యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులపై ప్రకటించారు. అయితే వాళ్లందరికీ టికెట్లు దక్కడం అనుమానమే అని టీడీపీ ముఖ్య నేతలు అంటున్నారు. వ్యక్తిగతంగా తనకు సన్నిహితులైన యువ నేతలకు లోకేశ్ టికెట్లు ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో వాళ్లకు అంత సీన్ లేదని టీడీపీ నిర్వహించిన సర్వే నివేదికలు వెల్లడించాయి.
ఈ నేపథ్యంలో లోకేశ్ ప్రకటించినప్పటికీ, అలాంటి అభ్యర్థులను పక్కన పెట్టాలని చంద్రబాబునాయుడు నిర్ణయించారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఉదాహరణకు వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు విషయానికి వస్తే… టీడీపీ ఇన్చార్జ్ జీవీ ప్రవీణ్‌రెడ్డి అభ్యర్థిత్వంపై పరోక్షంగా లోకేశ్ సంకేతాలు ఇచ్చారు. అలాగే ఒక కేసు విషయంలో కడప సెంట్రల్ జైల్లో ఉన్న ప్రవీణ్‌ను పరామర్శించడానికి వెళ్లిన సందర్భంలోనూ తమ పార్టీ ప్రొద్దుటూరు అభ్యర్థి ప్రవీణ్‌రెడ్డి అని లోకేశ్ మీడియా సమక్షంలో ప్రకటించారు.
దీంతో తనకే టికెట్ అని నమ్మిన ప్రవీణ్… నియోజకవర్గంలో మిగిలిన నాయకులను పట్టించుకోవడం మానేశారు. ప్రొద్దుటూరులో టీడీపీకి పెద్ద దిక్కు లేని సమయంలో ప్రవీణ్ అండగా నిలిచిన మాట వాస్తవమే అయినప్పటికీ, సిటింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు లేవని ఇప్పుడిప్పుడే టీడీపీ అధిష్టానానికి తెలిసొచ్చింది. ప్రవీణ్ షో మాస్టర్ అని, లోకేశ్‌ను బుట్టలో వేసుకుని, రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారనే సమాచారం చంద్రబాబుకు చేరింది.
దీంతో ప్రవీణ్‌కు టికెట్ విషయమై చంద్రబాబు పునరాలోచనలో పడ్డారు. ఏ రకంగా చూసినా మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డే ప్రొద్దుటూరులో దీటైన అభ్యర్థిగా సర్వే నివేదికలు వెల్లడించాయి. ఇటీవల టీడీపీ పెద్దలు విజయవాడకు పిలిపించుకుని ఈ దఫా పెద్దాయన వరదరాజులరెడ్డికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారని, వచ్చే ఎన్నికల నాటికి బలపడాలని, అప్పుడు టికెట్ ఇస్తామని ప్రవీణ్‌కు చెప్పి పంపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ప్రవీణ్ విషయంలో లోకేశ్ తప్పును చంద్రబాబు సరిదిద్దారనే ప్రచారం జరుగుతోంది. అలాగే శ్రీకాళహస్తి ఇన్చార్జ్ బొజ్జల సుధీర్, చంద్రగిరిలో పులివర్తి నానికి లోకేశ్ టికెట్ ప్రకటించారు. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ చంద్రబాబు పునరాలోచన చేస్తున్నారు. మంచి అభ్యర్థుల కోసం చంద్రబాబు వేట సాగిస్తున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా బలమైన నాయకుల కోసం చంద్రబాబు ఇప్పటికే కొంత మంది కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలతో మాట్లాడినట్టు సమాచారం.
ఉమ్మడి విశాఖ జిల్లా పాయకరావుపేట టికెట్‌పై వంగలపూడి అనితకు లోకేశ్ హామీ ఇచ్చారని తెలిసింది. అనిత విషయంలోనూ చంద్రబాబు సానుకూలంగా లేరు. అనితకు టికెట్ ఇస్తే, ఆ సీటును వదులుకోవాల్సిందే అని సర్వే నివేదికలు చెబుతున్నాయి. దీంతో పాయకరావుపేట సీటును జనసేనకు ఇచ్చి, చేతులు దులిపేసుకోవాలని బాబు అనుకుంటున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టికెట్‌ను మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఇవ్వాలనేది లోకేశ్ అభిప్రాయం.
కానీ ఆమెకు టికెట్ ఇస్తే ఓడిపోతామని చంద్రబాబు నమ్ముతున్నారు. దీంతో పొత్తు ఫైనల్ అయిన తర్వాత ఆళ్లగడ్డ గురించి నిర్ణయం తీసుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా లోకేశ్ తన అనుకునే అందరికీ టికెట్లు ఇప్పించుకునే పరిస్థితి లేదు. లోకేశ్ పెత్తనం ఎక్కువైతే టీడీపీకి ప్రమాదమని సీనియర్ నేతలు చంద్రబాబును హెచ్చరించినట్టు సమాచారం.