టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఓటమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పకడ్బందీ వ్యూహాన్ని రచిస్తున్నారు. గత ఎన్నికల్లో మంత్రి హోదాలో మంగళగిరి నుంచి పోటీ చేసిన లోకేశ్‌ను వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి మట్టి కరిపించారు. అయితే పోయిన చోటే వెతుక్కోవాలనే ఉద్దేశంతో మరోసారి మంగళగిరిలోనే పోటీ చేసి, గెలుపొందాలని లోకేశ్ పట్టుదలతో ఉన్నారు. మంగళగిరిలో గెలిచి, టీడీపీకి గిఫ్ట్ ఇస్తానని లోకేశ్ పలు సందర్భాల్లో ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సీఎం జగన్ మంగళగిరిపై ప్రత్యేక దృష్టి సారించారు. మంగళగిరిలో ప్రతి ఓటూ కీలకమే అని ఆయన భావిస్తున్నారు. అందర్నీ కలుపుకెళ్లేందుకు పార్టీ నేతలను ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీని వీడిన ఆళ్ల రామకృష్ణారెడ్డిని తిరిగి పార్టీలో చేర్చుకోవడంలో జగన్ సక్సెస్ అయ్యారు. ఇది మొదటి అడుగు.
ఆళ్ల పార్టీని వీడిన సందర్భంలో మంగళగిరి సమన్వయకర్తగా గంజి చిరంజీవిని నియమించారు. అయితే చిరంజీవిపై సొంత సామాజిక వర్గం చేనేతల్లో తగిన సానుకూలత లేదని ఆయనకు నివేదికలు అందాయి. దీంతో అభ్యర్థి మార్పుపై జగన్ పునరాలోచన చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలను బరిలో దింపాలని సీఎం భావిస్తున్నారు.
ఇటీవల చేనేత సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ ఎం.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమలతో జగన్ ప్రత్యేకంగా సమావేశమై, మంగళగిరిలో అసలేం జరుగుతున్నదో చర్చించారు. గంజి చిరంజీవి కంటే కమల అభ్యర్థి అయితే చేనేతల ఓట్లు వైసీపీకి బాగా పోల్ అయ్యే అవకాశం వుందనే నిర్ణయానికి సీఎం వచ్చారు. తాజాగా ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరడంతో అసంతృప్తి అనే మాటకు చోటు లేకుండా చేసుకున్నట్టు అవుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
2009లో కాంగ్రెస్ తరపున గెలుపొందిన కాండ్రు కమలకు వైసీపీ టికెట్ ఇస్తే, 2024లో లోకేశ్‌పై సంచలన విజయం సాధించి రికార్డుకెక్కుతుందని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. లోకేశ్‌ను ఓడిస్తే…ఇక శాశ్వతంగా చంద్రబాబు వారసుడి రాజకీయానికి ముగింపు పలకొచ్చనేది జగన్ వ్యూహం. అందుకే మంగళగిరి గెలుపుపై జగన్ పట్టుదలతో ఉన్నారు.