ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైసీపీ ఒంటరిగా కదనరంగానికి సిద్ధమైంది. ప్రతిపక్షాల్లో ఇంకా స్పష్టత రాలేదు. కానీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాలు అన్నీ ఏకమయ్యాయి. అయితే ఈ పార్టీలన్నీ విడివిడిగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నాయి. ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై వ్యతిరేకత నింపడానికి అన్ని పక్షాలు ఒకే లక్ష్యంతో ముందుకెళుతున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రతిపక్షాల్ని ఎదుర్కోవడంలో వైసీపీ వెనుకబడిందనే చెప్పాలి. చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్ తదితర ప్రతిపక్ష నేతల్నివిమర్శించడానికి వైసీపీ నుంచి నలుగురైదుగురు మాత్రమే కనిపిస్తున్నారు. అది కూడా వైసీపీలోని కాపు సామాజిక వర్గ నేతలే జగన్ వైపు వకల్తా పుచ్చుకుని మాట్లాడ్డానికి ఉత్సాహం చూపుతున్నారు. ఇక జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన నేతల్లో ఒకే ఒక్క నాయకురాలు మంత్రి ఆర్కే రోజా మాత్రమే దూకుడు ప్రదర్శిస్తున్నారు.
వైసీపీలో తోపు అనే పేరున్న నాయకులు కూడా వ్యూహాత్మకంగానే మౌనాన్ని ఆశ్రయించారని చెప్పొచ్చు. మంత్రి పదవులు పోగొట్టుకున్న వాళ్లు, అలాగే అమాత్య పదవులు రాలేదని ఆగ్రహంగా ఉన్న వాళ్లు, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వ పెద్దలు తగిన చేయూత అందించలేదని మరికొందరు… ఇలా ఒక్కొక్కరి అసంతృప్తికి ఒక్కో కారణం. మొత్తంగా మనమెందుకు వైఎస్ జగన్ తరపున మాట్లాడి ప్రత్యర్థులకు టార్గెట్ కావాలనే ఆలోచనతో అంతా సర్దుకుంటున్నారు.
వైసీపీ సమాచార విభాగం నుంచి నాయకులకు ఫోన్ చేసి పలానా అంశంపై ప్రత్యర్థులను టార్గెట్ చేస్తూ మాట్లాడాలని సూచించినా, ఎవరూ ముందుకు రాలేదని సమాచారం. ఒకవైపు మీడియాలో మాత్రం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు సన్నిహితమని గుర్తింపు పొందిన నేతలు సైతం మీడియాకు ముఖం చాటేస్తున్నారు. మరోవైపు ప్రతిపక్ష నేతలు అధికార పక్షంపై చెలరేగిపోతున్నారు.
వైసీపీ నేతలందరి బాధ… తమను ముఖ్యమంత్రి గత నాలుగేళ్లలో పట్టించుకోలేదని, తగిన పోస్టులు ఇవ్వలేదని చెబుతున్నారు. రానున్న రోజుల్లో టికెట్ విషయమై క్లారిటీ లేకపోవడంతో, అనవసరంగా చంద్రబాబును విమర్శించి అవకాశాన్ని జారవిడుచు కోవడం ఎందుకనే ఆలోచనలో ఉన్నారు.
జగన్ ప్రభుత్వంలో లబ్ధి పొందని నాయకులు మౌనాన్ని ఆశ్రయిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. వైసీపీ ప్రభుత్వంలో కీలక పదవులు, సంపాదన పొందిన నేతలు కూడా ఇప్పుడు వైఎస్ జగన్ తరపున ప్రతిపక్షాలను టార్గెట్ చేయడానికి వెనుకాడతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే తప్పించుకుని తిరుగుతున్నారు. ఇలాగైతే రానున్న రోజుల్లో పార్టీ వాయిస్‌ను బలంగా వినిపించేదెవరనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది