గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీలో చేరారు. ఇవాళ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో జగన్ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకున్నారు. మంగళగిరి టికెట్ విషయంలో అలిగిన ఆయన ఇటీవలే వైసీపీని వీడి షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. నెలల వ్యవధిలోనే తిరిగి పార్టీలో చేరడం విశేషం.
వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి తనకు పార్టీ టికెట్ ఇవ్వడం లేదని స్పీకర్‌కు తన రాజీనామాను ఇచ్చి పార్టీని విడుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. పార్టీ నుండి వెళ్లిపోయే టైంలో అభివృధి పనులకు బిల్లులు రావడం లేదని.. తనకు జగన్ మంత్రి ఇస్తానని చెప్పి మాట తప్పారని వాపోయిన విషయం తెలిసిందే.
మరో వైపు కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే షర్మిల వైఖరిలో తేడా గుర్తించారు. తన సొంత అన్నను జగన్‌రెడ్డి అనడం, చంద్రబాబును మాత్రం గారు అంటూ ప్రత్యేకంగా గౌరవించడం వెనుక కుట్రల్ని తమ నాయకుడు పసిగట్టారని ఆళ్ల అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడానికి బదులు, కేవలం టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీకి షర్మిల వచ్చారని ఆర్కే గ్రహించి, ఆ పార్టీని వీడేందుకు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
కాగా నారా లోకేశ్ ఓటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కలుపుకెళ్లేందుకు సిద్దం అయినట్లు తెలుస్తోంది. మంగళగిరిలో వైసీపీ గెలుపు బాధ్యతలు ఆర్కేకు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి టికెట్ ఇవ్వలేకపోయినందుకు వచ్చే సారి రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు.