పవన్ కల్యాణ్ సొంత పార్టీ నాయకులకు బిస్కెట్ వేస్తున్నారు.. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవవడం వలన.. చంద్రబాబు ఎదుట సాగిలపడడం వలన.. పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి మొదలై.. మొత్తం జనసేననే ముంచేసే పరిస్థితి ఏర్పడుతున్నదని ఆయన గుర్తించారు. అలాంటి ప్రమాదాన్ని ముందే పసిగట్టిన పవన్ కల్యాణ్ వారందరికీ ఎర వేసే ప్రయత్నంలో ఉన్నారు.
చంద్రబాబును ఒప్పించి.. తమ పార్టీకి బలం ఉన్నదని, తమ పార్టీ బలానికి తగినన్ని సీట్లు కావాలని అడిగి ఇప్పించుకోలేని దుస్థితిలో ఉన్న పవన్ కల్యాణ్.. తన సొంత పార్టీ వారికి నామినేటెడ్ పదవుల ఆశ చూపిస్తున్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తరవాత మూడో వంతు నామినేటెడ్ పదవులు తమ పార్టీ తరఫున దక్కించుకుందాం అని ఆయన చెప్పుకొస్తున్నారు. గెలిచిన తర్వాత ఏం జరుగుతుందనే సంగతి తరువాత.. ముందు ఎన్నికల్లో మూడో వంతు సీట్లు అడిగి ఇప్పించుకునే దమ్ము పవన్ కల్యాణ్ కు ఉందా? అని ప్రజలు విస్తుపోతున్నారు.
175 స్థానాలున్న ఏపీ ఎన్నికల్లో పోటీచేయడానికి అసలు పవన్ కల్యాణ్ జనసేనకు వాస్తవంగా ఉన్న బలం ఎంత? తెలుగుదేశం పార్టీ పల్లకీ మోయడానికి ఉత్సాహపడుతున్న పవన్ కల్యాణ్.. తన డిమాండ్ తో తాను ఊహించుకుంటున్న బలానికి తగినన్ని సీట్లు ఇప్పించుకోగలరా? లేదా? అనేది పార్టీ వర్గాల్లో ఉన్న పెద్ద సందేహం.
పవన్ కల్యాణ్ యాభై అడుగుతున్నారని, 20-30 సీట్లు మాత్రమే ఇవ్వడానికి తెలుగుదేశం సుముఖంగా ఉన్నదని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. చంద్రబాబు ఎన్ని ఇచ్చినా సరే.. జీ హుజూర్ అనడానికి పవన్ సిద్ధంగానే ఉన్నారు. పార్టీ వర్గాలను ఆయన ముందే సిద్ధం చేస్తున్నారు. కొన్ని అసంతృప్తులు వస్తాయి సర్దుకుపోవాలి.. అంతిమంగా జగన్ ను ఓడించడం ఒక్కటే లక్ష్యం అని గుర్తు పెట్టుకోవాలి అని వారికి ప్రబోధిస్తున్నారు. ఈ ప్రబోధాలు వింటే ఎంత ఘోరంగా పవన్ రాజీ పడతాడో అనే భయం కార్యకర్తలకు కలుగుతోంది.
ఇలాంటి సమయంలోనే ఆయన మరో విషయం బయటపెట్టారు. టికెట్ల అసంతృప్తి పార్టీ వారిలో రాకుండా నామినేటెడ్ పదవుల ఎర వేస్తున్నారు. మన ప్రభుత్వం ఏర్పడగానే మూడో వంతు పదవులు మనం ఇప్పించుకుందాం.. అని హామీ ఇస్తున్నారు. మూడో వంతు బలం జనసేనకు ఉన్నదనే నమ్మకం పవన్ కు ఉందా? ఉన్నట్లయితే.. మూడో వంతు ఎమ్మెల్యే సీట్లు ఆయన ఇప్పించుకోగలరా? అనేది పెద్ద ప్రశ్న.
175లో ఆరోంతు సీట్లు 30కు పరిమితం కాబోతున్న పవన్ కల్యాణ్.. గెలిచిన తర్వాత మూడోవంతు పదవులు ఎలా ఇప్పించుకోగలరు? పైగా ఒకవేళ ఆ కూటమి గెలిస్తే.. గెలిచిన తర్వాత.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కాయో.. ఆ దామాషాలోనే నామినేటెడ్ పదవులు కూడా ఉంటాయే తప్ప.. ఆయన కోరినన్ని ఇవ్వడం జరగదు. ఈ లాజిక్ కూడా చూసుకోకుండా.. పవన్ కల్యాణ్ తన పార్టీ వారిని దువ్వడానికి నామినేటెడ్ పదవవుల బిస్కట్ వేస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు.