ఎన్నికలన్న తర్వాత రకరకాల సమీకరణలుంటాయి. నాయకత్వ మార్పులుంటాయి. అయితే పార్టీతో పాటు అధ్యక్షుడిపై విధేయత చూపుతూ, తమ నాయకత్వాన్ని బలిపెట్టడానికి చాలా తక్కువ మంది మాత్రమే సిద్ధంగా వుంటారు. ఇంతకాలం వైసీపీపై ప్రజాప్రతినిధుల తిరుగుబాటు గురించి మాత్రమే చూశాం. ఇప్పుడు టీడీపీ వంతు వచ్చింది. టీడీపీ, జనసేన అభ్యర్థుల ప్రకటన సమయం ఆసన్నమైంది. బీజేపీతో కూడా పొత్తు కుదురితే, అభ్యర్థుల ప్రకటన మరింత జఠిలం కానుంది.
ఈ నేపథ్యంలో టీడీపీ అభ్యర్థుల ప్రకటన చేయకుండానే, తిరుగుబాట్లు మొదలయ్యాయి. నూజివీడు టికెట్‌ను ఆ పార్టీ ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకు కాదని, వైసీపీ నుంచి వెళ్లిన కొలుసు పార్థసారథికి ఖరారు చేయడం టీడీపీలో చిచ్చు రేపింది. తన అనుచరులతో నిర్వహించిన సమావేశంలో వెంకటేశ్వరరావు కన్నీటిపర్యంతమయ్యారు. పార్టీని వీడేందుకు ఆయన నిర్ణయించుకున్నారు.
అలాగే మైలవరంలో వసంత కృష్ణప్రసాద్ రాకను మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒకవైపు వసంతను చేర్చుకుని టికెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తుంటే, తానే అభ్యర్థినంటూ దేవినేని ప్రచారానికి కూడా సిద్ధమవుతున్నారు. టీడీపీలోకి వస్తున్నారని తెలిసి కూడా వసంతపై దేవినేని తీవ్ర ఆరోపణలు చేస్తుండడం చర్చనీయాంశమైంది.
వైఎస్సార్ జిల్లా రాయచోటిలో ఇదే పరిస్థితి. మాజీ ఎమ్మెల్యే రమేష్‌రెడ్డిని పిలిపించుకుని టికెట్ ఇవ్వడం లేదని అచ్చెన్నాయుడు చెప్పినట్టు తెలిసింది. రాయచోటి టికెట్‌ను మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డికి ఇస్తున్నట్టు అచ్చెన్నాయుడు చెప్పడంతో టీడీపీ ఇన్చార్జ్ రమేష్‌రెడ్డి మనస్తాపం చెందారు. దీంతో తన కార్యాలయంలో తెలుగుదేశం జెండాను, చంద్రబాబు ఫొటోను పక్కన పడేశారు. తన ఆత్మీయులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకోడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారు.
రమేష్‌రెడ్డి సొంత తమ్ముడు ఆర్.శ్రీనివాస్‌రెడ్డికి కడప ఎంపీ, ఆయన భార్య మాధవీరెడ్డికి అదే అసెంబ్లీ నియోజకవర్గం సీట్లను ఖరారు చేశారు. దీంతో ఒకే కుటుంబంలో ముగ్గురికి టికెట్లు ఇవ్వడం కుదరదని టీడీపీ అధిష్టానం తేల్చి చెప్పడంతో, రమేష్‌రెడ్డి అలకబూనారు. తమ్ముడిపై కూడా ఆయన ఆగ్రహంగా ఉన్నారు.
పరిటాల, జేసీ కుటుంబాలు సైతం చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నట్టు తెలిసింది. ధర్మవరం టికెట్‌ను తనకే ఇవ్వాలని టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరాములు పట్టుపడుతున్నారు. ఇవ్వడానికి చంద్రబాబు సిద్ధంగా లేరు. రాప్తాడుకే పరిమితం కావాలని తేల్చి చెప్పడంతో పరిటాల కుటుంబం మండిపడుతోంది. అనంతరం లోక్‌సభ స్థానాన్ని జేసీ పవన్‌కు ఇవ్వాలని ఆ కుటుంబం కోరుతోంది. ఇందుకు చంద్రబాబు అంగీకరించలేదు. దీంతో జేసీ కుటుంబం కూడా ఆగ్రహంగా వుంది.
ఇంకా అధికారికంగా టీడీపీ టికెట్లు ప్రకటించకనే ఆ పార్టీలో ప్రకంపనలు చెలరేగుతున్నాయి. పొత్తులో భాగంగా టికెట్లు దక్కకపోతే టీడీపీ నాయకులు ఎలా రియాక్ట్ అవుతారో… తాజా ఉదంతాలు నిదర్శనం. చంద్రబాబును ఎవరూ ఖాతరు చేసే పరిస్థితి లేదు.