ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల తనయుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించి పబ్లిసిటీ కొరవడింది. రాజస్థాన్‌లోని జోథ్‌పుర్‌లో షర్మిల తనయుడు రాజారెడ్డి, ప్రియా అట్లూరి వివాహం శనివారం జరిగింది. గత నెల 18న హైదరాబాద్‌లో వాళ్లిద్దరి నిశ్చితార్థ వేడుక జరిగిన సంగతి తెలిసిందే. నిశ్చితార్థానికి బాగానే ప్రచారం వచ్చింది.
కానీ వివాహ వేడుకను ఎవరూ పట్టించుకోలేదు. అసలు పెళ్లైన సంగతిని మీడియా కూడా విస్మరించింది. దీనికి ప్రధాన కారణం షర్మిల తనయుడి పెళ్లికి ఏపీ సీఎం వైఎస్ జగన్ వెళ్లకపోవడమే. ఆ వేడుకకు జగన్ హాజరై వుంటే మీడియా దృష్టి సారించేది. గత నెలలో నిశ్చితార్ధానికి జగన్ దంపతులు వెళ్లడం, గ్రూప్ ఫొటో తీసుకోడానికి తన చెల్లిని స్వయంగా జగన్ ఆహ్వానించినా, ఆమె నిరాకరించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
అన్నను పెళ్లికి పిలిచి అవమానించేలా షర్మిల ప్రవర్తించారనే విమర్శ వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో మేనల్లుడి వివాహానికి సీఎం జగన్ దంపతులు వెళ్లకపోవడం గమనార్హం. బహుశా బిజీగా వుండడం లేదా గత నెలలో చేదు అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని జగన్ వెళ్లకపోయి వుండొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజస్థాన్‌లో షర్మిల కుమారుడి వివాహానికి విజయమ్మ మినహాయిస్తే, వైఎస్ కుటుంబ సభ్యులెవరూ హాజరు కాలేదని సమాచారం. అలాగే రాజకీయ ప్రముఖులు కూడా వెళ్లినట్టు లేదు. హైదరాబాద్‌లో నిర్వహించే రిసెప్షన్‌కు రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు హాజరు కావచ్చని సమాచారం.