ఏపీతో బీజేపీకి రాజకీయంగా వచ్చేదీ పోయేది ఏమీ లేదు! కమలం పార్టీకి ఉత్తరాదిపై ధీమా ఉంది. ఆధిపత్యం నిలుపుకోవాల్సిన రాష్ట్రాలూ కొన్ని ఉన్నాయి. అందులో ముఖ్యమైనది మహారాష్ట్ర. ముంబైపై పట్టు పోగొట్టుకోకూడదని కమలం పార్టీ రాజకీయంగా ఎంతకైనా తెగిస్తోంది. శివసేనను చీల్చింది, ఎన్సీపీ చీల్చింది, కాంగ్రెస్ నుంచి నేతలను తీసుకుంటోంది!
ఎంతజేసైనా మహారాష్ట్రలో మెజారిటీ ఎంపీ సీట్లు నెగ్గాలి, ఆ తర్వాత వెంటనే జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో నెగ్గాలనేది కమలం పార్టీకి ప్రతిష్ట! అలాంటి రాష్ట్రాల విషయంలో జరిగినంత కసరత్తు దక్షిణాది రాష్ట్రాల్లో ఏ దాని విషయంలో కూడా జరుగుతున్నట్టుగా కనపడదు!
ఆఖరికి కర్ణాటక విషయంలో కూడా బీజేపీ అడావుడిగా తేల్చుకోవాలనే ప్రయాస ఏమీ పడటం లేదు. జేడీఎస్ తో పొత్తు విషయంలో బీజేపీ దూకుడుగా ముందుకు వెళ్లడం లేదు. వెళ్లి దేవేగౌడతో మోడీ సమావేశం అయ్యారొకరసారి. అప్పటి నుంచి పొత్తు ఊహాగానాలు రేగాయి. పొత్తుకు జేడీఎస్ సూపర్ సిద్ధంగానే ఉన్నా.. బీజేపీ ఆచితూచుతోంది! కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తు విషయంలో బీజేపీ ఆత్రపడటం లేదు! అలాంటిది ఏపీలో పొత్తుల విషయంలో బీజేపీ నిమ్మకు నీరెత్తడంలో ఆశ్చర్యం లేదు!
కర్ణాటకలో కమలం పార్టీకి స్థిరమైన శక్తి ఉంది. జేడీఎస్ తో పొత్తు ద్వారా బీజేపీకి కూడా లాభం కలుగుతుంది కూడా! పరస్పరం లాభాలున్న చోటే బీజేపీ జేడీఎస్ కు ఎందుకు అదనపు బలం అందించాలనే లెక్కలేస్తున్నట్టుగా ఉంది. సీట్ల బేరం ఏమీ తేల్చలేదు! అలాంటిది చంద్రబాబును లేపడానికి బీజేపీ మద్దతిచ్చేసే అవకాశాలు ఏమీ లేవు. ఏపీలో తమకు వచ్చేది, పోయేదేమీ లేదు కాబట్టి.. బీజేపీ నింపాదిగా ఉంది.
చంద్రబాబును ఢిల్లీ పిలిపించుకుంది, ఆ వెంటనే పవన్ ను ఢిల్లీకి పిలిచారనే వార్తలు వచ్చాయి, అదేమీ జరగలేదు, ఇప్పుడు పవన్ ను మళ్లీ పిలిచారట! ఇంతలోనే అపాయింట్ మెంట్లేవీ ఖరారు కాలేదనే వార్తలూ వస్తున్నాయి! మరి పవన్ కు ఎప్పటికి బీజేపీ నేతల దర్శనం దొరుకుతుందో, ఆ తర్వాత మళ్లీ చంద్రబాబును ఎప్పుడు పిలుస్తారో, మళ్లీ పవన్ ను ఎప్పుడు రమ్మంటారో .. ఇదంతా ఇప్పుడప్పుడే తేలే కథలా కనిపించడం లేదు!
ఈ ఎపిసోడ్లు మరో నెలనెలన్నర పాటు కొనసాగినా పెద్ద ఆశ్చర్యం లేదు! నామినేషన్ల నాటికైతే ఎవరు ఏ సీట్లో, ఎవరికెన్ని సీట్లో, అసలు పొత్తు ఉంటుందో ఉండదో క్లారిటీ వస్తుంది! అంత వరకూ బీజేపీకి చెలగాటం, చంద్రబాబుకు రాజకీయ సంకటం!