మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నాయకుడు బుద్ధా వెంకన్న రోజురోజుకూ ఏదోలా అయిపోతున్నారు. ఆయన్ను చూస్తే, రాజకీయ ప్రత్యర్థులు సైతం అయ్యో పాపం అని సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. రక్తాభిషేకం చేసినా, చివరికి ప్రాణాభిషేకం చేసినా చంద్రబాబు మనసు చలించదని బుద్ధాకు ఇంకా తెలిసినట్టు లేదు. టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబుకు ఓ లెక్క వుంటుంది. బుద్ధాకు టికెట్ ఇస్తే, రక్తం ఖర్చు చేయడం తప్ప, జేబులో నుంచి పైసా తీయడని తెలియనంత అమాయకుడు కాదు చంద్రబాబు.
విజయవాడ వెస్ట్ అసెంబ్లీ లేదా అనకాపల్లి పార్లమెంట్ టికెట్‌ను బుద్ధా వెంకన్న ఆశిస్తున్నారు. నిజంగా వెంకన్నకు అంత సీన్ వుంటే, ఈ పాటికి ఎన్నికల బరిలో నిలిపి వుండేవారు. కానీ బుద్ధా ఆ వాస్తవాన్ని గ్రహించడం లేదు. టికెట్ కావాలంటూ ఇటీవల భారీ ర్యాలీ నిర్వహించారు. కనకదుర్గ అమ్మ వారి ఆలయంలో పూజలు చేశారు. అన్నీ బాగున్నాయి. అయితే ఎన్నికల్లో పోటీకి తగినన్ని ఆర్థిక వనరులుండాలనే విషయాన్ని బుద్ధా వెంకన్న విస్మరిస్తే ఎట్లా? అని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.
ఇవాళ బుద్ధా వెంకన్న తమ అధినాయకుడు చంద్రబాబు వరం కోసం మరో వినూత్న కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకంగా చంద్రబాబు కటౌట్‌కు రక్తాభిషేకం చేసి మీడియా దృష్టిని ఆకర్షించారు. తన రక్తంతో చంద్రబాబు జిందాబాద్ అని రాశారు. అలాగే నా ప్రాణం మీకే అంటూ క్యాప్షన్‌ను జత చేశారు. చంద్రబాబే తనకు ప్రాణం అని భావిస్తున్నప్పుడు , టికెట్ కోసం ఇన్ని జిమ్మిక్కులు ఎందుకని జనసేన, టీడీపీ నేతలు పోతిన మహేశ్, జలీల్‌ఖాన్ అనుచరులు ప్రశ్నిస్తున్నారు.
చంద్రబాబుకు ఇలాంటి ఛీప్ ట్రిక్స్ బాగా తెలుసని, బుద్ధాకు టికెట్ ఇస్తే ఏమి అమ్ముకుంటారో కూడా గుర్తించడం వల్లే ఆయన్ను దూరం పెట్టారని టీడీపీ నేతలు అంటున్నారు. వెంకన్న మీడియా పులి అని, అతనికి అంత సీన్ లేదని సొంత పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.