ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) షాక్ ఇచ్చారు. కాంగ్రెస్ ముసుగులో చంద్రబాబునాయుడు రాజకీయ ప్రయోజనాల కోసం షర్మిల పని చేస్తున్నారని గుర్తించి, చాలా తక్కువ సమయంలోనే ఆళ్ల తిరిగి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెంతకు చేరడానికి సిద్ధమయ్యారు. ఇవాళ ఉదయం 11.30 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఆర్కే భేటీ కానున్నారు.
షర్మిల కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న సందర్భంలో ఆళ్ల ఆ పార్టీలో చేరారు. వైఎస్సార్ కుటుంబానికి వీర విధేయుడైన ఆళ్ల రామకృష్ణారెడ్డి… పార్టీలో చేరిన వెంటనే షర్మిల వైఖరిలో తేడా గుర్తించారు. తన సొంత అన్నను జగన్రెడ్డి అనడం, చంద్రబాబును మాత్రం గారు అంటూ ప్రత్యేకంగా గౌరవించడం వెనుక కుట్రల్ని తమ నాయకుడు పసిగట్టారని ఆళ్ల అనుచరులు చెబుతున్నారు.
దీంతో జగన్ను కాదని షర్మిల వెంట నడవాలనే తన నిర్ణయంపై ఆళ్ల రామకృష్ణారెడ్డి పశ్చాత్తాపం చెందారు. ఆళ్లతో ఆయన అన్న, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు పలు దఫాలు చర్చించారు. షర్మిల రాజకీయ దురుద్దేశాన్ని వైసీపీ నాయకులు ఆళ్లకు వివరించారు. వైసీపీ నేతలు చెప్పినట్టే, కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి బదులు, కేవలం టీడీపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ఏపీకి షర్మిల వచ్చారని ఆర్కే గ్రహించి, ఆ పార్టీని వీడేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు.
సీఎం జగన్తో భేటీ అయి, తన నిర్ణయంపై పునరాలోచన చేసుకున్న సంగతిని వెల్లడించనున్నారు. ఇకపై వైసీపీలో కొనసాగుతానని సీఎంకు చెప్పడానికి సాయంత్రం జగన్ను కలవనున్నారు. ఒక నెలలోపే కీలక నాయకుడు కాంగ్రెస్ను వీడడం షర్మిలకు గట్టి ఎదురు దెబ్బే అని చెప్పక తప్పదు.