వైసీపీ వద్దనుకున్న నేతలకు ప్రత్యామ్నాయంగా జనసేన కనిపిస్తుండడం విశేషం. పర్చూరు నూతన సమన్వయకర్తగా ఎడం బాలాజీని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వ్యవహారశైలి నచ్చకపోవడం, ఎట్టి పరిస్థితుల్లోనూ చీరాల నుంచే పోటీ చేస్తానని ఆమంచి చెబుతుండడంతో అధిష్టానం ఆయన్ను తప్పించింది. ఈ నేపథ్యంలో ఆమంచి పయనం ఎటు అనే చర్చకు తెరలేచింది.
జనసేనలో ఆమంచి కృష్ణమోహన్ చేరతారని సమాచారం. ఇప్పటికే ఆయన తమ్ముడు సాములు జనసేనలో చేరారు. చీరాలలో జనసేన కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఎమ్మెల్యే కరుణం బలరామకృష్ణమూర్తి, ఆమంచి సోదరుల మధ్య వ్యక్తిగత వైరం వుంది. దీంతో చీరాలలో కరుణం బలరామ్‌కు వ్యతిరేకంగా వైసీపీలో గ్రూప్ రాజకీయాలను నడుపుతున్నారని ఆమంచిపై ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయమై ఆమంచిపై సీఎం జగన్ సీరియస్ అయ్యారు.
పర్చూరు సమన్వయకర్తగా ఆమంచిని నియమించినప్పటికీ, అయిష్టంగా కొనసాగుతున్నారు. చీరాలలో వైసీపీ ఇన్‌చార్జ్ కరుణం వెంకటేశ్‌బాబుకు వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే వున్నారు. వైసీపీ ముఖ్య నేతలతో ఆమంచికి సత్సంబంధాలు లేవు. దీంతో ఆమంచిని తప్పించి ఎడం బాలాజీని పర్చూరుకు సమన్వయకర్తగా నియమించారు.
ఈ నేపథ్యంలో జనసేనలో చేరి, పొత్తులో భాగంగా చీరాల నుంచి పోటీ చేయాలని ఆమంచి భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కరుణం చేతిలో ఆమంచి ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి కరుణం తనయుడితో తలపడాలని ఆమంచి ఉత్సాహ పడుతున్నారు. అయితే టీడీపీని కాదని, జనసేనకు టికెట్ ఇచ్చే పరిస్థితి ఎంత వరకు వుందనే ప్రశ్న ఉత్పన్నమైంది.