అసలు పాపాత్ముడు బాబు కాదు… కేసీఆరేనట !

రాజకీయ నాయకులు ఒకరిని ఒకరు ఇరికించుకోవడానికి ప్లాన్లు వేస్తూనే ఉంటారు. యాక్షన్ కు రియాక్షన్ వెంటనే చేస్తుంటారు. తాము చెప్పెందే కరెక్టు అని, తాము చేసిందే సరైందని నమ్మించడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. మాటలవరకే…

రాజకీయ నాయకులు ఒకరిని ఒకరు ఇరికించుకోవడానికి ప్లాన్లు వేస్తూనే ఉంటారు. యాక్షన్ కు రియాక్షన్ వెంటనే చేస్తుంటారు. తాము చెప్పెందే కరెక్టు అని, తాము చేసిందే సరైందని నమ్మించడానికి తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. మాటలవరకే సరిపెట్టకుండా చేతల్లోనూ చూపిస్తుంటారు. 

తెలంగాణలో “ఉచిత కరెంటు” ఎపిసోడ్ ఇలాంటిదే. ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఇలా రచ్చ చేయడం రాజకీయ పార్టీలకు చాలా అవసరం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అమెరికాలో మాట్లాడుతూ రైతులకు ఉచిత కరెంటు 24 గంటలూ ఇవ్వక్కరలేదని, మూడు గంటలు ఇస్తే చాలని అన్నాడని బీఆర్ ఎస్ దుమారం లేవదీసింది. రెండు రోజులపాటు రాష్ట్రం రేవంత్ రెడ్డి వ్యతిరేక ఆందోళనలతో అట్టుడికిపోయింది. ఆయన దిష్టిబొమ్మలను దహనం చేశారు. దుమ్మెత్తిపోశారు. 

సేమ్ …కాంగ్రెస్ వాళ్ళూ కేసీఆర్ కు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇలాంటి పనులే చేశారు. నిజానికి రేవంత్‌రెడ్డి రైతులకు ఉచిత కరెంటు అక్కర్లేదు అనలేదు. తను చెప్పాలనుకున్నది కరెంటు కంపెనీల దగ్గర అడ్డగోలు కమీషన్లు గుంజడానికి కేసీయార్ ఈ 24 గంటల కరెంటు అని ప్రచారం చేసుకుంటున్నాడు అని చెప్పడం తన ఉద్దేశం. కానీ చెప్పిన తీరు బాగాలేదు. చెప్పాల్సింది స్ట్రెయిట్‌గా చెప్పకుండా, అలవాటైన రీతిలో ఏదేదో చెప్పబోయి, ఇంకేదో చెప్పి బీఆర్ఎస్ పార్టీకి మంచి చాన్స్ ఇచ్చాడు. 

తెలంగాణలో 95 శాతం చిన్న రైతులే, మూడెకరాల లోపు… అంటే ఎకరానికి గంట చొప్పున మూడు గంటలు చాలు అన్నాడు… వీళ్లకు దొరికిపోయాడు… సందు దొరికితే బీఆర్ఎస్ ఊరుకుంటదా..? ధర్నాలు, దిష్టిబొమ్మల దహనాలు, నిరసనలతో ఊదరగొట్టేసి, అదుగో వ్యవసాయానికి ఉచిత కరెంటు తీసేస్తరట కాంగ్రెసోళ్లు అని పెద్ద ఎత్తున దాడికి దిగింది… పొలిటికల్‌గా ఈ అవకాశాన్ని ఏ పార్టీ వదులుకోదు. కేసీఆర్ పార్టీ ఆ పనే చేసింది.

రేవంత్ రెడ్డి అమెరికా నుంచి వచ్చాక దీనికి కౌంటర్ ఇవ్వాలి కదా. ఆ పనే చేశాడు. కేసీఆర్ ను ఇరికించే ప్రయత్నం చేశాడు. అందుకు 2000 సంవత్సరంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన బషీర్ బాగ్ కాల్పుల సంఘటన తీసుకున్నారు. బీఆర్ఎస్‌ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్టు.. ఇన్ని రోజులు పుట్టలో పడుకున్న పాములన్ని బయటకి వచ్చి నానా రచ్చ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

