ఏపీలో పొత్తు ఎపిసోడ్ కీలక దశకు చేరుకుంది. ఈ నెల 22న ఢిల్లీకి రావాలని జనసేనాని పవన్‌కల్యాణ్‌ను బీజేపీ పెద్దలు ఆహ్వానించినట్టు తెలిసింది. అది కూడా పవన్ ఒక్కడినే రావాలని కోరడం వెనుక ఉద్దేశం ఏమై వుంటుందో అనే చర్చకు తెరలేచింది.
ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను ఢిల్లీలో చంద్రబాబు కలిసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య పొత్తుపై చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో చంద్రబాబుతో పొత్తులో ఉన్న పవన్‌తో చర్చించేందుకు బీజేపీ అధిష్టానం పెద్దలు ఢిల్లీకి పిలిపించుకుంటున్నారు.
ముందుగా పవన్, బీజేపీ మధ్య ఒక అవగాహన వస్తే, ఆ తర్వాత మిగిలిన సంగతుల గురించి మాట్లాడుకోవచ్చని అనుకుంటున్నారు. జనసేన, బీజేపీకి కలిసి ఎన్ని సీట్లు ఇస్తారనే అంశాన్ని బట్టి పొత్తుపై ముందడుగు పడే అవకాశం వుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన పొత్తు కుదుర్చుకున్నాయి.
సీట్లపై మొదట ఎలాంటి అవగాహన లేదు.ఆ తర్వాత చంద్రబాబు, పవన్‌కల్యాణ్ పలు దఫాలు చర్చలు జరిపారు. సీట్లపై ఇద్దరి మధ్య అవగాహన వుందని అంటున్నారు. నిజంగా అవగాహనే వుంటే… పొత్తు ధర్మాన్ని చంద్రబాబు పాటించలేదని, ఆయనలాగే తాను జనసేన పోటీ చేసే స్థానాలను ప్రకటిస్తున్నానంటూ అన్నంత పని చేశారు. ఇలా టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పొత్తు దాగుడుమూతలాట ఉత్కంఠభరితంగా సాగుతోంది.
ఈ నేపథ్యంలో పవన్ ఢిల్లీ పర్యటన ఏపీ రాజకీయాల్లో హీటెక్కిస్తోంది. పవన్‌కల్యాణ్ జనంలో తిరగడం పూర్తిగా మానేయడం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. పొత్తుపైనే పవన్ ఆధారపడ్డారు. బీజేపీని తోడు తెచ్చుకుంటే టీడీపీ తోక తిప్పే అవకాశం వుండదనేది పవన్ భావన. పొత్తుపై ఎవరి మనసుల్లో ఏమున్నా… అంతిమంగా కుదురుతుందా? లేదా? అనేది ప్రధానాంశం. పొత్తుపై తలెత్తుతున్న ప్రశ్నలు, అనుమానాలకు పవన్ ఢిల్లీ పర్యటన సమాధానం ఇస్తుందనే ఆశ మూడు పార్టీల నేతల్లో వుంది.