విశాఖ స్టీల్ ప్లాంట్ మీద చినబాబు నారా లోకేష్ కి ప్రేమ ఎక్కువైంది. ఆయన ఉత్తరాంధ్రాలో గత పది రోజులుగా పర్యటిస్తున్నారు. శంఖారావం పేరుతో సభలు పెడుతున్నారు. ప్రతీ సభలో స్టీల్ ప్లాంట్ గురించే మాట్లాడుతున్నారు. ప్రైవేటీకరిస్తూంటే వైసీపీ ఏమీ అడగడం లేదని నిందించారు. ఇంకా ముందుకు వెళ్లి తమకు అనుకూలమైన ప్రైవేట్ కంపెనీ చేత కొనిపించాలని చూస్తోందని కూడా ఆరోపించారు.
తాము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్ ని రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని అదే నోటితో హామీ ఇచ్చేశారు. ఇక్కడే లోకేష్ దొరికిపోతున్నారు అని అంటున్నారు. స్టీల్ ప్లాంట్ మీద నిజంగా ప్రేమ ఉంటే ప్రైవేటీకరణను మేము వ్యతిరేకిస్తున్నామని గట్టిగా ఎందుకు చెప్పరని ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.
స్టీల్ ప్లాంట్ ని కొంటామని అంటే అమ్మకానికి కేంద్రం చేసే చర్యలకు ఓకే అని చెప్పడమేనా అని మండిపడుతున్నాయి. స్టీల్ ప్లాంట్ ని అమ్మేస్తున్నారు అని చెప్పడమే తప్ప ఎవరు అమ్ముతున్నారో ఆ బీజేపీని ఎందుకు పల్లెత్తు మాట అనలేకపోతున్నారు అని ప్రశ్నలు వస్తున్నాయి.
బీజేపీతో పొత్తులకు వెళ్తున్న టీడీపీ ఆ పార్టీని అసలు విమర్శించకూడదు అని భావిస్తోంది అని అంటున్నారు. రైల్వే జోన్ విషయంలో విశాఖ మెట్రో ప్రాజెక్ట్ విషయంలో వైసీపీతో పాటు బీజేపీని నిందిస్తే లోకేష్ విశాఖ వాసుల పక్షాన ఉన్నారు అని అనుకోవచ్చు కానీ కేవలం వైసీపీనే తప్పు పట్టడం రాజకీయమే అని అంటున్నారు.
లోకేష్ అనకాపల్లి సభలో వాలంటీర్ల మీద కూడా విమర్శలు చేశారు. వాలంటీర్లు టీడీపీ మీద దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆయన విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే వైసీపీ పధకాలు ఆగిపోతాయని వాలంటీర్లు చెబుతున్నారని లోకేష్ ఫైర్ అయ్యారు. తాము అధికారంలోకి వస్తే సూపర్ సిక్స్ పధకాలు అమలు చేస్తామని లోకేష్ అంటున్నారు.