 

ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తుంటే ఒకటనిపిస్తోంది..'కుక్కతోక పట్టుకుని గోదావరి ఈదొచ్చేమో కానీ, గాజు గ్లాసులో కూర్చుని సైకిల్ తొక్కుతూ ఫ్యాను కంటే వేగంగా తిరగడం మాత్రం కష్టమే'. 

- హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?