అమెరికాలో నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో కొందరు నిపుణులు తెలంగాణలో అమలవుతోన్న సర్కార్ పాలసీలపై అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానం చెప్పానని రేవంత్ క్లారిటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ విధివిధానాలు తాను క్లియర్‌గా వివరించానన్నారు. తాను చెప్పిన సమాధానంలో కొంత భాగాన్ని మాత్రమే కట్ చేసి వైరల్ చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే.. తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకునే క్రమంలో.. టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు. ఆ రోజుల్లో విద్యుత్ గురించి ఆయన చేసిన విమర్శలు, రైతులపై చేసిన కాల్పుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రేవంత్. దీంతో.. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాశంగా మారింది.

అయితే.. ఉచిత విద్యుత్‌పై మరోసారి చర్చ జరగడం మంచిదే అన్నారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ అంశాన్ని కాంగ్రెస్ పార్టీనే ప్రకటించిందని గుర్తు చేసిన రేవంత్ రెడ్డి.. ఉచిత కరెంట్ ఇవ్వడం కుదరదని టీడీపీతో చెప్పించింది కేసీఆరే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉచిత కరెంట్ ఇస్తామంటే.. టీడీపీ నేత చంద్రబాబు విద్యుత్ వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలంటూ ఎద్దేవా చేసిన విషయం గుర్తు చేశారు. 

అది కుదరదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ప్రజలు విశ్వసించలేదని తెలిపారు. మరోవైపు.. నాడు విద్యుత్ ఉద్యమం చేస్తున్న రైతులపై అప్పటి టీడీపీ ప్రభుత్వం కాల్చి చంపగా.. ఆ పాపం ముమ్మాటికీ కేసీఆర్‌దే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో మంత్రి కేటీఆర్ తన అతి తెలివి ప్రదర్శించి.. చిల్లర వ్యవహారం చేశారని రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ఇంత మాట్లాడుతుంటే కేసీఆర్ పత్రిక “నమస్తే తెలంగాణ” ఊరుకుంటుందా ? ఊరుకోదు కదా. అదేం రాసిందంటే …”నాడు టీడీపీలో ఉంటూ విద్యుత్‌ చార్జీలను పెంపును కేసీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిపై నాటి సీఎం చంద్రబాబును నిలదీశారు. 

డిప్యూటీ స్పీకర్‌ పదవిలో ఉన్నా విద్యుత్‌ చార్జీల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాబుకు లేఖ రాశారు. చార్జీల పెంపు ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ నిర్ణయం తెలంగాణ రైతుల గొంతులకు ఉరితాడు బిగించడమే అవుతుందని తేల్చి చెప్పారు. ఒకవేళ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోని పక్షంలో తాను ఉద్యమించాల్సి వస్తుందని కూడా హెచ్చరించారు. 

టీడీపీలో ఉంటూ విద్యుత్తు చార్జీల పెంపుపై అప్పటికే పవర్‌ఫుల్‌ సీఎం, జాతీయ నేతగా వెలుగొందుతున్న చంద్రబాబును వ్యతిరేకించిన కేసీఆర్‌పైనే రేవంత్‌రెడ్డి విషం చిమ్మే ప్రయత్నం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘రేవంత్‌రెడ్డి ఇదే నా నీ సంస్కారం?’ అంటూ తెలంగాణ ప్రజలు టీపీసీసీ చీఫ్‌పై మండిపడుతున్నారు. కాగా, ప్రెస్‌మీట్‌ సందర్భంగా రేవంత్‌రెడ్డి ప్రవర్తన, ఆయ న హావభావాలపై విలేకరులు, పార్టీ నేతల్లో ఆసక్తికర చర్చ జరిగింది. 

సబ్జెక్ట్‌ లేకపోవడంతో ఫ్రస్టేషన్‌లో రేవంత్‌రెడ్డి బూతుపురాణం అందుకొన్నారనే విమర్శలు వినిపించాయి.” అని రాసింది. వాస్తవానికి 24 గంటల ఉచిత కరెంటు ఇవ్వడంలేదు. ఎక్కువలో ఎక్కువ పది గంటలు ఇస్తున్నారు. అందులోనూ రెండు మూడు గంటలు కోతలు పెడుతున్నారు. ప్రచారం ఎక్కువ …పస తక్కువ.