అధికార వైసీపీ నుంచి జనసేనలో చేరాలని ఓ నాయకుడు నిర్ణయించుకున్నారు. అది కూడా విశాఖపట్నం జిల్లా వైసీపీ అధ్యక్షుడు కావడం గమనార్హం. పంచకర్ల రమేశ్‌బాబు విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయడమే ఆలస్యం. జనసేనలో చేరుతానని ఆయన ప్రకటించడం విశేషం. అంటే జనసేనతో ముందుగానే ఆయన టచ్‌లో ఉన్నారన్న మాట.
విశాఖలో మారుతున్న రాజకీయ సమీకరణలకు ఇదే నిదర్శనం. పరిపాలన రాజధాని ప్రకటించామని, ఇక ఉత్తరాంధ్ర అంతా తమ వైపు వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్న వైసీపీకి… క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆశాజనకంగా కనిపించడం లేదు. ముఖ్యంగా విశాఖలో వైసీపీ బలహీనంగా వుందని సమాచారం. ఈ నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేశ్‌బాబు పార్టీ మారాలని నిర్ణయించుకోవడంతో పాటు జనసేనలో చేరాలని ప్రకటించడం చర్చకు తెరలేచింది.
విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయాలని అనుకుంటున్నారు. అయితే అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే అదీప్‌రాజ్ మరోసారి పోటీ చేయాలని అనుకుంటున్నారు. దీంతో అదీప్‌రాజ్, పంచకర్ల మధ్య కొంత కాలంగా వార్ నడుస్తోంది. వైసీపీలో తనకు టికెట్ రాదనే నిర్ణయానికి వచ్చిన పంచకర్ల ప్రత్యామ్నాయ మార్గాల్ని వెతికారు. జనసేన పార్టీనే సరైన వేదికగా ఆయన భావించారు.
ఈ మేరకు జనసేన నేతలతో ఆయన చర్చించి, పార్టీలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. పెందుర్తి టికెట్ ఇచ్చేందుకు పవన్ ఓకే చెప్పడంతోనే పంచకర్ల ఈ నెల 17న ఆయన నేతృత్వంలో జనసేనలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు.
ఇదిలా వుండగా పంచకర్ల రాజీనామాపై ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పంచకర్ల రాజీనామా తొందరపాటు చర్యగా అభివర్ణించారు. వైసీపీ స్థాపించినప్పటి నుంచి ఉన్న నాయకులను కాదనుకుని పంచకర్లకు జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చామన్నారు. రమేశ్‌బాబు మంచి నాయకుడని, ఆలోచన లేకుండా రాజీనామా చేయడం సరైంది కాదన్నారు.