పెద్ద సినిమా మూడేళ్లు తీస్తే ‘డబ్బుల్’

టాలీవుడ్ లో ఫైనాన్స్ కు అఫీషియల్ వడ్డీ నూటికి రెండు రూపాయిలు. ఇది ఫుల్ వైట్ గా తీసుకుంటే. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగితే. సంక్రాంతికి విడుదలైన ఓ భారీ సినిమాకు ఇలా…

టాలీవుడ్ లో ఫైనాన్స్ కు అఫీషియల్ వడ్డీ నూటికి రెండు రూపాయిలు. ఇది ఫుల్ వైట్ గా తీసుకుంటే. బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ జరిగితే. సంక్రాంతికి విడుదలైన ఓ భారీ సినిమాకు ఇలా వైట్ లోనే వంద కోట్లు ఫైనాన్స్ తీసుకున్నారు అని టాక్. దాదాపు ఏడాది పైగా సాగిన ఆ సినిమాకు కట్టిన వడ్డీ ఎంతయి వుంటుంది ఈ లెక్కన. అనఫిషియల్ వడ్డీ రెండున్నర నుంచి ఆ పైన.. అవసరాన్ని .. టైమ్ ను బట్టి.

సినిమాలు చకచకా తీసేస్తే ఏ సమస్యా లేేదు. ఎందుకంటే అమ్మకాలు కూడా అదే రేంజ్ లో వుంటాయి కనుక, లాభంలో కొంత మొత్తం వడ్డీలకు పోయింది అనుకుంటారు. కానీ అలా కాకుండా సినిమాకే ఏళ్లూ, పూళ్లూ పట్టేస్తే మాత్రం లాభాలు కాస్తా వడ్డీలకే పోతాయి. భారీ సినిమా తలపెట్టి రెండు మూడు వందల కోట్లు ఫైనాన్స్ తీసుకుని, మూడేళ్లకు పైగా నిర్మాణంలో వుంచితే, ఎంత అసలు అయితే వడ్డీ అంత అవుతుంది.

ఈ మధ్య చాలా తెలుగు సినిమాల పరిస్థితి ఇదే. పెద్ద హీరోల సినిమాలు ఏవీ ఏడాది, ఏడాదిన్నరలో పూర్తి కావడం లేదు. రెండు నుంచి మూడేళ్లు పడుతున్నాయి. సినిమా ప్రారంభంలోనే ఫండింగ్ డ్రా చేస్తున్నారు. అది వేరే సినిమాలకు వాడుతున్నారా, వేరే విధంగా ఉపయోగపడుతోందా అన్నది వేరే సంగతి. ఈ ప్రాజెక్ట్ మీద భారం మాత్రం పడుతోంది.

పెద్ద నిర్మాణ సంస్థలు అన్నీ పైకి బలంగా కనిపిస్తున్నాయి కానీ క్యాష్ క్రంచ్ తో బాధపడుతున్నాయి. పక్క రాష్ట్ర డైరక్టర్ తో ఓ భారీ సినిమా నిర్మాణం తలపెట్టిన సంస్థ అలా పెట్టుబడులు పెడుతూ వెళ్తోంది. దాని వల్ల మరో సినిమా అన్న ఆలోచనలు తగ్గించుకోవాల్సి వస్తోంది. ప్రాజెక్టులు అన్నీ డిస్కషన్ లో వుంచుతూ ముందుకు సాగుతున్నారు.

మరో పెద్ద సంస్థకు అనేక రకాల ఫండింగ్ వుంది. అటు విదేశీ మిత్రులు, ఇటు స్వదేశీ మిత్రులు. వాళ్లందరికీ కూడా రెండు రూపాయల వడ్డీ ఇవ్వాల్సి వుంది. దాంతో వాళ్లు కూడా మిగిలిన ప్రాజెక్టులను మెల మెల్లగా ముందుకు తీసుకెళ్తున్నారు.

గతంలో నాన్ థియేటర్, హిందీ డబ్బింగ్ డబ్బులు ముందుగా వచ్చే అవకాశం వుండేది. కానీ ఇప్పుడు ఆ ఛానెల్ చాలా వరకు తగ్గింది. సినిమా సినిమాకు ఫండింగ్ ఇవ్వడానికి ఫైనాన్సియర్లు రెడీనే. కానీ సినిమాలు చకచకా పూర్తి కాకుండా ఏళ్లూ పూళ్లు పడితే మాత్రం లాభాలు కేవలం వడ్డీలకే ఇవ్వాల్సి వుంటుందన్నది టాలీవుడ్ అనుభవజ్ఙుల మాట.