నాయకుడంటే ఎవరు? ప్రజల సమస్యల్ని తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేసేవాళ్లే నాయకులుగా ఎదుగుతారు. అందుకే రాజకీయాల్లోకి రావాలని అనుకునే వారు మొదటగా ప్రజల దగ్గరికి వెళ్తారు. వారి ఇబ్బందులను అడిగి కనుక్కుంటారు. తనకు చేతనైన మేరకు వారికి ఆర్థికంగా, హార్థికంగా అండగా నిలిచేందుకు యత్నిస్తున్నారు. తమ కోసం ఎందాకైనా వస్తారనే నమ్మకాన్ని, భరోసాను ప్రజల్లో కలిగించేందుకు నాయకులు నడుచుకుంటారు.
కానీ జనసేనాని పవన్‌కల్యాణ్ రాజకీయ పంథా తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. టాలీవుడ్ అగ్రహీరోగా ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. పవన్ ఒక్క పిలుపు ఇస్తే చాలు… చెప్పింది చేయడానికి లక్షల్లో అభిమానులు ఉన్నారు. ఇదంతా సినిమాల్లో పవన్ హీరోయిజాన్ని చూసి పెంచుకున్న అభిమానమే. కానీ రాజకీయ తెరపై పవన్ ఏంటనేది ఇంత వరకూ అర్థం కావడం లేదు. రాజకీయాల్లో గెలుపే ప్రామాణికం కాబట్టి, రెండు చోట్ల ఓడిపోయిన పవన్‌ను ప్రత్యర్థులు విలన్‌గా, అభిమానులు మరో రకంగా చూస్తున్నారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వారాహి యాత్ర పేరుతో పవన్ జనంలోకి వెళ్లారు. పవన్ ప్రసంగాలను గమనిస్తే… అసలు ఇతనికి కనీస నాయకత్వ లక్షణాలున్నాయా? అనే అనుమానం కలుగుతోందని పొలిటికల్ ఎనలిస్ట్‌లు అంటున్నారు. ఇందుకు వారు చెప్పే లాజిక్ ఏంటంటే… జనం సమస్యల గురించి కాకుండా, తన వ్యక్తిగత ఇబ్బందులను, అవమానాల్ని ఏకరువు పెట్టడాన్ని గుర్తు చేస్తున్నారు. నాయకులెవరూ ఇలా చెప్పరంటున్నారు.
జనం వద్దకెళ్లి తన తల్లి, భార్య, ఇతర కుటుంబ సభ్యుల్ని వైఎస్ జగన్ అలా తిట్టారు, ఇలా తిట్టారని ఆక్రోశించడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల విమర్శలను ఎదుర్కోవాలే తప్ప, బేలగా వాటి గురించి జనానికి చెబితే వారేం చేస్తారని నిలదీస్తున్నారు. చావుకు భయపడనని పదేపదే చెప్పడం జనానికి అసహనం కలిగిస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఒక్క మాటలో చెప్పాలంటే తన వ్యక్తిగత సమస్యల్ని, కుటుంబ బాధల్ని జనం ముందు ఉంచి సానుభూతి పొందాలనుకునే వారెవరూ నాయకులు కానేకారనేది వ్యక్తిత్వ వికాస నిపుణుల అభిప్రాయం. అలా ఎవరైనా చెబుతున్నారంటే, పిరికివాళ్లగా జమ కట్టాల్సి వుంటుందని తేల్చి చెబుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క పవన్‌కల్యాణ్ మినహాయిస్తే, మరే రాజకీయ నాయకుడు తన భార్యను, తల్లిని, కూతుర్ని ప్రత్యర్థులు తిడుతున్నారని పెద్దగా చెప్పిన దాఖలాలు లేవు. ఒకవేళ అలాంటివి ఏవైనా వుంటే చట్ట ప్రకారం ఫిర్యాదులు చేస్తే సరిపోతుందని, అంతే తప్ప వాటిని రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకోవాలని అనుకోవడం నీచత్వం అవుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే పవన్‌వి అసలు నాయకత్వ లక్షణాలేనా? అనే ప్రశ్న తలెత్తడం.