ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. జంపింగ్‌లకు అన్ని పార్టీల నాయకులు తెరలేపారు. టికెట్ దక్కదని అనుమానిస్తున్న నాయకులు తమదారి తాము చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీలోకి టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కుటుంబం వెళ్తోందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. కొంత కాలంగా రాయపాటి ఫ్యామిలీ టీడీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో వుంది.
దీనికి తోడు తమకు గిట్టని కన్నా లక్ష్మీనారాయణకు టీడీపీ అధిక ప్రాధాన్యం ఇస్తుండడాన్ని రాయపాటి ఫ్యామిలీ జీర్ణించుకోలేకపోతోంది. రాయపాటి సాంబశివరావు కుమారుడు రంగబాబు చాలా కాలంగా సత్తెనపల్లి టికెట్‌ను అడుగుతున్నారు. అయితే రాయపాటి కుటుంబానికి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు ససేమిరా అంటున్నారు. చాలా కాలంగా పార్టీకి అండగా ఉంటున్న తమను కాదని, రాజకీయంగా, వ్యక్తిగతంగా బద్ధ శత్రువైన కన్నా లక్ష్మీనారాయణ కొత్తగా పార్టీలోకి చేర్చుకోవడం, ఆ వెంటనే సత్తెనపల్లి టికెట్ ఇవ్వడాన్ని రాయపాటి ఫ్యామిలీ సహించలేకపోతోంది.
దీంతో రాజకీయంగా తమ దారి తాము చూసుకోవాలనే నిర్ణయానికి ఆ కుటుంబం వచ్చింది. రాయపాటికి రాజకీయంగా ప్రియశిష్యుడైన డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు కావడంతో, ఆయన ద్వారా ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. వైసీపీ అవకాశం ఇస్తే సత్తెనపల్లి నుంచి కన్నాపై పోటీ చేసేందుకు రాయపాటి రంగబాబు రెడీగా ఉన్నారు.
మరోవైపు అమరావతి ఉద్యమనాయకురాలు, రాయపాటి సోదరుడి కుమార్తె డాక్టర్ శైలజ కూడా టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. ఆమెకు కూడా టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో మౌనాన్ని ఆశ్రయించారు. ఎన్నికల వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.